రైల్వేలలో ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా సమ్మె
డిసెంబర్ 5న దేశవ్యాప్త నిరసన దినం
సాక్షి,హైదరాబాద్: రైల్వేలలో ఎఫ్డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)లను అనుమతిస్తే సహించబోమని, దేశవ్యాప్తంగా రైల్వే సేవలను స్తంభింపజేసి సమ్మెకు దిగుతామని భారత రైల్వే కార్మికుల జాతీయ సమాఖ్య (ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. రైల్వేలను నిర్వీర్యం చేసే ప్రైవేటీకరణ, ఎఫ్డీఐల ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించనున్నట్లు తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్ తరహాలో రైల్వేలనూ ప్రైవేటీకరించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడుతోందని, దీని వల్ల రైల్వేలు కూడా దివాలా తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘ్ అధ్యక్షులు ప్రభాకర్ అండ్య్రూ, రాజగోపాల్,పి.ఎస్.పెరుమాల్ , రవిశంకర్, ఉమా నాగేంద్రమణి, భరణి భాను ప్రసాద్ పాల్గొన్నారు.