సాక్షి,సిటీబ్యూరో: కొత్త సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న రాత్రినిర్వహించే వేడుకలపై గ్రేటర్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఆ రోజు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ పేరుతో పూటుగా మద్యం తాగి వాహనంపై దూసుకెళదామనుకునేవారికి ముందుగానే బ్రేకులు వేయనున్నారు. గతేడాది అమలు చేసినట్టుగానే ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. అయితే, ఈసారి మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే మాత్రం రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష పడుతుందని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెన్షన్ చేయనున్నట్టు సైబరాబాద్, రాచకొండ పోలీసుకమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ హెచ్చరించారు. అందరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీసులు చేపట్టే ఈ తనిఖీలకు నగరవాసులు సహకరించాలని వారు కోరారు. వేడుకల నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు హోటల్స్, ఈవెంట్ నిర్వాహకులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
మార్గదర్శకాలు పాటించాల్సిందే..
న్యూ ఇయర్ వేడుకలకు డిసెంబర్ 31న రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకే అనుమతి ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ సమయం మించి ఈవెంట్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ‘ఈవెంట్లలో డీజేలకు అనుమతి లేదు. సౌండ్ సిస్టంల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, డ్రగ్స్, హుక్కా వంటివి పూర్తిగా నిషిద్ధం. వీటిపై గట్టి పోలీస్ నిఘా ఉంటుంది. రేవ్ పార్టీలకు కూడా అనుమతి లేదు. ఈవెంట్లలో భద్రతను నిర్వాహకులే చూసుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాల(ఫైర్ ఎక్స్‌టింగుషర్లు)ను సిద్ధంగా ఉంచుకోవాలి. పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నిర్వాహకులదే. అవసరం మేరకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించుకోవాలి. సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలి. వేడుకల్లో ఆయుధాలకు అనుమతి లేదు. వేడుకలకు అనుమతి తీసుకున్న వారు కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేసి పోలీసులకు రెండు రోజుల్లో సమర్పించాలి. ఈవెంట్‌లో ఏమైనా గొడవ జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే నిర్వాహకుడినే విచారిస్తా’మని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మద్యం అమ్మకాల రికార్డు!
డిసెంబర్ 31 సంబరాల కోసం మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. 2018 డిసెంబర్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు సాగడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అయితే, ఇటీవలే మద్యం ధరలను పెంచడంతో ఈసారి ‘డబుల్’ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం అమ్ముడవుతోంది. కగా, గడిచిన ఏడాది డిసెంబర్ 31 ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.133 కోట్ల లిక్కర్ అమ్ముడుపోయింది. హైదరాబాద్ జిల్లాలో రూ.19.5 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.15.30 కోట్లు, మేడ్చల్‌లో రూ.11.90 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈసారి కూడా గ్రేటర్‌లో పెద్ద సంఖ్యలో ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేయడం, రాత్రి ఒంటి గంట వరకు బార్లకు అనుమతివ్వడంతో లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అయితే, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు టికెట్ చూపిస్తే మినహాయింపు ఉంటుంది. అలాగే, బేగంపేట ఫ్లైఓవర్ మినహాయించి మిగతా ఫ్లై ఓవర్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.’’
‘జోష్’ అనుమతి లెక్క ఇదీ..
నయాసాల్‌కు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 124 ఈవెంట్లకు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 75 ఈవెంట్లకు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 33 ఈవెంట్లకు అనుమతిచ్చారు. అయితే, హైదరాబాద్ కమిషనరేట్ విషయానికొస్తే అత్యధికంగా వెస్ట్‌జోన్‌లో 68 ఈవెంట్లు ఉండగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్‌లోనే 63 ఈవెంట్లకు అనుమతించారు. ఈవెంట్లకు వచ్చేవారి భద్రత బాధ్యత నిర్వాహకులదేనని, రాత్రి ఒంటి గంటలోపు వేడుకలు ముగించాలని పోలీసులు ఆదేశించారు.
డిజిగ్నేటెడ్ డ్రైవర్లను వాడుకోండి
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేయనున్నట్టు నేపథ్యంలో మద్యం తాగి వాహనాలు నడపకపోవడమే మంచిది. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తాం. పార్టీల నిర్వాహకులు క్యాబ్‌లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలి. ‘డిజిగ్నేటెడ్ డ్రైవర్’ సేవలను వినియోగించుకుంటే ప్రమాదాలకు అవకాశం ఉండదు. – మహేష్ భగవత్, రాచకొండ సీపీ
ఈవెంట్ల వద్ద డిస్‌ప్లే తప్పనిసరి
డ్రంకన్ డ్రైవ్ తీవ్రమైన నేరం. 100 మి.లీ రక్తంలో ఆల్కహల్ పరిమితి 30 మైక్రోగ్రాములు మించొద్దు. ఈ అంశాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్క్రీన్‌పై ప్రదర్శించాలి. దీనివల్ల వేడుకల్లో పాల్గొనేవారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ
Comments
Please login to add a commentAdd a comment