ఆపరేషన్ ‘రెడ్’ కొనసాగుతుంది
- స్మగ్లర్ల అణచివేతకే తొలి ప్రాధాన్యం
- రౌడీయిజంపై ఉక్కుపాదం
- ప్రజలు, పోలీసులు ఎప్పుడైనా కలవొచ్చు
- బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
చిత్తూరు (అర్బన్): జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఎర్ర’ స్మగ్లర్ల అణచివేత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని కొత్త ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు అధికారిగా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న పీహెచ్‌డీ రామకృష్ణ గుంటూరు ఎస్పీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. తిరుమల కొండపై ముఖ్య నిఘా, భద్రతాధికారి (సీవీఎస్‌వో)గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను చిత్తూరుకు బదిలీ చేస్తూ ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు చిత్తూరు ఎస్పీగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.30 గంటలకు చిత్తూరుకు చేరుకున్న ఆయన స్థానికంగా ఉన్న పోలీసు అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6.15 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.
జిల్లాలో ఎర్రచందనం రవాణాను అడ్డుకునేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపనున్నట్లు పేర్కొన్నారు. కాగా, స్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌కు జిల్లా పోలీసు యంత్రాగం అభినందనలు తెలిపింది. డీపీవో ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న, పలువురు డీఎస్పీలు, కార్యాలయ పరిపాలన అధికారులు, పర్యవేక్షకులు, సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.