Debt Recovery Tribunal
-
రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!
న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్ షేర్లను ఎస్బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది. ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్టీ విక్రయించింది. జూన్ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇలా రాబట్టారు.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. -
పీఎన్బీకి 7,200 కోట్లు చెల్లించండి
పుణే: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ. 7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని రుణ రికవరీ ట్రిబ్యునల్ శనివారం ఆదేశించింది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు అనుకూలంగా రుణ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దీపక్ కుమార్ రెండు ఉత్తర్వులు జారీ చేశారు. ‘జూన్ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తుదారునికి (పీఎన్బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు డీఆర్టీ ఉత్తర్వులో పేర్కొంది. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్‌ని ఆదేశించారు. లేనిపక్షంలో అధికారులు తదుపరి చర్యలను ప్రారంభిస్తారని ట్రిబ్యునల్ అధికారి స్పష్టం చేశారు. -
మాల్యాకు మరిన్ని చిక్కులు..
♦ మనీ ల్యాండరింగ్ కేసు పెట్టిన ఈడీ ♦ డియాజియో ఇచ్చే సొమ్ముపై ♦ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆంక్షలు... ముంబై: వ్యాపారవేత్త విజయ్ మాల్యాని మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంకుకు రూ. 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ). ఇదే అంశానికి సంబంధించి సీబీఐ గతేడాది నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దాఖలు చేసింది. లోన్ మంజూరు చేయడంలో రుణ పరిమితుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఐడీబీఐ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులపై, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ డెరైక్టరు మాల్యాపై, సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో అంశాల ఆధారంగానే తాజాగా ఈడీ కూడా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం కార్యకలాపాలు నిల్చిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక స్వరూపం గురించి విచారణ చేయడంతో పాటు విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా విజయ్ మాల్యా సహా ఇతరులను ఈడీ ప్రశ్నించనుందని ఆయా వర్గాలు వివరించాయి. సదరు బ్యాంకు నుంచి, సంబంధిత వర్గాల నుంచి కీలక పత్రాలను ఈడీ సేకరించినట్లు పేర్కొన్నాయి. డీఆర్టీలో మాల్యాకు చుక్కెదురు .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాల కేసుకు సంబంధించి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో మాల్యాకు చుక్కెదురైంది. రుణ ఎగవేత వివాదాన్ని ఎస్బీఐతో పరిష్కరించుకునే దాకా ఆయనకు ఇచ్చే 75 మిలియన్ డాలర్లను విడుదల చేయకుండా నిలుపుదల చేయాలంటూ డియాజియోను డీఆర్టీ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంనకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు రూ. 7,800 కోట్లు బకాయిపడిన సంగతి తెలిసిందే. వీటిని రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ప్రకటించాయి. ఇదే సమయంలో యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకు గాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడింది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్టీని ఆశ్రయించింది ఎస్బీఐ. దీనిపైనే డీఆర్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
డీఆర్టీలో కేసులకు లోక్ అదాలత్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకుండా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ) పేర్కొంది. వివాదాలు తక్కువగా ఉన్న 31 కేసులను హైకోర్టు మాజీ జడ్జి రాములు నేతృత్వంలోని లోక్‌అదాలత్‌కు బదలాయించినట్లు డీఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ సాయి మోహన్ తెలిపారు. ఈ నెల మూడవ శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో రూ.48.50 కోట్లకు సంబంధించి 4 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు లోక్ అదాలత్‌కు 606 కేసులు రాగా అందులో 107 కేసులను పరిష్కరించడం ద్వారా రూ.94.19 కోట్ల రుణాలను రికవరీ చేయడం జరిగింది. డీఆర్టీలో కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రతి నెలా మూడో శనివారం లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నారు.