డాన్స్ రాజా డాన్స్ | dance raja dance | Sakshi
Sakshi News home page

డాన్స్ రాజా డాన్స్

Published Sun, Dec 29 2013 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

డాన్స్ రాజా డాన్స్

డాన్స్ రాజా డాన్స్

 వివరం
 డిసెంబర్ 31 రాత్రి మీ చేతుల్లో ఏముంటుందో చెప్పలేం. కానీ కాళ్లల్లో మాత్రం డాన్స్ ఉంటుంది.
 ఆ రోజు తేగలిగే ఉత్సాహం అలాంటిది మరి! పాతదాన్ని వదిలి, కొత్తదాన్ని ముద్దాడబోయే క్షణం ఎవరినైనా నృత్యం చేయిస్తుంది. అది మీరు బయటకు ప్రదర్శిస్తారా,
 మీ ఒంట్లోనే ఎవరికీ కనబడకుండా చేస్తారా
 అనేది మీ స్థాయి, సౌలభ్యం, మానసిక స్థితి మీద ఆధారపడివుంటుంది.
 డాన్స్ లేనిదే (హ్యాపీ) న్యూ ఇయర్ లేదు. కాబట్టి, 2014ను స్వాగతిస్తున్న సందర్భంలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని పార్టీడాన్స్ ముచ్చట్లు చెప్పుకుందాం.
 
 ఎప్పుడూ దేవుణ్ని నమ్మని తత్వవేత్త నీషే కూడా ఒక మాట అంటాడు: (దేవుడినంటూ నమ్మాల్సివస్తే) ‘‘డాన్స్ చేయడం తెలిసిన దేవుణ్ని మాత్రమే నేను విశ్వసిస్తాను’’.ఆ మాత్రం ఆనందం పంచడం తెలియని, ఆ మాత్రం ఆనందించడం తెలియని దేవుడు ఇంకేం దేవుడు!కల్యాణం వచ్చినా, అటుపైన రాయలేని ఇంకేదో వచ్చినా ఆగదంటారుగానీ ఒక మనిషిలోకి డాన్స్ ప్రవేశిస్తే ఆపుకోవడం కష్టం. చెంపలతో నవ్వుతూ, చతుర్లు రువ్వుతూ, కాళ్లు కదిలిస్తూ, నరాల్లో రక్తం ఉరకలెత్తగా... సంతోషాన్ని మనిషి తట్టుకోవడం కష్టం. సంతోషాన్ని మనిషి దాచుకోవడమూ కష్టమే. దాన్ని వెల్లడించి తీరాలి. ఆ ఊపు, ఆ తీపు ప్రాథమికంగా నృత్యానికి రూపునిచ్చివుంటాయి. ఆ ఉద్వేగం సంతోషమే కానక్కర్లేదు, తీవ్రమైన దుఃఖం కూడా ఒంటిని కంపింపజేస్తుంది. దాన్ని బయటికి పారదోలి, శరీరాన్ని సాధారణ స్థితికి తేగలిగే ‘స్ట్రెస్ బస్టర్’ కూడా డాన్సే! అందుకే నృత్యం మనిషి రూపొందించుకున్న అతిప్రాచీన కళారూపం.
 
 వేల ఏళ్ల పాతది
 శరీరాన్నీ, కాళ్లు చేతుల్నీ కదిలిస్తూ, అమూర్తభావాల్ని వ్యక్తీకరించే డాన్స్ దానికదే ఒక కళారూపంగా ఎలా, ఎప్పుడు అవతరించిందో చెప్పడం కష్టం. ప్రతిదీ జానపదంగా మొదలయ్యి, నెమ్మదిగా మరొక మెట్టుకు చేరుకోవడమో, లేదా ఆ జానపదాన్ని కలుపుకుంటూనే మరింత క్రమాన్ని సంతరించుకోవడమో జరిగింది.
 పరమశివుణ్ని నటరాజుగా కొలిచే ఈ భారతనేలమీదే నృత్యానికి సంబంధించిన ప్రాచీన రుజువులు దొరకడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భేట్కా రాతిగుహల్లో మనుషులు నృత్యం చేస్తున్నట్టుగా గీసిన పెయింటింగ్స్ కనబడ్డాయి. ఇవి సుమారు 9000 ఏళ్ల నాటివి. అంటే, దాదాపుగా వ్యవసాయం మనిషికి తెలిసినప్పటి కాలం. సంచారజీవితం క్రమంగా స్థిరీకరణ జరుగుతున్న దశ. ఆ లెక్కన భరతముని ‘నాట్యశాస్త్రం’ కూడా ఇక్కడే వెలువడటంలో కూడా అందుకే ఆశ్చర్యం లేదు.
 
 క్రీ.పూ. 3300 కాలంలో ఈజిప్షియన్ నృత్యాన్ని చెక్కివున్న ప్రతిమలు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ప్రతీ ప్రాంతంలోనూ మనుషులు తమవైన ఆనందపు ప్రకటనల్ని నృత్యంగా వెల్లడించుకునివుంటారు. అయితే, ప్రాచీన నృత్యాలన్నీ తమ దేవుళ్లను మచ్చికచేసుకోవడానికో, మెప్పించడానికో చేసినవే. అందుకే చాలా నృత్యరీతులు మతంలో అంతర్భాగంగా ఉంటూవచ్చాయి. అలాగే డాన్స్ కూడా విడి అస్తిత్వం ఉన్నది కాదు. నృత్యం, సంగీతం, కవిత్వం మూడూ కవల సోదరులు. ఇవన్నీ కలిస్తేనే ఆనందం పరిపూర్ణమవుతుంది.
 
 ప్రతీ తెగకూ, ప్రాంతానికీ తమవైన నాట్యరీతులు, ఆచారాలున్నాయి. వాళ్ల వేటజీవితం, సంచార సంగతులు, పోరాటాలు కథలుగా మలిచారు. అమెరికన్ తెగల్లో కరువు కాటకాల సమయంలో ఇసుకలో పశ్చిమంవైపు ముఖం పెట్టివున్న తాబేలును కట్టెకు కట్టి నృత్యం చేసేవాళ్లు. ఇప్పుడు రైన్ డాన్స్ అని చెబుతున్నదానికి మూలం అది. తాబేలు ఆచారంలాగే మన దగ్గర కప్పతల్లిని ఊరేగించడం తెలిసిందే. అంటే మనుషుల మౌలిక స్వభావం, ఆలోచనారీతి ఒకేలా ఉంటుందని చెప్పడానికే ఈ ఉదాహరణ.
 
 ప్రసిద్ధ నృత్యరీతులు
 రూపంలేని అంతర్గత భావనకు బాహ్యరూపు కల్పించడమే డాన్స్. అది ఏడుపు, సంతోషం, ఇంకేదైనా సరే! చేసే మనిషిని బట్టి, శరీర విన్యాసాన్ని బట్టి, హావభావాల్ని బట్టి, గుంపుగా అయితే ఏకలయగా వాళ్లు కలిసిపోవడం బట్టి, ఆనందం కలుగుతుంది. సాధారణంగా అబ్బాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో చెప్పడం కష్టం; అమ్మాయిల్లో ఎవరు బాగా డాన్స్ చేయరో చెప్పడం కష్టం. అమ్మాయిల్లో ఉండే గ్రేస్, ఆ కదిలే తీరుతో సహజంగానే నాట్యాన్ని మరింత ఆనందమయం చేస్తారు. అందుకే తొలి ప్రాధాన్యత వారికే ఉంటుంది. అయితే, జీన్ కెల్లీ (డాన్స్ ఇన్ ద రెయిన్) లాంటి హీరో చేసినప్పుడు చూస్తే డాన్స్ అనేది ఎంత ఆనందాన్ని తోడిపెట్టగలదో అర్థమవుతుంది. మన ప్రభుదేవాను చూసినా కూడా! ప్రతి మనిషీ తన శరీరాన్ని కదిల్చే తీరులో ఒక మెరుపును, విరుపును ఇచ్చినట్టే, ప్రతి నృత్యం విడిగా ఇవ్వగలిగే సంతోషం ఉంటుంది. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కొన్ని డాన్సుల్తో ఓసారి కాలు కలిపి, కదిపి చూద్దాం! ‘పద్ధతి’గా ఉండే భరతనాట్యం, కూచిపూడిలాంటివాటిని ఇక్కడ ఉటంకించబోవడంలేదు. ప్రతి నృత్యరీతీ ఒక పద్ధతే అయినప్పుడు, ఇక్కడ పద్ధతి అనేమాటను భిన్నార్థంలో వాడుతున్నామని గ్రహించాలి.
 
 బ్యాలె
 ఆకర్షణీయమైన కాస్ట్యూమ్స్, విశాలమైన స్టేజీ... చప్పున స్ఫురించే బ్యాలే 15వ శతాబ్దంలో ఇటలీలో అవతరించింది. ఫ్రాన్స్, రష్యాల్లో మరింత వృద్ధి చెందింది. ఇది బృందనృత్యం. రాజాస్థానాల్లో బాగా ఆదరణ పొందింది. ‘బ్యాలె’ అన్న మాటకు అర్థం డాన్స్ చేయడమనే! 3500 ఏళ్లనాటి ఈజిప్షియన్ నృత్యానికీ, నేటి ఆధునిక బ్యాలేలకూ మధ్య భంగిమల్లో పోలిక ఉండటం... నృత్యం ఎంత పాతదో చెబుతుంది; అదే సమయంలో ఎప్పటికప్పుడు ఎంత నవీనమో వెల్లడిస్తుంది.
 
 బాల్‌రూమ్ డాన్స్
 ప్రధానంగా స్త్రీ, పురుష నృత్యరీతి. విశాలమైన గదుల్లో ప్రదర్శనను కోరుకుంటుంది. 16వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో అభివృద్ధి చెందిన ఈ నృత్యరీతి సంపన్న వర్గాల ఆదరణ పొందింది. పాశ్చాత్య సినిమావాళ్లకు కూడా ఇది ఇష్టమైన ప్రక్రియ. ‘బాల్’ అనే లాటిన్ మాట  డాన్స్ చేయడమని అర్థం.
 
 
 బెల్లీ డాన్స్
 నిజానికి దీన్ని బెల్లీ డాన్స్ అనడం సగం నిజమే. శరీరంలోని ప్రతి అవయవమూ కదిలించాల్సిందే! అందునా  పిరుదుల కదలిక ఎక్కువ. ఈ పశ్చిమాసియా నృత్యం 18, 19 శతాబ్దాల్లో పాశ్చాత్యులకు బాగా చేరువై, మరింత పేరొందింది. బృందంగా నర్తించినప్పటికీ, సోలోలు మరింత బాగుంటాయి. దీన్ని ప్రాచ్య నృత్యమనీ, అరబిక్ నృత్యమనీ, ఈజిప్షియన్ నృత్యమనీ కూడా పిలుస్తారు.
 
 ట్యాప్ డాన్స్
 నేలమీద బూట్లతో లయబద్ధంగా ధ్వనిని పుట్టిస్తూ చేసే డాన్స్ ఇది. ఆ శబ్దం దానికదే ఒక సంగీతం. దీనికోసం ప్రత్యేకమైన షూలు ఉంటాయి. వాటిమీద వాడే లోహపు అతుకును బట్టి ధ్వని మారుతూవుంటుంది. 1850ల ప్రాంతంలో ఇది ఆవిర్భవించింది. ఆఫ్రికన్ అమెరికన్ మూలాలున్న జూబా నృత్యం, ఇంగ్లీష్ లాంక్‌షైర్ క్లాగ్ నృత్యం, ఐరిష్ స్టెప్‌డాన్సింగ్ లాంటి కలయికతో దీని సృష్టి జరిగింది. ఇది కూడా సినిమా నాట్యాల్లో విశేష ఆదరణ పొందింది.
 
 ట్యాంగో
 ఇది చేయడానికి భాగస్వామి తప్పనిసరి. పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఆవిర్భవించింది. అర్జెంటీనా, ఉరుగ్వే సరిహద్దు ప్రాంతాలు జన్మస్థానాలు. సినిమాల ద్వారా విశేష ఆదరణ పొందింది. ఎన్నో రీతులు వచ్చినప్పటికీ అసలైనదిగా అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీల్లో చేసిన తొలి రూపమే గుర్తింపుపొందింది. యునెస్కో వారసత్వ సంపద ఘనతను పొందిన కళారూపం ఇది.
 
 సల్సా
 టమోటా, ఉల్లిగడ్డలు, మిరియాలపొడి వేసిన ఒక హాట్ మెక్సికన్ సాస్‌ను సల్సా అంటారు. ఇది కూడా అలాంటి వేడిపుట్టించే డాన్సే! దీనిలో కూడా భాగస్వామి ఉండాలి. నైట్‌క్లబ్బులు, బార్లలో బాగా చేస్తారు. 1970ల్లో వృద్ధి చెందింది. లాటిన్ అమెరికా నుంచి, ఇంకా ముఖ్యంగా క్యూబా నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది.  
 
 లైన్ డాన్స్
 స్వింగ్, డిస్కో, జాజ్, రాక్ ఎన్ రోల్ లాంటి సంగీతాలన్నింటితోనూ ఈ రీతికి అనుబంధం ఉంది. అల్బేనియా, బోస్నియా, క్రొయేషియా, గ్రీస్, కొసావో, మెసిడోనియా లాంటి దేశాలుండే బాల్కన్ ప్రాంతంలో పుట్టింది. డాన్స్ చేసేవాళ్లందరూ కొన్ని వరుసల్లో- అది వృత్తం కూడా కావొచ్చు- ఉండి చేయడం దీని ప్రత్యేకత. ఇందులో పాల్గొనడానికి స్త్రీ-పురుష నియమం లేదు. బృందం సరిపోతుంది.
 
 బ్రేక్‌డాన్స్
 ఇరుకు గల్లీల్లో పుట్టింది. మైకేల్ జాక్సన్‌లాంటి వారివల్ల ఇది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. జిమ్నాస్టిక్స్‌ను తలపించే శరీర విన్యాసాలు ఎక్కువ. ఆశ్చర్యం పుట్టించేలా శరీరాన్ని సమన్వయం చేసుకోవడం కనబడుతుంది. మనదగ్గర చిరంజీవి దీనికి ‘బ్రేక్’ ఇచ్చాడని చెప్పాలి.
 
 గంగ్నమ్ స్టైల్
 అతికొత్తదీ, తక్కువ కాలంలో ఆదరణ పొందిన డాన్స్ ఇది. పోయిన డిసెంబర్‌లో విడుదలైంది. యూట్యూబ్‌లో ‘బిలియన్ వ్యూవర్స్ మార్క్’(వంద కోట్లు) దాటిన తొలి వీడియో. రెండు వందల కోట్లకు పరుగెడుతోంది. స్టేజ్‌నేమ్ ‘సై’తో ప్రసిద్ధుడైన కొరియన్ మ్యూజీషియన్ పార్క్ జే-సంగ్ దీనికి ఆద్యుడు. ‘ఒప్పన్ గంగ్నమ్ స్టైల్’ అని వీడియోలో వినిపించే ఆ మాటకు అర్థం: ‘పెద్దన్నది గంగ్నమ్ స్టైల్’. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఒక చిన్న పరిపాలనా విభాగం ఈ గంగ్నమ్ ప్రాంతం. మొన్నటి ‘కొలవెరి’ మేనియాలా దీన్ని భావించవచ్చేమో!
 
 చివరగా...
 సాషెల్ పైజ్ అన్నట్టుగా- ‘డబ్బులు అసలు అక్కర్లేనట్టుగా పనిచేయండి. ఎప్పుడూ గాయపడలేనట్టుగా ప్రేమించండి. ఎవరూ గమనించడం లేదన్నట్టుగా డాన్స్ చేయండి’. అలాగే ‘మనం చదువుదాం, మనం నృత్యం చేద్దాం- ఈ రెండు వినోదసాధనాలు ఏనాడూ ప్రపంచానికి ఏ చెడూ చేయవు’ అన్న వోల్తేయిర్ మాటలు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకుందాం.
 
 సంగీతలయకు అనుగుణంగా శరీరాన్ని ఊయల్లాగా తిప్పే చైనా సంప్రదాయ జానపద రీతి ‘యాంకో డాన్స్’, విచిత్రవేషధారణతో దారిపొడుగునా అలుపు లేకుండా చేస్తూవెళ్లే బ్రెజిల్ ‘సాంబా డాన్స్’, పంటచేతికొచ్చిన ఉత్సాహంలో చేసే భల్లేభల్లే పంజాబ్ డాన్స్ ‘భాంగ్డా’.... ఇంకా ఎన్నో!
 డాన్స్ అనేది ఒత్తిడి నుంచి విముక్తి కలిగిస్తుంది, క్రియేటివ్ ఔట్‌లెట్‌గా పనిచేస్తుంది, సమస్యను మరిచిపోయేట్టు చేస్తుంది, వ్యాయామానికి కారణమవుతుంది. అన్నింటికీ మించి అది ఒక స్వేచ్ఛను ప్రకటించుకునే తీరు. కాబట్టి ఏదోలా డాన్స్ చేయండి. ఇవన్నీ వద్దనుకుంటే మన ‘మాయదారి మైసమ్మ’ ఉండనే ఉంది. లేదంటే, ‘ఎయ్‌ర మామ’ తీన్‌మార్!
 
 
 8
 వివేకం
 
 నూతన సంవత్సరం గొప్ప వరం
 
 జీవితంలో నూతన ఆకాంక్షలకు తెర తీయడానికి ఈ నూతన సంవత్సరం గొప్ప వరం. మన చుట్టూ ప్రపంచాన్ని పరికిస్తే అది అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనకు అందుబాటులోకి వచ్చిన ఎన్నో సౌకర్యాలతో ఆనందించాల్సింది పోయి, తనకూ ఇంకా ఇతరులకూ మనిషి కలిగించే కష్టనష్టాలకు అంతే లేదని చెప్పాలి.
 ఈనాటి వాస్తవం ఇదే. ఎక్కడా స్పష్టత అనేదే లేదు. నిజానికి తమకు ఏమి కావాలో కూడా తెలియకుండానే, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండానే, ఈ ప్రపంచంలోని చాలామంది జీవితాలు గడిపేస్తున్నారు.
 ఎప్పుడైనా మన అనుభవాల ఆధారంగానే మనం ముందుకు వెళితే, అది కేవలం సాధారణ విషయాలకే పరిమితమౌతుంది. అలా చేస్తే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగానే జీవితాల్ని మలచుకొంటూ ఉంటాం. కాని రేపు మనం పోదామనుకుంటున్న దానికీ, ప్రస్తుతం మనం ఉన్నదానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో ఏది ఉత్కృష్టమైనదిగా మనం కోరుకుంటున్నామో దానికీ, మన ప్రస్తుత పరిస్థితికీ సంబంధం ఉండనక్కరలేదు.
 
  మన దృక్కోణాన్ని ప్రస్తుత పరిస్థితులకు పరిమితం చేసివేసినట్టయితే, సాధించడానికి వీలైన, సులభమైనదానితోనే మళ్లీ మనం రాజీపడిపోతున్నామని అర్థం.తనకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికి కూడా అత్యున్నతమైనదాన్ని సాధించాలని ఎవరైనా దృష్టి కేంద్రీకరిస్తే, అది సృష్టించడం మనిషి సామర్ధ్యానికి అతీతమైనదేమీ కాదు. ఎవరి దృక్కోణం చాలా స్పష్టంగా ఉంటుందో, దాన్ని సాకారం చేసుకోవడం కోసం తన జీవితంలోని ప్రతిక్షణమూ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారి పాదాల చెంతకు ఆ అత్యున్నతమైనది వచ్చి వాలుతుంది. మనకంటూ ఓ స్పష్టమైన యోచన ఉంటే, చేసే పని ఫలితం గురించిన ఆందోళన మనకు లేదని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... మనకు ఓ ఆలోచన ఉంది. మన జీవితాన్ని దానికి అంకితం చేసేశాం. అంతే. నిజానికి అత్యున్నతమైనదాన్ని సాధించడానికి గల అతి సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఇదే ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ. భగవద్గీత యావత్తూ దీని గురించే చెబుతోంది. ‘అది జరుగుతుందా? లేదా?’ అనేదానిని పట్టించుకోకుండా నీవేమి కావాలనుకొంటున్నావో దానికి అంకితమైపో!’ అని.
 
 మన ఆలోచనలో ‘అత్యున్నతమైనది’ అనుకున్న దానికోసం, ఏకాగ్ర చిత్తంతో దాని సాధనకు పూనుకోవలసిన సమయమిది. ఈ జీవితానికీ, దీనికి అతీతమైనదానికీ గల జీవన జ్ఞానాన్ని పొందడానికి ఇదో అతి సులభమైన మార్గం. ఇటువంటి సుస్పష్టమైన దృష్టి గలవాడే నిజంగా ధన్యుడు. అతీతాన్ని కూడా అవలోకనం చేయగల శక్తిని ఈ నూతన సంవత్సరం మీకందరకూ అందించుగాక!
 
 సమస్య - పరిష్కారం
 ఈ నూతన సంవత్సరంలో ఆలోచనా విధానాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కోరుకున్న రీతిగా ఆలోచనలను ఎలా తెచ్చుకోగలను?
 - పి.ప్రసాద్‌బాబు, విజయవాడ
 సద్గురు: అంతా మీ దృక్కోణం మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నవి అని ఆలోచించడం కన్నా, విశాలమైన జీవిత దృక్కోణంతో ఆలోచించడం మంచిది. అసలు మనని మనం ఒక అత్యల్పమైన ధూళి కణంగా భావించి, గమనించాల్సి ఉంటుంది. ఈ విశ్వంతో పోలిస్తే, మనం ఎంతో విశాలమైనదిగా భావిస్తున్న మన పాలపుంత అత్యంత అల్పమైనది. అది చాలా చాలా చిన్నది. ఇక మన పాలపుంతలో మన సౌరకుటుంబం కూడా చాలా చిన్నది. ఈ సౌరకుటుంబంలో మన భూగోళం ఇంకా చాలా చిన్నది. ఇందులో మన ఊరు ఒక చిన్న భాగం.
 
  ఈ అతి చిన్నభాగంలో మనమో... చాలా పేద్ద మనుషులం... అనుకుంటున్నాం కదా! అసలు తామెవరు? ఏమిటి? అనే విషయాన్ని మనుషులు మరచి ప్రవర్తిస్తున్నారు. కనీసపు తెలివితోనైనా ఈ ఉనికిలో మన స్థానమేమిటో తెలుసుకోగలగాలి. ఇదే అతి ముఖ్యమైన విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైతే మరో సరికొత్త లోకం ఆవిష్కారమవుతుంది. అంటే అప్పటినుంచి మన నడక మారిపోతుంది. ఆలోచించడం, కూర్చోడం, నుంచోవడం, తినడం... సర్వం మారిపోతాయి. అంటే మనం జీవితాన్ని అనుభవించే తీరే పూర్తిగా మారిపోతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement