దారుణమా? | Make on the phone with credit problems | Sakshi
Sakshi News home page

దారుణమా?

Published Thu, Aug 13 2015 11:32 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

దారుణమా? - Sakshi

దారుణమా?

రైతులకు భరోసా!
- రుణాల ఇబ్బందులపై ఫోన్ చేయండి
- సమస్యలను తీరుస్తామని బ్యాంకర్ల హామీ
- సెప్టెంబర్ 20లోగా వంద శాతం రుణాల పంపిణీ
- రైతులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండండి
- వ్యవసాయ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
రైతన్నలూ మీరు పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి.. తిరిగి అలిసిపోయారా? మీ పాత రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదా? రుణాలు అడిగితే స్థానిక బ్యాంక్ మేనేజర్ రేపు మాపంటూ విసిగిస్తున్నారా? పంట అదును దాటిపోతున్నా రుణం చేతికందడం లేదా? బ్యాంకు అధికారుల తీరు మీకు ఇబ్బందికరంగా ఉందా? అయితే మీ ఖాతా ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు అధికారులకు నేరుగా ఫోన్ చేయండి.

ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరిస్తామని ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ  మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తమకు ఒక్క ఫోన్ కొడితే స్పందిస్తామని, సెప్టెంబర్ 20 లోగా రైతు రుణాలను 100 శాతం పూర్తి చేస్తామని వారు మంత్రికి మాటిచ్చారు.
 
గురువారం కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో పంట రుణాలు, రుణమాఫీ అమలుపై  సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది రూ 1997.25 కోట్ల పంట రుణాలు అందించాల్సి ఉండగా.. బ్యాంకులు ఇప్పటి వరకు కేవలం రూ 241.57 కోట్లు మాత్రమే  రైతులకు రుణాలు ఇచ్చాయి. రైతు రుణమాఫీ రెండవ ఫేజ్ కింద రాష్ట్రం విడుదల చేసిన రూ 485 కోట్లను బ్యాంకులు ఇప్పటి వరకు క్రెడిట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటం, మరో వైపు జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురుస్తుండటంతో  మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
 
లీడ్ బ్యాంక్ అథమ స్థానం..
జిల్లాలో లీడ్ బ్యాంక్‌గా ఉన్న ఎస్‌బీఐ రైతుల పంట రుణాలు ఇవ్వడంతో అథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది మొత్తం రూ. 580 కోట్ల టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం రూ. 70 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. అది కూడా అంకెల గారడీ చేసిన చూపిన లెక్కలే. దీనిపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. లీడ్ బ్యాంక్ అధికారుల తీరుపై మండిపడ్డారు.  బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయకుండానే  ఫీల్డు విజిట్ ఫీజు వసూలు చేస్తున్నారని, దీనితో పాటు ప్రాసెస్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారని సిద్దిపేట వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు.

అలాగే.. రైతులతో మొత్తం రుణాలు కట్టించుకొని వారి ఖాతాలు మూసివేసి, ఇక కొత్త రుణాలు ఇవ్వడం లేదని, రెండో ఫేజ్‌లో రైతుల ఖాతాలో పడిన డబ్బును కూడా తిరిగి ఇవ్వడం లేదని జహీరాబాద్ వ్యవసాయ అధికారి టీ ప్రవీణ, బ్యాంకుల్లో తగినంత సిబ్బంది లేక రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు చెప్పలేక బ్యాంకర్లు నీళ్లు నమిలారు.

సాఫ్ట్ వేర్‌లో సమస్యలు ఉత్పన్నం అయ్యాయని మరో బ్యాంకు అధికారి, అధికారిక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు బ్రాంచ్ మేనేజర్ వరకు అందక పోవడంతో ఇబ్బంది ఏర్పడినట్లు మరొక బ్యాంక్.. రోజుకు రూ. నాలుగు కోట్లు ఇచ్చినా రుణాలు తరగటం లేదని మరో బ్యాంకు.. ఇలా ఎవరికి వారుగా తలో సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 20 లోపు రుణాలు అందిస్తామని ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. దీంతో స్పందించిన హరీశ్‌రావు..  సెప్టెంబర్ 21న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు 100 శాతం రుణాలు పంపిణీ చేసి, ఆయా నివేదికలతో రావాలని అధికారులకు చెప్పారు. రైతులకు సహకరించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
 
రైతులకు అందుబాటులో ఉండాలి: మంత్రి హరీశ్‌రావు
‘జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వ్యవసాయ అధికారులు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి అన్నారు. వారం రోజుల పాటు అధికారులు స్థానికంగా ఉండాలన్నారు. కరువులో గుండె నిబ్బరం కోల్పోతున్న రైతాంగానికి ధైర్యం చెప్పాలని, వారిలో ఆత్మ విశ్వాసం పెంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రైతులు ఇబ్బడిముబ్బడిగా బోర్లు వేసుకుని అప్పుల పాలవుతున్నారని, దీని నివారించే విధంగా రైతులకు నచ్చజెప్పాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ఈ ఏడాది వాళ్లు వేయాల్సిన పంటలు వివరాలు చెప్పి, ఎప్పటికప్పుడు వారి కుటుంబంలో ధైర్యం నూరిపోయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.   కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట, బాబూమోహన్, చింతాప్రభాకర్,గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీలు సూధాకర్‌రెడ్డి, రాములు నాయక్, కలెక్టర్  తదితరులు పాల్గొన్నారు.
 
ఎస్‌బీఐ ఏజీఎం 9949098409, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం 9100105454
గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏజీఎం 9440903949, లీడ్ బ్యాంక్  9849530020

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement