Debutant Srinivas
-
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రచందనం అడ్డుకట్టకు తొలి ప్రాధాన్యత మరింత పటిష్టంగా డయల్ యువర్ ఎస్పీ కౌంటర్ కేసుల్లో విచారణ పటిష్టంగా ఉండాలి జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పలమనేరు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సందర్శనలో భాగంగా శుక్రవారం ఆయన పలమనేరులోని అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. తాను జిల్లా ఎస్పీగా కొత్తగా విధుల్లో చేరినందున పోలీస్స్టేషన్లు, సిబ్బందితో పరిచయం కోసం జిల్లా మొత్తం తిరుగుతున్నట్టు తెలిపారు. అందరూ నాకెందుకులే అనుకోకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ అయ్యే ప్రసక్తే లేదన్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో క్రైమ్ వివరాలను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై జిల్లాలోని సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామన్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందిని పూర్తిగా తగ్గించేందుకు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అందుకే తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు డ్రైవర్లలో చైతన్యం తీసుకొస్తామన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం ఉండాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద సమాచారం ఉందని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు కర్ణాటక, అటు తమిళనాడుకు ఎర్రచందనం తరలకుండా పూర్తి స్థాయి లో నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. తమ ముందున్న సవాళ్లలో మొదటి ప్రాధాన్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడమేనన్నారు. భవిష్యత్తులో సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్ తదితరాలకు స్థలాల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే జిల్లాలోని పోలీస్ ఆస్తులను ఈ అవసరాల కోసం ఉపయోగించుకునేలా పథకం సిద్ధం చేశామన్నారు. ఇక కౌంటర్ కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసుల విచారణ పటిష్టంగా ఉండాలన్నారు. ఎవరు ఫిర్యాదు ఇచ్చినా దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో)పై ఉంటుందన్నారు. అయితే విచారణలో తప్పుడు కేసులను రెఫర్ చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి కేసులను తాము 98 వరకు గుర్తించి వాటిని రెఫర్ చేశామని పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమ్నాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. గత ఎస్పీ ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ వెంట పలమనేరు, గంగవరం సీఐలు బాలయ్య, రామక్రిష్ణ, ఎస్ఐలు రవినాయక్ తదితరులు ఉన్నారు. -
ఆపరేషన్ ‘రెడ్’ కొనసాగుతుంది
స్మగ్లర్ల అణచివేతకే తొలి ప్రాధాన్యం రౌడీయిజంపై ఉక్కుపాదం ప్రజలు, పోలీసులు ఎప్పుడైనా కలవొచ్చు బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చిత్తూరు (అర్బన్): జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఎర్ర’ స్మగ్లర్ల అణచివేత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కొత్త ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు అధికారిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న పీహెచ్డీ రామకృష్ణ గుంటూరు ఎస్పీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. తిరుమల కొండపై ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్వో)గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను చిత్తూరుకు బదిలీ చేస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.30 గంటలకు చిత్తూరుకు చేరుకున్న ఆయన స్థానికంగా ఉన్న పోలీసు అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6.15 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలో ఎర్రచందనం రవాణాను అడ్డుకునేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపనున్నట్లు పేర్కొన్నారు. కాగా, స్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌కు జిల్లా పోలీసు యంత్రాగం అభినందనలు తెలిపింది. డీపీవో ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న, పలువురు డీఎస్పీలు, కార్యాలయ పరిపాలన అధికారులు, పర్యవేక్షకులు, సీఐలు, ఆర్ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.