Money lyandaring
-
మాల్యాకు మరిన్ని చిక్కులు..
♦ మనీ ల్యాండరింగ్ కేసు పెట్టిన ఈడీ ♦ డియాజియో ఇచ్చే సొమ్ముపై ♦ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆంక్షలు... ముంబై: వ్యాపారవేత్త విజయ్ మాల్యాని మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంకుకు రూ. 900 కోట్ల రుణాల ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ). ఇదే అంశానికి సంబంధించి సీబీఐ గతేడాది నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దాఖలు చేసింది. లోన్ మంజూరు చేయడంలో రుణ పరిమితుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఐడీబీఐ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులపై, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ డెరైక్టరు మాల్యాపై, సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో అంశాల ఆధారంగానే తాజాగా ఈడీ కూడా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం కార్యకలాపాలు నిల్చిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక స్వరూపం గురించి విచారణ చేయడంతో పాటు విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా విజయ్ మాల్యా సహా ఇతరులను ఈడీ ప్రశ్నించనుందని ఆయా వర్గాలు వివరించాయి. సదరు బ్యాంకు నుంచి, సంబంధిత వర్గాల నుంచి కీలక పత్రాలను ఈడీ సేకరించినట్లు పేర్కొన్నాయి. డీఆర్టీలో మాల్యాకు చుక్కెదురు .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాల కేసుకు సంబంధించి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో మాల్యాకు చుక్కెదురైంది. రుణ ఎగవేత వివాదాన్ని ఎస్బీఐతో పరిష్కరించుకునే దాకా ఆయనకు ఇచ్చే 75 మిలియన్ డాలర్లను విడుదల చేయకుండా నిలుపుదల చేయాలంటూ డియాజియోను డీఆర్టీ ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 28కి వాయిదా వేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియంనకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు రూ. 7,800 కోట్లు బకాయిపడిన సంగతి తెలిసిందే. వీటిని రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ప్రకటించాయి. ఇదే సమయంలో యునెటైడ్ స్పిరిట్స్ సంస్థ నుంచి వైదొలిగినందుకు గాను ఆయనకు 75 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు డియాజియో సిద్ధపడింది. ఇచ్చిన రుణంలో కొంతైనా రికవర్ అయ్యేలా ఈ నిధులు ముందుగా తమకు దఖలుపడేలా ఆదేశించాలంటూ డీఆర్టీని ఆశ్రయించింది ఎస్బీఐ. దీనిపైనే డీఆర్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
రూ. 200కోట్ల లావాదేవీల్లో రాజా, కనిమొళి అక్రమాలు
కళైనార్ టీవీకి సొమ్ము బదిలీ, ప్రత్యేక కోర్టుకు ఈడీ నివేదన న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలోని మనీ ల్యాండరింగ్ అభియోగాల కేసులో నిందితులైన మాజీ కేంద్ర మంత్రి ఏ రాజా, డీఎంకే మాజీ ఎంపీ కనిమొళి దాదాపు రూ. 200 కోట్ల మేర లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మంగళవారం ఢి ల్లీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. రాజా, కనిమొళిలపై దాఖలైన మనీ లాండరింగ్ అభియోగాలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ మంగళవారం ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. డీబీ గ్రూప్ కంపెనీనుంచి కనిమొళి గ్రూపు కంపెనీనుంచి వివిధ కంపెనీల ద్వారా డీఎంకే యాజమాన్యంలోని కలైనార్ టీవీకి జరిపిన రూ 200 కోట్ల మేర బదిలీలో నిబంధలను పాటించలేదని ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు. ఈ లావాదేవీల్లో కుసేగావోన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సినీయుగ్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కేవలం డబ్బు బదిలీకోసమే వినియోగించారన్నారు. కాగా, 2జీ కేసులోనే ఈడీ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్ సింగ్ సహా మరి కొందరిని సాక్షులుగా పిలిపించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందించేందుకు తమకు మరి కొంత వ్యవధి ఇవ్వాలని రాజా, కనిమొళి సహా 15మంది నిందితులు ప్రత్యేక కోర్టును కోరారు. దీంతో కోర్టు కేసు విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. బొగ్గు స్కామ్‌పై తుది తీర్పు నేడే అక్రమమని సుప్రీంకోర్టు పేర్కొన్న 218 బొగ్గు గనుల కేటాయింపుల భవితవ్యం నేడు తేలనుంది. వాటికి సంబంధించిన తుది తీర్పును బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఆగస్ట్ 25న ఆ కేటాయింపులను తీవ్రంగా ఆక్షేపిస్తూ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకుని వాటిని రద్దు చేయడంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘వాణిజ్య’ మనీ ల్యాండరింగ్‌పై సిట్ కన్ను!
న్యూఢిల్లీ: ఎగుమతులు, దిగుమతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి మనీ ల్యాండరింగ్ (విదేశాలకు అక్రమంగా సొమ్ము తరలించడం, తీసుకురావడం)కు పాల్పడుతున్న ఘటనలపైనా సుప్రీం కోర్టు నల్లధనంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి పెట్టింది. త్వరలో జరిగే సిట్ భేటీలో ఈ అంశంపై చర్చించి, చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్ కేంద్రంగా ఎగుమతులు, దిగుమతుల పేరిట తప్పుడు, నకిలీ పత్రాలను తయారుచేసి భారీగా సొమ్మును విదేశాలకు పంపడం, స్వదేశానికి తీసుకురావడం జరుగుతున్నట్లు డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది.