December 31 night
-
మైనర్ మందుబాబులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ జరిగిన ‘డిసెంబర్ 31’ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 1413 మంది హైదరాబాద్ పోలీసులకు చిక్కగా... వీరిలో మైనర్లు 22 మంది ఉన్నారు. రాచకొండలో 446 మంది పట్టుబడితే... మైనర్లు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌లోనూ ఇలాంటి సీనే. ఇక్కడే ఓ కీలక విషయాన్ని అటు ట్రాఫి క్, ఇటు శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు మర్చిపోయాయి. అదే మైనర్లకు సైతం మద్యం లభించడం. వారికి మద్యం ఎలా వచ్చింది? ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. వీరిని బార్లు, పబ్‌లలోకి అనుమతించడమూ నిషిద్ధమే. ‘డిసెంబర్ 31’న చేపట్టిన డ్రంక్ డ్రైవింగ్ పరీక్షల్లో పట్టుబడిన మైనర్లు వైన్ షాపులో ఖరీదు చేసుకుని తాగడమో, బార్‌కు వెళ్లడమో జరిగి ఉండాలి. వీటిలో ఏది జరిగినా ఆయా యాజమాన్యాలపై చర్య తీసుకోవాల్సిందే. 2016 నాటి చిన్నారి రమ్య ప్రమాదంతో పాటు నగరంలో అనేక యాక్సిడెంట్లకు మద్యం మత్తులో ఉన్న మైనర్లు కారణమయ్యారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు మద్యం ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టి హడావుడి చేస్తు న్నారు. డిసెంబర్ 31 నాటి డ్రంక్ డ్రైవర్ల విషయంలో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అనేక సందర్భాల్లో ఉల్లంఘన జరగడానికి కారణమ వుతోంది. అక్కడితో ఆగిపోయిన సీన్ ఇలా పట్టుబడిన మందు‘బాబుల’ నుంచి ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడే వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరికి నిర్ణీత తేదీల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఆపై ఈ ‘నిషా’చరులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. కేసు పూర్వాపరాలు, మద్యం మోతాదు, నడి పిన వాహనం... ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకునే న్యాయస్థానం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత ఆవ్యక్తికి లేదా సంరక్షకుడికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ‘డిసెంబర్ 31’ నాడు చిక్కిన డ్రంక్ డ్రైవర్ల కథ కూడా అక్కడితోనే ముగిసిపోతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ప్రతి ఏడాదీ ఇలానే జరుగుతోంది. కానీ... కనిపెట్టడం పెద్ద కష్టం కాదు... డిసెంబర్ 31’న పట్టుబడిన మందుబాబుల్లో 21 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం ఎవరు విక్రయించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్లు నిర్ణీత సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్‌కు, ఆపై ట్రాఫిక్ పోలీసులు సూచించినప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఆయా సందర్భాల్లో వారిని విచారించడం ద్వారా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ తాగారు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది తెలిసినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏదైనా సంస్థపై ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే లైసెన్స్ ఇచ్చిన అథారిటీకే సాధ్యం. దీంతో ఆయా వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్, లోకేషన్ వంటి ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖకు అందించి, లైసెన్సు రద్దు/సస్పెన్షన్ సహా చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇలా చేస్తే మరోసారి ఉల్లంఘన, భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులకు ఈ అంశం పట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్ కూడా తీవ్రమైనదే.. డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్లకు సంబంధించి మరో కీలకాంశమూ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం సాధారణంగా మైనర్లకు లైసెన్సులు జారీ చేయరు. దీంతో వీళ్లు వాహనం నడపకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయడమే కాదు వారికి, లైసెన్సు లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమే. ఇలా చేసినందుకు వాహనం ఎవరి పేరుతో రిజిస్టరై ఉందో ఆ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘డిసెంబర్ 31’న చిక్కిన మైనర్ల విషయంలోనూ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. -
డ్రంక్ అండ్ డ్రైవ్: 3148 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 239 డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదైనట్టు వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 3148 కేసులు నమోదయ్యాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారిలో ఒక మహిళ, 3,147 మంది పురుషులు ఉన్నారని వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
31రాత్రి 11 తర్వాత ఓఆర్ఆర్, ఫ్లైఓవర్ల మూసివేత
సాక్షి,సిటీబ్యూరో: కొత్త సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న రాత్రినిర్వహించే వేడుకలపై గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఆ రోజు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో పూటుగా మద్యం తాగి వాహనంపై దూసుకెళదామనుకునేవారికి ముందుగానే బ్రేకులు వేయనున్నారు. గతేడాది అమలు చేసినట్టుగానే ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అయితే, ఈసారి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే మాత్రం రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ చేయనున్నట్టు సైబరాబాద్, రాచకొండ పోలీసుకమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ హెచ్చరించారు. అందరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీసులు చేపట్టే ఈ తనిఖీలకు నగరవాసులు సహకరించాలని వారు కోరారు. వేడుకల నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు హోటల్స్, ఈవెంట్ నిర్వాహకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మార్గదర్శకాలు పాటించాల్సిందే.. న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31న రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే అనుమతి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ సమయం మించి ఈవెంట్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ‘ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదు. సౌండ్ సిస్టంల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, డ్రగ్స్, హుక్కా వంటివి పూర్తిగా నిషిద్ధం. వీటిపై గట్టి పోలీస్ నిఘా ఉంటుంది. రేవ్ పార్టీలకు కూడా అనుమతి లేదు. ఈవెంట్లలో భద్రతను నిర్వాహకులే చూసుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాల(ఫైర్ ఎక్స్టింగుషర్లు)ను సిద్ధంగా ఉంచుకోవాలి. పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నిర్వాహకులదే. అవసరం మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించుకోవాలి. సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలి. వేడుకల్లో ఆయుధాలకు అనుమతి లేదు. వేడుకలకు అనుమతి తీసుకున్న వారు కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేసి పోలీసులకు రెండు రోజుల్లో సమర్పించాలి. ఈవెంట్లో ఏమైనా గొడవ జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే నిర్వాహకుడినే విచారిస్తా’మని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం అమ్మకాల రికార్డు! డిసెంబర్ 31 సంబరాల కోసం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. 2018 డిసెంబర్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు సాగడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే, ఇటీవలే మద్యం ధరలను పెంచడంతో ఈసారి ‘డబుల్’ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతోంది. కగా, గడిచిన ఏడాది డిసెంబర్ 31 ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.133 కోట్ల లిక్కర్ అమ్ముడుపోయింది. హైదరాబాద్ జిల్లాలో రూ.19.5 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.15.30 కోట్లు, మేడ్చల్‌లో రూ.11.90 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈసారి కూడా గ్రేటర్లో పెద్ద సంఖ్యలో ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేయడం, రాత్రి ఒంటి గంట వరకు బార్లకు అనుమతివ్వడంతో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అయితే, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు టికెట్ చూపిస్తే మినహాయింపు ఉంటుంది. అలాగే, బేగంపేట ఫ్లైఓవర్ మినహాయించి మిగతా ఫ్లై ఓవర్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.’’ ‘జోష్’ అనుమతి లెక్క ఇదీ.. నయాసాల్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 124 ఈవెంట్లకు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 75 ఈవెంట్లకు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 33 ఈవెంట్లకు అనుమతిచ్చారు. అయితే, హైదరాబాద్ కమిషనరేట్ విషయానికొస్తే అత్యధికంగా వెస్ట్‌జోన్‌లో 68 ఈవెంట్లు ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్లోనే 63 ఈవెంట్లకు అనుమతించారు. ఈవెంట్లకు వచ్చేవారి భద్రత బాధ్యత నిర్వాహకులదేనని, రాత్రి ఒంటి గంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు ఆదేశించారు. డిజిగ్నేటెడ్ డ్రైవర్లను వాడుకోండి డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేయనున్నట్టు నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడపకపోవడమే మంచిది. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తాం. పార్టీల నిర్వాహకులు క్యాబ్‌లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలి. ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్’ సేవలను వినియోగించుకుంటే ప్రమాదాలకు అవకాశం ఉండదు. – మహేష్ భగవత్, రాచకొండ సీపీ ఈవెంట్ల వద్ద డిస్ప్లే తప్పనిసరి డ్రంకన్ డ్రైవ్ తీవ్రమైన నేరం. 100 మి.లీ రక్తంలో ఆల్కహల్ పరిమితి 30 మైక్రోగ్రాములు మించొద్దు. ఈ అంశాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్క్రీన్‌పై ప్రదర్శించాలి. దీనివల్ల వేడుకల్లో పాల్గొనేవారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ -
డాన్స్ రాజా డాన్స్
వివరం డిసెంబర్ 31 రాత్రి మీ చేతుల్లో ఏముంటుందో చెప్పలేం. కానీ కాళ్లల్లో మాత్రం డాన్స్ ఉంటుంది. ఆ రోజు తేగలిగే ఉత్సాహం అలాంటిది మరి! పాతదాన్ని వదిలి, కొత్తదాన్ని ముద్దాడబోయే క్షణం ఎవరినైనా నృత్యం చేయిస్తుంది. అది మీరు బయటకు ప్రదర్శిస్తారా, మీ ఒంట్లోనే ఎవరికీ కనబడకుండా చేస్తారా అనేది మీ స్థాయి, సౌలభ్యం, మానసిక స్థితి మీద ఆధారపడివుంటుంది. డాన్స్ లేనిదే (హ్యాపీ) న్యూ ఇయర్ లేదు. కాబట్టి, 2014ను స్వాగతిస్తున్న సందర్భంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని పార్టీడాన్స్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఎప్పుడూ దేవుణ్ని నమ్మని తత్వవేత్త నీషే కూడా ఒక మాట అంటాడు: (దేవుడినంటూ నమ్మాల్సివస్తే) ‘‘డాన్స్ చేయడం తెలిసిన దేవుణ్ని మాత్రమే నేను విశ్వసిస్తాను’’.ఆ మాత్రం ఆనందం పంచడం తెలియని, ఆ మాత్రం ఆనందించడం తెలియని దేవుడు ఇంకేం దేవుడు!కల్యాణం వచ్చినా, అటుపైన రాయలేని ఇంకేదో వచ్చినా ఆగదంటారుగానీ ఒక మనిషిలోకి డాన్స్ ప్రవేశిస్తే ఆపుకోవడం కష్టం. చెంపలతో నవ్వుతూ, చతుర్లు రువ్వుతూ, కాళ్లు కదిలిస్తూ, నరాల్లో రక్తం ఉరకలెత్తగా... సంతోషాన్ని మనిషి తట్టుకోవడం కష్టం. సంతోషాన్ని మనిషి దాచుకోవడమూ కష్టమే. దాన్ని వెల్లడించి తీరాలి. ఆ ఊపు, ఆ తీపు ప్రాథమికంగా నృత్యానికి రూపునిచ్చివుంటాయి. ఆ ఉద్వేగం సంతోషమే కానక్కర్లేదు, తీవ్రమైన దుఃఖం కూడా ఒంటిని కంపింపజేస్తుంది. దాన్ని బయటికి పారదోలి, శరీరాన్ని సాధారణ స్థితికి తేగలిగే ‘స్ట్రెస్ బస్టర్’ కూడా డాన్సే! అందుకే నృత్యం మనిషి రూపొందించుకున్న అతిప్రాచీన కళారూపం. వేల ఏళ్ల పాతది శరీరాన్నీ, కాళ్లు చేతుల్నీ కదిలిస్తూ, అమూర్తభావాల్ని వ్యక్తీకరించే డాన్స్ దానికదే ఒక కళారూపంగా ఎలా, ఎప్పుడు అవతరించిందో చెప్పడం కష్టం. ప్రతిదీ జానపదంగా మొదలయ్యి, నెమ్మదిగా మరొక మెట్టుకు చేరుకోవడమో, లేదా ఆ జానపదాన్ని కలుపుకుంటూనే మరింత క్రమాన్ని సంతరించుకోవడమో జరిగింది. పరమశివుణ్ని నటరాజుగా కొలిచే ఈ భారతనేలమీదే నృత్యానికి సంబంధించిన ప్రాచీన రుజువులు దొరకడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని భీమ్భేట్కా రాతిగుహల్లో మనుషులు నృత్యం చేస్తున్నట్టుగా గీసిన పెయింటింగ్స్ కనబడ్డాయి. ఇవి సుమారు 9000 ఏళ్ల నాటివి. అంటే, దాదాపుగా వ్యవసాయం మనిషికి తెలిసినప్పటి కాలం. సంచారజీవితం క్రమంగా స్థిరీకరణ జరుగుతున్న దశ. ఆ లెక్కన భరతముని ‘నాట్యశాస్త్రం’ కూడా ఇక్కడే వెలువడటంలో కూడా అందుకే ఆశ్చర్యం లేదు. క్రీ.పూ. 3300 కాలంలో ఈజిప్షియన్ నృత్యాన్ని చెక్కివున్న ప్రతిమలు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రతీ ప్రాంతంలోనూ మనుషులు తమవైన ఆనందపు ప్రకటనల్ని నృత్యంగా వెల్లడించుకునివుంటారు. అయితే, ప్రాచీన నృత్యాలన్నీ తమ దేవుళ్లను మచ్చికచేసుకోవడానికో, మెప్పించడానికో చేసినవే. అందుకే చాలా నృత్యరీతులు మతంలో అంతర్భాగంగా ఉంటూవచ్చాయి. అలాగే డాన్స్ కూడా విడి అస్తిత్వం ఉన్నది కాదు. నృత్యం, సంగీతం, కవిత్వం మూడూ కవల సోదరులు. ఇవన్నీ కలిస్తేనే ఆనందం పరిపూర్ణమవుతుంది. ప్రతీ తెగకూ, ప్రాంతానికీ తమవైన నాట్యరీతులు, ఆచారాలున్నాయి. వాళ్ల వేటజీవితం, సంచార సంగతులు, పోరాటాలు కథలుగా మలిచారు. అమెరికన్ తెగల్లో కరువు కాటకాల సమయంలో ఇసుకలో పశ్చిమంవైపు ముఖం పెట్టివున్న తాబేలును కట్టెకు కట్టి నృత్యం చేసేవాళ్లు. ఇప్పుడు రైన్ డాన్స్ అని చెబుతున్నదానికి మూలం అది. తాబేలు ఆచారంలాగే మన దగ్గర కప్పతల్లిని ఊరేగించడం తెలిసిందే. అంటే మనుషుల మౌలిక స్వభావం, ఆలోచనారీతి ఒకేలా ఉంటుందని చెప్పడానికే ఈ ఉదాహరణ. ప్రసిద్ధ నృత్యరీతులు రూపంలేని అంతర్గత భావనకు బాహ్యరూపు కల్పించడమే డాన్స్. అది ఏడుపు, సంతోషం, ఇంకేదైనా సరే! చేసే మనిషిని బట్టి, శరీర విన్యాసాన్ని బట్టి, హావభావాల్ని బట్టి, గుంపుగా అయితే ఏకలయగా వాళ్లు కలిసిపోవడం బట్టి, ఆనందం కలుగుతుంది. సాధారణంగా అబ్బాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో చెప్పడం కష్టం; అమ్మాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేయరో చెప్పడం కష్టం. అమ్మాయిల్లో ఉండే గ్రేస్, ఆ కదిలే తీరుతో సహజంగానే నాట్యాన్ని మరింత ఆనందమయం చేస్తారు. అందుకే తొలి ప్రాధాన్యత వారికే ఉంటుంది. అయితే, జీన్ కెల్లీ (డాన్స్ ఇన్ ద రెయిన్) లాంటి హీరో చేసినప్పుడు చూస్తే డాన్స్ అనేది ఎంత ఆనందాన్ని తోడిపెట్టగలదో అర్థమవుతుంది. మన ప్రభుదేవాను చూసినా కూడా! ప్రతి మనిషీ తన శరీరాన్ని కదిల్చే తీరులో ఒక మెరుపును, విరుపును ఇచ్చినట్టే, ప్రతి నృత్యం విడిగా ఇవ్వగలిగే సంతోషం ఉంటుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని డాన్సుల్తో ఓసారి కాలు కలిపి, కదిపి చూద్దాం! ‘పద్ధతి’గా ఉండే భరతనాట్యం, కూచిపూడిలాంటివాటిని ఇక్కడ ఉటంకించబోవడంలేదు. ప్రతి నృత్యరీతీ ఒక పద్ధతే అయినప్పుడు, ఇక్కడ పద్ధతి అనేమాటను భిన్నార్థంలో వాడుతున్నామని గ్రహించాలి. బ్యాలె ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్, విశాలమైన స్టేజీ... చప్పున స్ఫురించే బ్యాలే 15వ శతాబ్దంలో ఇటలీలో అవతరించింది. ఫ్రాన్స్, రష్యాల్లో మరింత వృద్ధి చెందింది. ఇది బృందనృత్యం. రాజాస్థానాల్లో బాగా ఆదరణ పొందింది. ‘బ్యాలె’ అన్న మాటకు అర్థం డాన్స్ చేయడమనే! 3500 ఏళ్లనాటి ఈజిప్షియన్ నృత్యానికీ, నేటి ఆధునిక బ్యాలేలకూ మధ్య భంగిమల్లో పోలిక ఉండటం... నృత్యం ఎంత పాతదో చెబుతుంది; అదే సమయంలో ఎప్పటికప్పుడు ఎంత నవీనమో వెల్లడిస్తుంది. బాల్రూమ్ డాన్స్ ప్రధానంగా స్త్రీ, పురుష నృత్యరీతి. విశాలమైన గదుల్లో ప్రదర్శనను కోరుకుంటుంది. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో అభివృద్ధి చెందిన ఈ నృత్యరీతి సంపన్న వర్గాల ఆదరణ పొందింది. పాశ్చాత్య సినిమావాళ్లకు కూడా ఇది ఇష్టమైన ప్రక్రియ. ‘బాల్’ అనే లాటిన్ మాట డాన్స్ చేయడమని అర్థం. బెల్లీ డాన్స్ నిజానికి దీన్ని బెల్లీ డాన్స్ అనడం సగం నిజమే. శరీరంలోని ప్రతి అవయవమూ కదిలించాల్సిందే! అందునా పిరుదుల కదలిక ఎక్కువ. ఈ పశ్చిమాసియా నృత్యం 18, 19 శతాబ్దాల్లో పాశ్చాత్యులకు బాగా చేరువై, మరింత పేరొందింది. బృందంగా నర్తించినప్పటికీ, సోలోలు మరింత బాగుంటాయి. దీన్ని ప్రాచ్య నృత్యమనీ, అరబిక్ నృత్యమనీ, ఈజిప్షియన్ నృత్యమనీ కూడా పిలుస్తారు. ట్యాప్ డాన్స్ నేలమీద బూట్లతో లయబద్ధంగా ధ్వనిని పుట్టిస్తూ చేసే డాన్స్ ఇది. ఆ శబ్దం దానికదే ఒక సంగీతం. దీనికోసం ప్రత్యేకమైన షూలు ఉంటాయి. వాటిమీద వాడే లోహపు అతుకును బట్టి ధ్వని మారుతూవుంటుంది. 1850ల ప్రాంతంలో ఇది ఆవిర్భవించింది. ఆఫ్రికన్ అమెరికన్ మూలాలున్న జూబా నృత్యం, ఇంగ్లీష్ లాంక్షైర్ క్లాగ్ నృత్యం, ఐరిష్ స్టెప్డాన్సింగ్ లాంటి కలయికతో దీని సృష్టి జరిగింది. ఇది కూడా సినిమా నాట్యాల్లో విశేష ఆదరణ పొందింది. ట్యాంగో ఇది చేయడానికి భాగస్వామి తప్పనిసరి. పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఆవిర్భవించింది. అర్జెంటీనా, ఉరుగ్వే సరిహద్దు ప్రాంతాలు జన్మస్థానాలు. సినిమాల ద్వారా విశేష ఆదరణ పొందింది. ఎన్నో రీతులు వచ్చినప్పటికీ అసలైనదిగా అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీల్లో చేసిన తొలి రూపమే గుర్తింపుపొందింది. యునెస్కో వారసత్వ సంపద ఘనతను పొందిన కళారూపం ఇది. సల్సా టమోటా, ఉల్లిగడ్డలు, మిరియాలపొడి వేసిన ఒక హాట్ మెక్సికన్ సాస్‌ను సల్సా అంటారు. ఇది కూడా అలాంటి వేడిపుట్టించే డాన్సే! దీనిలో కూడా భాగస్వామి ఉండాలి. నైట్‌క్లబ్బులు, బార్లలో బాగా చేస్తారు. 1970ల్లో వృద్ధి చెందింది. లాటిన్ అమెరికా నుంచి, ఇంకా ముఖ్యంగా క్యూబా నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. లైన్ డాన్స్ స్వింగ్, డిస్కో, జాజ్, రాక్ ఎన్ రోల్ లాంటి సంగీతాలన్నింటితోనూ ఈ రీతికి అనుబంధం ఉంది. అల్బేనియా, బోస్నియా, క్రొయేషియా, గ్రీస్, కొసావో, మెసిడోనియా లాంటి దేశాలుండే బాల్కన్ ప్రాంతంలో పుట్టింది. డాన్స్ చేసేవాళ్లందరూ కొన్ని వరుసల్లో- అది వృత్తం కూడా కావొచ్చు- ఉండి చేయడం దీని ప్రత్యేకత. ఇందులో పాల్గొనడానికి స్త్రీ-పురుష నియమం లేదు. బృందం సరిపోతుంది. బ్రేక్‌డాన్స్ ఇరుకు గల్లీల్లో పుట్టింది. మైకేల్ జాక్సన్‌లాంటి వారివల్ల ఇది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. జిమ్నాస్టిక్స్ను తలపించే శరీర విన్యాసాలు ఎక్కువ. ఆశ్చర్యం పుట్టించేలా శరీరాన్ని సమన్వయం చేసుకోవడం కనబడుతుంది. మనదగ్గర చిరంజీవి దీనికి ‘బ్రేక్’ ఇచ్చాడని చెప్పాలి. గంగ్నమ్ స్టైల్ అతికొత్తదీ, తక్కువ కాలంలో ఆదరణ పొందిన డాన్స్ ఇది. పోయిన డిసెంబర్లో విడుదలైంది. యూట్యూబ్‌లో ‘బిలియన్ వ్యూవర్స్ మార్క్’(వంద కోట్లు) దాటిన తొలి వీడియో. రెండు వందల కోట్లకు పరుగెడుతోంది. స్టేజ్నేమ్ ‘సై’తో ప్రసిద్ధుడైన కొరియన్ మ్యూజీషియన్ పార్క్ జే-సంగ్ దీనికి ఆద్యుడు. ‘ఒప్పన్ గంగ్నమ్ స్టైల్’ అని వీడియోలో వినిపించే ఆ మాటకు అర్థం: ‘పెద్దన్నది గంగ్నమ్ స్టైల్’. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఒక చిన్న పరిపాలనా విభాగం ఈ గంగ్నమ్ ప్రాంతం. మొన్నటి ‘కొలవెరి’ మేనియాలా దీన్ని భావించవచ్చేమో! చివరగా... సాషెల్ పైజ్ అన్నట్టుగా- ‘డబ్బులు అసలు అక్కర్లేనట్టుగా పనిచేయండి. ఎప్పుడూ గాయపడలేనట్టుగా ప్రేమించండి. ఎవరూ గమనించడం లేదన్నట్టుగా డాన్స్ చేయండి’. అలాగే ‘మనం చదువుదాం, మనం నృత్యం చేద్దాం- ఈ రెండు వినోదసాధనాలు ఏనాడూ ప్రపంచానికి ఏ చెడూ చేయవు’ అన్న వోల్తేయిర్ మాటలు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుందాం. సంగీతలయకు అనుగుణంగా శరీరాన్ని ఊయల్లాగా తిప్పే చైనా సంప్రదాయ జానపద రీతి ‘యాంకో డాన్స్’, విచిత్రవేషధారణతో దారిపొడుగునా అలుపు లేకుండా చేస్తూవెళ్లే బ్రెజిల్ ‘సాంబా డాన్స్’, పంటచేతికొచ్చిన ఉత్సాహంలో చేసే భల్లేభల్లే పంజాబ్ డాన్స్ ‘భాంగ్డా’.... ఇంకా ఎన్నో! డాన్స్ అనేది ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది, క్రియేటివ్ ఔట్‌లెట్‌గా పనిచేస్తుంది, సమస్యను మరిచిపోయేట్టు చేస్తుంది, వ్యాయామానికి కారణమవుతుంది. అన్నింటికీ మించి అది ఒక స్వేచ్ఛను ప్రకటించుకునే తీరు. కాబట్టి ఏదోలా డాన్స్ చేయండి. ఇవన్నీ వద్దనుకుంటే మన ‘మాయదారి మైసమ్మ’ ఉండనే ఉంది. లేదంటే, ‘ఎయ్‌ర మామ’ తీన్మార్! 8 వివేకం నూతన సంవత్సరం గొప్ప వరం జీవితంలో నూతన ఆకాంక్షలకు తెర తీయడానికి ఈ నూతన సంవత్సరం గొప్ప వరం. మన చుట్టూ ప్రపంచాన్ని పరికిస్తే అది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనకు అందుబాటులోకి వచ్చిన ఎన్నో సౌకర్యాలతో ఆనందించాల్సింది పోయి, తనకూ ఇంకా ఇతరులకూ మనిషి కలిగించే కష్టనష్టాలకు అంతే లేదని చెప్పాలి. ఈనాటి వాస్తవం ఇదే. ఎక్కడా స్పష్టత అనేదే లేదు. నిజానికి తమకు ఏమి కావాలో కూడా తెలియకుండానే, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండానే, ఈ ప్రపంచంలోని చాలామంది జీవితాలు గడిపేస్తున్నారు. ఎప్పుడైనా మన అనుభవాల ఆధారంగానే మనం ముందుకు వెళితే, అది కేవలం సాధారణ విషయాలకే పరిమితమౌతుంది. అలా చేస్తే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగానే జీవితాల్ని మలచుకొంటూ ఉంటాం. కాని రేపు మనం పోదామనుకుంటున్న దానికీ, ప్రస్తుతం మనం ఉన్నదానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏది ఉత్కృష్టమైనదిగా మనం కోరుకుంటున్నామో దానికీ, మన ప్రస్తుత పరిస్థితికీ సంబంధం ఉండనక్కరలేదు. మన దృక్కోణాన్ని ప్రస్తుత పరిస్థితులకు పరిమితం చేసివేసినట్టయితే, సాధించడానికి వీలైన, సులభమైనదానితోనే మళ్లీ మనం రాజీపడిపోతున్నామని అర్థం.తనకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా అత్యున్నతమైనదాన్ని సాధించాలని ఎవరైనా దృష్టి కేంద్రీకరిస్తే, అది సృష్టించడం మనిషి సామర్ధ్యానికి అతీతమైనదేమీ కాదు. ఎవరి దృక్కోణం చాలా స్పష్టంగా ఉంటుందో, దాన్ని సాకారం చేసుకోవడం కోసం తన జీవితంలోని ప్రతిక్షణమూ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారి పాదాల చెంతకు ఆ అత్యున్నతమైనది వచ్చి వాలుతుంది. మనకంటూ ఓ స్పష్టమైన యోచన ఉంటే, చేసే పని ఫలితం గురించిన ఆందోళన మనకు లేదని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... మనకు ఓ ఆలోచన ఉంది. మన జీవితాన్ని దానికి అంకితం చేసేశాం. అంతే. నిజానికి అత్యున్నతమైనదాన్ని సాధించడానికి గల అతి సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇదే ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ. భగవద్గీత యావత్తూ దీని గురించే చెబుతోంది. ‘అది జరుగుతుందా? లేదా?’ అనేదానిని పట్టించుకోకుండా నీవేమి కావాలనుకొంటున్నావో దానికి అంకితమైపో!’ అని. మన ఆలోచనలో ‘అత్యున్నతమైనది’ అనుకున్న దానికోసం, ఏకాగ్ర చిత్తంతో దాని సాధనకు పూనుకోవలసిన సమయమిది. ఈ జీవితానికీ, దీనికి అతీతమైనదానికీ గల జీవన జ్ఞానాన్ని పొందడానికి ఇదో అతి సులభమైన మార్గం. ఇటువంటి సుస్పష్టమైన దృష్టి గలవాడే నిజంగా ధన్యుడు. అతీతాన్ని కూడా అవలోకనం చేయగల శక్తిని ఈ నూతన సంవత్సరం మీకందరకూ అందించుగాక! సమస్య - పరిష్కారం ఈ నూతన సంవత్సరంలో ఆలోచనా విధానాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కోరుకున్న రీతిగా ఆలోచనలను ఎలా తెచ్చుకోగలను? - పి.ప్రసాద్‌బాబు, విజయవాడ సద్గురు: అంతా మీ దృక్కోణం మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నవి అని ఆలోచించడం కన్నా, విశాలమైన జీవిత దృక్కోణంతో ఆలోచించడం మంచిది. అసలు మనని మనం ఒక అత్యల్పమైన ధూళి కణంగా భావించి, గమనించాల్సి ఉంటుంది. ఈ విశ్వంతో పోలిస్తే, మనం ఎంతో విశాలమైనదిగా భావిస్తున్న మన పాలపుంత అత్యంత అల్పమైనది. అది చాలా చాలా చిన్నది. ఇక మన పాలపుంతలో మన సౌరకుటుంబం కూడా చాలా చిన్నది. ఈ సౌరకుటుంబంలో మన భూగోళం ఇంకా చాలా చిన్నది. ఇందులో మన ఊరు ఒక చిన్న భాగం. ఈ అతి చిన్నభాగంలో మనమో... చాలా పేద్ద మనుషులం... అనుకుంటున్నాం కదా! అసలు తామెవరు? ఏమిటి? అనే విషయాన్ని మనుషులు మరచి ప్రవర్తిస్తున్నారు. కనీసపు తెలివితోనైనా ఈ ఉనికిలో మన స్థానమేమిటో తెలుసుకోగలగాలి. ఇదే అతి ముఖ్యమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మరో సరికొత్త లోకం ఆవిష్కారమవుతుంది. అంటే అప్పటినుంచి మన నడక మారిపోతుంది. ఆలోచించడం, కూర్చోడం, నుంచోవడం, తినడం... సర్వం మారిపోతాయి. అంటే మనం జీవితాన్ని అనుభవించే తీరే పూర్తిగా మారిపోతుంది. -
బరువు తగ్గుదాం brand new అయిపోదాం!
భాషణం మూడ్రోజుల్లో New Year! తర్వాతి రోజు New Year's Day. దానికి ముందు రోజు New Year's Eve. ‘న్యూ ఇయర్’ అంటే కొత్త సంవత్సరం. ‘న్యూ ఇయర్స్ డే’ అంటే జనవరి ఫస్ట్. ‘న్యూ ఇయర్స్ ఈవ్’ అంటే the last day of the year. అంటే డిసెంబర్ 31. సందర్భం వచ్చింది కాబట్టి ఈవారం New అనే మాట గురించి చూద్దాం. ఈ ఏడాదికిదే చిట్ట చివరి ఫన్ డే కాబట్టి ఉఛీ గురించి కూడా మాట్లాడుకోవచ్చు కానీ, ముగింపు కన్నా ప్రారంభమే కదా ఆసక్తిగా ఉండేది. ముందు Hogmanay (హాగ్మెనీ అని పలకాలి)తో మొదలు పెడదాం. ప్రధానంగా ఇది బ్రిటన్‌వారి మాట. స్కాట్లాండ్లో ఏడాది చివరి రోజును హాగ్మెనీ అంటారు. ఆ రోజు సాయంత్రం మొదలై, రెండో రోజు వరకు సాగే న్యూ ఇయర్ పార్టీలు కూడా హాగ్మెనీలో భాగమే. అమెరికాలో, మిగతా దేశాల్లో ఈ తతంగానికంతా New Year's Eve అని పేరు. CMS New Year('s) resolution అంటే తెలిసిందే. కొత్త సంవత్సరపు తీర్మానాలు. అనారోగ్యమైన అలవాట్లు ఉంటే వాటిని మానేయాలని, కొత్త లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించాలని నిశ్చయించుకోవడమే resolution. ఇప్పుడు New Year నుంచి బయటికి వచ్చి, New తో వచ్చే మాటల్లోకి వెళ్దాం. Brand new అంటే పూర్తిగా కొత్తది అని. ఒక్కసారైనా వాడనిదని. షోరూమ్లోంచి తెచ్చిన పీస్ అన్నమాట. పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్ న్యూ వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. సాదాసీదా వేతన జీవులు వాటిని భరించలేరు. ఒకవేళ ఎవరైనా అలాంటివి వాడుతూ కనిపిస్తే ఆశ్చర్యపోతాం. ఇంగ్లీషులో ఆశ్చర్యపోవడం ఎలా ఉంటుందో చూడండి. How can he afford to buy himself a brand new car?! ఇలాంటిదే Brave new అనే మాట. అయితే brand newS కి , brave new కి చిన్న తేడా ఉంది. కొత్తదే అయినప్పటికీ అది మంచిదో కాదో అనే సందేహం కనుక ఉంటే దానిని brave new అంటారు. (They introduced customers to the brave new world of telephone banking). ఈ ఏడాది చివరిలో broom అనే మాట బాగా వాడుకలోకి వచ్చింది. ఆ room అంటే చీపురు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించింది. ఆ పార్టీ గుర్తు చీపురు. ఇకనేం, ఓట్లను ఊడ్చేసిందనీ, రాజకీయాల్లోని మాలిన్యాన్ని శుభ్రం చేయబోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీడియా విస్తృతంగా రాసింది. సారాంశం ఏమిటంటే ఢిల్లీ ప్రజలకు ఒక New broom దొరికిందని. ఎవరైనా ఒక సంస్థలో కొత్తగా చేరి, సమూల మార్పులు చేసేందుకు చొరవ, ఉత్సాహం చూపుతుంటే ఆ వ్యక్తిని new broom అంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి మొదటికే మోసం రావచ్చు. ఈ వాక్యం చూడండి. The new broom was supposed to improve the way the department is managed, but things have been worse than ever since he arrived. అలాగే ఇంగ్లిష్‌లో A new broom sweeps clean అని ఓ సామెత. కొత్తగా పదవిని చేపట్టిన వ్యక్తి...మార్పులకు శ్రీకారం చుడితే ఆ వ్యక్తిని ఉద్దేశించి ఈ సామెత చెబుతారు. ఇక turn over a new leaf అంటే పరివర్తన చెందడం. పాత అలవాట్లు మానుకోవడం. కొత్త జీవితాన్ని ప్రారంభించడం. the new rock 'n' roll అంటే ఒక వ్యక్తిగానీ, కార్యక్రమం గానీ పాపులర్ అవడం. అంతా దాని గురించే మాట్లాడుకోవడం. ఈ ఏడాది ప్రారంభంలో ‘గంగ్నమ్ డాన్స్' new rock 'n' ro అయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. That-'s a new one on me అంటే ‘అరే! నాకు తెలియదే’ అని ఆశ్చర్యపోవడం. "Deepa and Ajay are getting married". "Really! That's a new one on me!". see in the New Year ‘అర్థరాత్రి వరకు మేల్కొని ఉండి, కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలను జరుపుకోవడం’ అని ఈ ఫ్రేజ్‌కు అర్థం. (to not go to bed on 31 December until after 12 'o' clock at night in order to celebrate the start of a new year). -
31 రాత్రంతా సాయి దర్శనం
సాక్షి, ముంబై: పుణ్యక్షేత్రం షిర్డీలో ఈ నెల 31న శ్రీ సాయిబాబా సమాధి మందిరం రాత్రంతా తెరిచి ఉండనుంది. క్రిస్మస్ సేవలు, అలాగే సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు బాబా దర్శనం కోసం షిర్డీకి తరలివచ్చే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ సాయిబాబా సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే తెలిపారు. ఈ సందర్భంగా మందిరం వద్ద వేర్వేరు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకల సమయంలో సాయి పల్లకీతో కాలి నడకన పాదయాత్ర చేసి వచ్చిన భక్తులు కూడా సామాన్య దర్శ నం నుంచే బాబాను దర్శించుకోవల్సి ఉంటుందని తెలిపారు. పాదయాత్రికులు బస చేయడం కోసం పలుచోట్ల మండపాలు, అదనంగా నివాస, ప్రసాద భోజన ఏర్పాటు చేస్తామన్నారు. ‘డిసెంబర్ 31న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ముంబైకి చెందిన సచ్చిదానంద ఆప్పాచే హిందీ, మరాఠీ భక్తి సంగీత కార్యక్రమం ఉంటుం ది. రాత్రి 8.45 నుంచి 10.15 గంటల వరకు పార స్ జైన్, ప్రవీణ్ మహాముని, జిమ్మీ శర్మాల సాయిభజన కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ తర్వాత 10.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఠాణేకు చెందిన జగదీశ్ పాటిల్చే భజన కార్యక్రమం జరుగుతుం ద’ని అజయ్ మోరే తెలిపారు. డిసెంబర్ 31న శేజారతి, జనవరి ఒకటిన కాకడ హారతి ఉంటుందన్నారు. మందిరం పరిసర ప్రాంతాల్లో టపాసులు, వాయిద్యాల చప్పుడు చేయరాదని తెలిపారు. భద్రతా దృష్ట్యా భక్తులు సంస్థాన్ సూచనలను పాటించాలని ఆయన కోరారు. వీఐపీ పాస్‌ల నిలిపివేత షిర్డీలో సాయిబాబా దర్శనం కోసం ఇవ్వబడే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటి తేదీల్లో నిలిపివేయనున్నారు. క్రిస్మస్, సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం సెలవులను పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో షిర్డీకి వస్తారు. ఈ నేపథ్యంలో అతి ముఖ్యమైన వ్యక్తులకు జారీ చేసే వీఐపీ పాస్‌లను ఈ నెల 25, 31, జనవరి ఒకటిన రద్దు చేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
‘అర్ధరాత్రి’పై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతోపాటు కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించేందుకు నగరవాసులు ఎన్నో ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నారు. వేడుకల కోసం ఇప్పటికే నగరంలోని పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే వేడుకల పేరిట అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే దృష్టి సారించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక నిబంధనలు అమలులోకి తేనున్నారు. ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్‌లో 31 వేడుకల కారణంగా ఎలాంటి ఘర్షణలు, మహిళలపై వేధింపుల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కన్నాట్‌ప్లేస్(సీపీ)లో దాదాపు 50 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ప్రతి హోటల్, రెస్టారెంట్ వద్ద ఒక పోలీస్‌ను అందుబాటులో ఉంచేలా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీపీలో ఆ రాత్రి వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మ్యూజిక్ పూర్తిగా బంద్ చేయాలి. రాత్రి 12.55 గంటల తర్వాత హోటల్లో భోజన విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. కన్నాట్‌ప్లేస్ ఔటర్ సర్కిల్లో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తారు. ఢిల్లీలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓ నుంచి డీసీపీ స్థాయి వరకు అధికారులు రాత్రి 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఏరియా పెట్రోలింగ్ నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్.బస్సీ,స్పెషల్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్‌మిశ్రా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో పీసీఆర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది పోలీసులను రోడ్లపై వాహనాల తనిఖీలకు వినియోగించనున్నారు. మద్యం సేవించి మహిళలను వేధించే వారిపై దృష్టి సారించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రానున్న వారం రోజుల పాటు నగరంలో రాత్రి పూట గస్త్తీని కూడా పెంచుతామన్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న గస్తీ సిబ్బందితో పాటు 15 వేల రిజర్వ్ సిబ్బందిని కూడా రాత్రివేళ గస్తీ విధుల కోసం వీధులలో మోహరిస్తామని తెలిపారు. జనవరి మొదటివారం వరకు నగరంలో రాత్రి పూట గస్తీపై మరింత శ్రద్ధ వహించనున్నామని వెల్లడించారు.