పోగొట్టుకున్న చోటనే వెతకాలి..! | Despite Losses Telangana Farmers To Cultivate The Chilli Crop | Sakshi
Sakshi News home page

పోగొట్టుకున్న చోటనే వెతకాలి!.. తగ్గేదేలే అంటున్న మిర్చి రైతులు

Published Sun, Oct 2 2022 8:04 AM | Last Updated on Sun, Oct 2 2022 8:29 AM

Despite Losses Telangana Farmers To Cultivate The Chilli Crop - Sakshi

మహబూబాబాద్‌ సమీపంలోని గడ్డిగూడెంతండాలో మిరప మొక్కలు నాటుతున్న కూలీలు

సాక్షి, మహబూబాబాద్‌: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎర్రబంగారం పండిస్తే సిరులు కురుస్తాయని ఆశపడి మిర్చి సాగు చేసిన రైతులకు తామర పురుగు, నల్లిపురుగు, పేను బంక పురుగు చుక్కలు చూపించాయి. దుక్కి దున్నడం నుంచి ఏపుగా పెరిగి.. కాత, పూత సమయంలో ఈ మాయదారి పురుగు రావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 70 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టాల పాలయ్యారు. ఒక్క మహబూబాబాద్‌ జిల్లాలోనే 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

గతేడాది మిరప పూతకు ఆశించిన తామర పురుగు(ఫైల్‌)    

తగ్గేదేలే అంటూ మిర్చి సాగు..  
గత ఏడాది మిర్చి పంట సాగుచేసి నష్టపోయినా.. రైతులు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు మళ్లీ ఈ ఏడాది కూడా అదే పంట సాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,88,182 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 1,03,537 ఎకరాల్లో సాగుచేయగా.. మహబూబాబాద్‌ జిల్లాలో 82,434 ఎకరాలు, జోగుళాంబ గద్వాలలో 35,309, భద్రాద్రి కొత్తగూడెంలో 32,375, జయశంకర్‌ భూపాలపల్లిలో 30,499 ఎకరాలు సాగుచేశారు. గత ఏడాది నష్టాలను చూసిన అధికారులు.. ఈ ఏడాది మిర్చి సాగుచేసే వారు పెద్దగా ఉండరని భావించారు. కానీ వారి అంచనాలు తారుమారు చేసి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా, మహబూబాబాద్‌లో 70 వేల ఎకరాలకు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 28 వేల ఎకరాలపైగా సాగుచేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల ఎకరాలకు పైగా సాగుచేశారని, ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

గత ఏడాది 2 లక్షలు నష్టం 
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం కొత్తూరు(సీ) గ్రామానికి చెందిన రైతు సోమిరెడ్డి లక్ష్మయ్య గత ఏడాది ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంటకు వైరస్‌ సోకింది. అనేక మందులను పిచికారీ చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పెట్టుబడితోపాటు భార్యాభర్తల కష్టం సైతం నేలపాలైంది. ఇతర పంటలు వేస్తే కలిసి రాదనే భావనతో లక్ష్మయ్య ఈ ఏడాది కూడా మిర్చి పంట వేశాడు. ఇప్పటివరకు రూ.70వేలు ఖర్చు చేశాడు. తోటలో అక్కడక్కడా బొబ్బరోగం కనిపిస్తోంది. తామర పురుగు కూడా ఆశిస్తే పెట్టుబడి అప్పులు కుప్పలుగా పేరుకుపోయే ప్రమాదం ఉంది. సాఫీగా పంట పండితే అప్పులు తీరుతాయని లక్ష్మయ్య చెప్పాడు. 

వేరే పంట వేయలేక.. 
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన రైతు మడికంటి శ్రీను గత ఏడాది మూడు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. రూ.మూడు లక్షల పెట్టుబడి పెట్టాడు. కానీ మూడు క్వింటాళ్ల మిర్చికూడా పండలేదు. దీంతో చేసిన కష్టంపోగా పెట్టుబడి అప్పుగానే మిగిలింది. ‘వేరే పంట వేయలేక.. నష్టపోయిన మిర్చి పంటవేసి పోగొట్టుకున్న చోటనే వెతకాలి.. తాడోపేడో.. తేల్చుకునేందుకు ఈ ఏడాది కూ­డా మూడెకరాల్లో మిర్చి పంట వేశా’నని శ్రీను చెప్పాడు.

జాగ్రత్తలు పాటిస్తే పంటను రక్షించుకోవచ్చు 
మిరప పంటను ఆశించే నల్లతామర పురుగుకు మందులేదు. కానీ జాగ్రత్తలు పాటించి, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను రక్షించుకోవచ్చు. పంట చుట్టూ జొన్న, సజ్జ పంటలు రెండు మూడు వరుసల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు. నీలిరంగు జిగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున పెట్టుకోవాలి. వేపనూనె, కానుగ నూనె, పలుసార్లు పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ కారకాలు, భవేరియా బాసియానా లేదా లెకానిసీలియం లెకానీని తగిన మోతాదుల్లో స్ప్రే చేయాలి. తామర పురుగు నివారణకు వాడే పురుగు మందులు ఒకే మందును పలుమార్లు కొట్టొద్దు. ఎప్పటికప్పుడు మందు మార్చాలి. నాటిన 15వ రోజు, 45వ రోజున ఫిప్రోనిల్‌ గుళికలను వేయాలి.

– కె.భాస్కర్, ఉద్యాన శాస్త్రవేత్త, (జేవీఆర్‌ ఉద్యాన పరిశోధనా కేంద్రం, మల్యాల)

ఇదీ చదవండి: తెలంగాణలో ‘స్పినోడాన్‌’ శిలాజాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement