నర్మెట/నర్సింహులపేట/మహదేవపూర్: అప్పుల బాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వేసిన పంట నష్టపోగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ కౌలు రైతు ఉన్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో నూనె రాజశేఖర్ (28) రెండెకరాల్లో పత్తి సాగు చేయగా, పంట దిగుబడి ఆశించినమేర రాలేదు. గతంలో పంటసాగుకోసం చేసిన అప్పుతోపాటు తాజా అప్పు రూ.3 లక్షలకు చేరుకుంది.
దీనికితోడు ఇటీవల రాజశేఖర్‌కు ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం మరో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో అప్పులు తీర్చేదారి లేక మంగళవారం సెంట్రింగ్ కూలిపనికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం గ్రామానికి సమీపంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సదానందం తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్రుతండాకు చెందిన జాటోతు బొద్యా (55) తనకున్న ఎకరం భూమిలో మిరప సాగు చేశాడు. సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట అమ్మడంతో రూ.15వేలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు కూతురు వివాహానికి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు తీర్చేదారిలేక మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రూ.10 లక్షల అప్పు తీర్చలేక..
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లికి చెందిన పుట్ట రవి (38) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. కౌలుకోసం రూ.30 వేలతోపాటు పంట సాగుకు ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు తెగుళ్లు సోకి పంట పూర్తిగా నాశనమైంది. దీంతో మనోవేదనకు గురైన రవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment