మాల్యాకు మరిన్ని చిక్కులు..
♦ మనీ ల్యాండరింగ్ కేసు పెట్టిన ఈడీ
♦ డియాజియో ఇచ్చే సొమ్ముపై
♦ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆంక్షలు...
ముంబై: వ్యాపారవేత్త విజయ్ మాల్యాని మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంకుకు రూ. 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ). ఇదే అంశానికి సంబంధించి సీబీఐ గతేడాది నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దాఖలు చేసింది. లోన్ మంజూరు చేయడంలో రుణ పరిమితుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఐడీబీఐ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులపై, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ డెరైక్టరు మాల్యాపై, సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో అంశాల ఆధారంగానే తాజాగా ఈడీ కూడా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం కార్యకలాపాలు నిల్చిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక స్వరూపం గురించి విచారణ చేయడంతో పాటు విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా విజయ్ మాల్యా సహా ఇతరులను ఈడీ ప్రశ్నించనుందని ఆయా వర్గాలు వివరించాయి. సదరు బ్యాంకు నుంచి, సంబంధిత వర్గాల నుంచి కీలక పత్రాలను ఈడీ సేకరించినట్లు పేర్కొన్నాయి.
డీఆర్‌టీలో మాల్యాకు చుక్కెదురు ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాల కేసుకు సంబంధించి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)లో మాల్యాకు చుక్కెదురైంది. రుణ ఎగవేత వివాదాన్ని ఎస్‌బీఐతో పరిష్కరించుకునే దాకా ఆయనకు ఇచ్చే 75 మిలియన్ డాలర్లను విడుదల చేయకుండా నిలుపుదల చేయాలంటూ డియాజియోను డీఆర్‌టీ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది. ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంనకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు రూ. 7,800 కోట్లు బకాయిపడిన సంగతి తెలిసిందే. వీటిని రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ప్రకటించాయి. ఇదే సమయంలో యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకు గాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడింది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్‌టీని ఆశ్రయించింది ఎస్‌బీఐ. దీనిపైనే డీఆర్‌టీ తాజా ఆదేశాలు ఇచ్చింది.