![Alcohol Detection Device Innovative Karimnagar Student - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/31/alcohol.jpg.webp?itok=ncYKxdhl)
విలేకరుల సమావేశంలో తయారు చేసిన పరికరాన్ని చూపిస్తున్న సాయి తేజ
పంజగుట్ట: అతను చదివింది కేవలం 10వ తరగతి. పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా, కోరుట్లలో. పేద కుటుంబం. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు లాంటివి ఏమీలేవు. కాని ఏదైనా చేయాలనే పట్టుదలతో కొత్త ఆవిష్కరణలకు రూపొందించాడు సాయితేజ. ఇప్పటికే నీటితో నడిచే సైకిల్‌ను కనుక్కొన్నాడు. ప్రస్తుతం చాలామందికి ఉపయోగపడే ‘ అల్కాహాల్ డిటెక్షన్ డివైజ్’ యంత్రాన్ని కనుక్కొని, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. త్వరలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నాడు. మందుబాబులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేదుకు ఈ ఆల్కహాల్ డిటెక్షన్ డివైజ్ ఎంతో ఉపయోగపడుతుంది.
యంత్రం పనిచేసే విధానం
అల్కాహాల్ డిటెక్షన్ డివైజ్ కారులో అమర్చగానే 30 శాతం కన్నా ఎక్కువగా ఒక్కశాతం మద్యం ఎక్కువగా తాగినా కారు లాక్ అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాదు. అంతే కాదు అందులో ఉన్న జీపీఏ ఆధారంగా కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లకు మద్యం ఏ మోతాదులో తాగాడో మెసేజ్ వెళుతుంది. ఈ పరికరంలో ఏర్పాటు చేసిన మైక్రొ కంట్రోలర్లు అల్కాహాల్‌ను డిటెక్ట్ చేసి వాహనం స్టార్ట్ కాకుండా చేస్తాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వాహనాన్ని నడపలేడు. ఈ పరికరం కేవలం కార్లకే కాకుండా ద్విచక్రవాహనాలకు, లారీలకు కూడా అమర్చవచ్చునన్నారు. దీని ధర కేవలం రూ.2500. కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్ సాయంతో 15 రోజులు కష్టపడి ఈ దీన్ని రూపొందించారు.
ఎల్‌బీ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లు మాట్లాడుతూ.. ఈ పరికరంవల్ల గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చునని, ఎన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుందన్నారు. శిక్షలు వేస్తున్నా, కౌన్సిలింగ్ ఇస్తున్నా మార్పు రావడంలేదని, ఈ సమయంలో తెలంగాణ యువకుడు సాయి తేజ డిటెక్టర్ కనుక్కోవడం ఎంతో అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment