డీఆర్‌టీలో కేసులకు లోక్ అదాలత్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకుండా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ) పేర్కొంది. వివాదాలు తక్కువగా ఉన్న 31 కేసులను హైకోర్టు మాజీ జడ్జి రాములు నేతృత్వంలోని లోక్‌అదాలత్‌కు బదలాయించినట్లు డీఆర్‌టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ సాయి మోహన్ తెలిపారు.
ఈ నెల మూడవ శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో రూ.48.50 కోట్లకు సంబంధించి 4 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు లోక్ అదాలత్‌కు 606 కేసులు రాగా అందులో 107 కేసులను పరిష్కరించడం ద్వారా రూ.94.19 కోట్ల రుణాలను రికవరీ చేయడం జరిగింది. డీఆర్‌టీలో కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రతి నెలా మూడో శనివారం లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నారు.