మైనర్‌ మందుబాబులు | Police Register Over 1400 Drunk Driving Cases On December 31 Night | Sakshi
Sakshi News home page

మైనర్‌ మందుబాబులు

Published Wed, Jan 4 2023 2:08 AM | Last Updated on Wed, Jan 4 2023 2:08 AM

Police Register Over 1400 Drunk Driving Cases On December 31 Night - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ జరిగిన ‘డిసెంబర్‌ 31’ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 1413 మంది హైదరాబాద్‌ పోలీసులకు చిక్కగా... వీరిలో మైనర్లు 22 మంది ఉన్నారు. రాచకొండలో 446 మంది పట్టుబడితే... మైనర్లు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌లోనూ ఇలాంటి సీనే. ఇక్కడే ఓ కీలక విషయాన్ని అటు ట్రాఫి క్, ఇటు శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్‌ ఫోర్స్, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌లు మర్చిపోయాయి. అదే మైనర్లకు సైతం మద్యం లభించడం.

వారికి మద్యం ఎలా వచ్చింది?
ఎక్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. వీరిని బార్లు, పబ్‌లలోకి అనుమతించడమూ నిషిద్ధమే. ‘డిసెంబర్‌ 31’న చేపట్టిన డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షల్లో పట్టుబడిన మైనర్లు వైన్‌ షాపులో ఖరీదు చేసుకుని తాగడమో, బార్‌కు వెళ్లడమో జరిగి ఉండాలి. వీటిలో ఏది జరిగినా ఆయా యాజమాన్యాలపై చర్య తీసుకోవాల్సిందే.

2016 నాటి చిన్నారి రమ్య ప్రమాదంతో పాటు నగరంలో అనేక యాక్సిడెంట్లకు మద్యం మత్తులో ఉన్న మైనర్లు కారణమయ్యారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు మద్యం ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టి హడావుడి చేస్తు న్నారు. డిసెంబర్‌ 31 నాటి డ్రంక్‌ డ్రైవర్ల విషయంలో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అనేక సందర్భాల్లో ఉల్లంఘన జరగడానికి కారణమ వుతోంది.  

అక్కడితో ఆగిపోయిన సీన్‌
ఇలా పట్టుబడిన మందు‘బాబుల’ నుంచి ట్రాఫిక్‌ పోలీసులు అప్పటికప్పుడే వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరికి నిర్ణీత తేదీల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఆపై ఈ ‘నిషా’చరులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. కేసు పూర్వాపరాలు, మద్యం మోతాదు, నడి పిన వాహనం... ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకునే న్యాయస్థానం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది.

ఈ తంతు పూర్తయిన తర్వాత ఆవ్యక్తికి లేదా సంరక్షకుడికి ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ‘డిసెంబర్‌ 31’ నాడు చిక్కిన డ్రంక్‌ డ్రైవర్ల కథ కూడా అక్కడితోనే ముగిసిపోతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ప్రతి ఏడాదీ ఇలానే జరుగుతోంది. కానీ...

కనిపెట్టడం పెద్ద కష్టం కాదు...
డిసెంబర్‌ 31’న  పట్టుబడిన మందుబాబుల్లో 21 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం ఎవరు విక్రయించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్లు నిర్ణీత సమయంలో కచ్చితంగా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్‌కు, ఆపై ట్రాఫిక్‌ పోలీసులు సూచించినప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఆయా సందర్భాల్లో వారిని విచారించడం ద్వారా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చింది?  

ఎక్కడ తాగారు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది తెలిసినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏదైనా సంస్థపై ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే లైసెన్స్‌ ఇచ్చిన అథారిటీకే సాధ్యం. దీంతో ఆయా వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్, లోకేషన్‌ వంటి ఆధారాలతో సహా ఎక్సైజ్‌ శాఖకు అందించి, లైసెన్సు రద్దు/సస్పెన్షన్‌ సహా చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇలా చేస్తే మరోసారి ఉల్లంఘన, భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులకు ఈ అంశం పట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి. 

మైనర్‌ డ్రైవింగ్‌ కూడా తీవ్రమైనదే..
డ్రంక్‌ డ్రైవింగ్‌ చేస్తూ చిక్కిన మైనర్లకు సంబంధించి మరో కీలకాంశమూ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం సాధారణంగా మైనర్లకు లైసెన్సులు జారీ చేయరు. దీంతో వీళ్లు వాహనం నడపకూడదు,  మైనర్‌ డ్రైవింగ్‌ చేయడమే కాదు వారికి, లైసెన్సు లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమే. ఇలా చేసినందుకు వాహనం ఎవరి పేరుతో రిజిస్టరై ఉందో ఆ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘డిసెంబర్‌ 31’న చిక్కిన మైనర్ల విషయంలోనూ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement