చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు... | 2100 Drunk And Drive Cases File on January First | Sakshi
Sakshi News home page

చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు...

Published Thu, Jan 2 2020 10:59 AM | Last Updated on Thu, Jan 2 2020 11:34 AM

2100 Drunk And Drive Cases File on January First - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌లో డిసెంబర్‌ 31వ తేదీన మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. నూతన సంవత్సరవేడుకలను పురస్కరించుకుని మందుబాబులు తెగ తాగేశారు. సాధారణ రోజుల్లో ఉండే విక్రయాలకు ఆరు నుంచి ఏడు రెట్లుఅధికంగా లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి. దీంతో రూ.100 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో 173, రంగారెడ్డి జిల్లాలో 195, మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో 181 మద్యం దుకాణాలు ఉన్నాయి. 620 బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో గ్రేటర్‌ పరిధిలో రూ. 15.5 కోట్ల మద్యం విక్రయాలు జరగుతుంటాయి. 

వారం రోజుల నుంచే స్టాక్‌
మద్యం దుకాణాల నిర్వాహకులు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా విక్రయాలు ఉంటాయే ఉద్దేశంతో వారం రోజుల ముందు నుంచే స్టాక్‌ను నిల్వ చేసుకున్నారు. డిసెంబర్‌ 31న ఉండే క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాల నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గ్రేటర్‌లో 1.10 లక్షల కేసుల బీర్లు, 1.25 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగాయి.

భారీగా ఆఫర్లు.....

మద్యం ప్రియులను ఆకర్షించేందుకు బార్‌లు, పబ్‌లు, ఈవెంట్ల నిర్వాహాకులు భారీగా ఆఫర్లను ప్రకటించారు. ప్యాకేజీల పేరుతో అన్‌లిమిటెడ్‌ మద్యాన్ని సరఫరా చేశారు. ఆఫర్లు ఎక్కువగా ఉండటంతో గ్రేటర్‌తో పాటు, శివార్లలో నిర్వహించిన ఈవెంట్లు అన్ని మందు బాబులతో నిండిపోయాయి. డిసెంబర్‌ 31 వతేదీని పురస్కరించుకుని ప్రభుత్వం ఒక గంట సమయం అదనంగా అనుమతి ఇచ్చింది. దీంతో అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్‌లు కిక్కిరిసిపోయాయి. 

రేట్లు పెరిగినా....
ప్రభుత్వం ఇటీవల లిక్కర్, బీర్ల ధరలను భారీగా పెంచినప్పటికి దాని ప్రభావం నూతన సంవత్సర వేడుకలపై పడలేదు. ధరలు పెరిగినప్పటికీ విక్రయాలు జోరుగా ఉండటంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయంసమకూరింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్‌ వినియోగిస్తారనే ముందస్తు సమాచారంతో అబ్కారీ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లను చేశారు. నెల రోజుల ముందు నుంచే సరఫరా చేసే వారితో పాటు, కొనుగోలు దారులపై నిఘా ఉంచారు. పలువురిని అరెస్ట్‌ చేయడంతో పాటు, కొకైన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోయారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి.  

భారీ సంఖ్యలో దొరికిపోయారు..
నూతన సంవత్సరం వేళ...డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లలో మందుబాబులు భారీ సంఖ్యలో దొరికిపోయారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని...విస్తృత తనిఖీలు చేసి మందుబాబుల పనిపడతామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా..అవేవీ పనిచేయలేదు.  డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి 2100 డ్రంకన్‌ డ్రైవ్‌æ కేసులు నమోదయ్యాయి. పోలీసు విభాగం ఎన్ని సూచనలు చేసినా... ఎంతగా హెచ్చరించినా... మందుబాబులు మాత్రం పట్టించుకోలేదు. డిసెంబర్‌ 31 నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగిన అనేక మంది వాహనాలు నడిపేశారు. ఈ నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో 150 బృందాలు తనిఖీలు నిర్వహించగా... 2100 మంది చిక్కారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో 90 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలోనే 951 మంది పట్టుబడ్డారు. సైబరాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిన 868 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అత్యధికంగా సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు 233 కేసులు నమోదు చేయగా... అత్యల్పంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఒకే ఒక్క ‘నిషా’చరుడిని పట్టుకున్నారు. సిటీ ట్రాఫిక్‌ పోలీసులు మొత్తం 22,543 వాహనాలను తనిఖీ చేశారు.

వీరిలో ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువ మంది ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ‘న్యూ ఇయర్‌ డే’ను జీరో యాక్సిడెంట్‌ నైట్‌గా చేయడానికి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మంగళవారం రాత్రి 7 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. ట్రాఫిక్‌ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన మందుబాబుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి కుటుంబం సభ్యుడు లేదా సంరక్షకుడి సమక్షంలో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. ఆపై వీరిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరుగురు మైనర్లు సైతం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్‌లో ఒకరు, సైబరాబాద్‌లో ఇద్దరు, రాచకొండ ల్లో మరొకరు పట్టుబడ్డారు. వీరిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 100 మిల్లీ మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి ఆల్కహాల్‌ ఉంటే అది ఉల్లంఘన కిందికి వచ్చి డ్రంక్‌ డ్రైవింగ్‌గా  పరిగణిస్తారు. సైబరాబాద్‌ పరిధిలో చిక్కిన ఓ వ్యక్తి బీఏసీ కౌంట్‌ ఏకంగా 550 వచ్చిందని అధికారులు తెలిపారు.

72 మందిపై కేసులు
బంజారాహిల్స్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంగళవారం అర్థరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు 20 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు కూడా పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 52 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఏడు కార్లు, 45 ద్విచక్రవాహనాలు ఉన్నాయి.

మెట్రో జర్నీతో సరికొత్త చరిత్ర
న్యూ ఇయర్‌ జోష్‌ సంబరాల్లో మెట్రో పంట పండింది. రికార్డు సంఖ్యలో ప్రయాణికుల జర్నీతో సరికొత్త చరిత్ర సృష్టించింది. డిసెంబర్‌ 31 సందర్భంగాఅర్ధరాత్రి 2 గంటల వరకుమెట్రో రైళ్లునడపడంతో 4.60 లక్షల మంది మెట్రో జర్నీ చేశారు. ఎల్బీనగర్‌ – మియాపూర్, నాగోల్‌–రాయదుర్గం రూట్లల్లో మొత్తంగా 40 వేల మెట్రో ట్రిప్పులను నడిపినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మందు బాబులను సైతం మెట్రో జర్నీకి అనుమతించడంతో ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. సాధారణ రోజుల్లో మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య 4.10 లక్షల నుంచి 4.20 లక్షలు మాత్రమే ఉంటుంది.

రైళ్లను అర్ధరాత్రి 2 గంటల వరకు నడపడంతో 40 వేల మంది అధికంగా ప్రయాణించారు. అత్యధికంగా ఎల్బీనగర్, మియాపూర్‌, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌ నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, పరేడ్‌ గ్రౌండ్స్, నాగోల్‌ మెట్రో స్టేషన్లు ప్రయాణికుల రద్దీ తో కిటకిటలాడాయి. మొత్తంగా ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో 2.69లక్షలు, నాగోల్‌–రాయదుర్గం రూట్లో 1.91లక్షల మంది ప్రయాణించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement