అతనో బఫూన్, పిచ్చోడు!
లండన్: ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనో 'బఫూన్', 'పిచ్చివాడు' అంటూ విమర్శలు చేశారు. అయితే ఆయనను బ్రిటన్‌లో అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధించాలన్న తీర్మానాన్ని మాత్రం ఏకగ్రీవంగా తోసిపుచ్చారు. బ్రిటన్‌లో ప్రవేశించకుండా ట్రంప్‌ను నిషేధించాలన్న తీర్మానంపై బ్రిటన్ పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది.
ఆయన రాకను నిషేధించాలంటూ దాదాపు 5 లక్షల మంది ఓ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటు ఈ అంశంపై చర్చ చేపట్టింది. బ్రిటన్‌లో ట్రంప్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. తన రాకను నిషేధించాలన్న ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ బ్రిటన్‌లోని తన పెట్టుబడులను ఉపసంహరిస్తానని హెచ్చరించారు. కానీ ట్రంప్ అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన స్కాట్లాండ్ రాష్ట్రం ఎంపీలే ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ బ్రిటన్ రాకుండా నిషేధించాలని చర్చ సందర్భంగా వారు గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం.
అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని, అక్రమ వలసదారులు రాకుండా సరిహద్దులు మూసివేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు గేవిన్ రాబిన్సన్, అలెక్స్ చాక్ తీవ్రంగా తప్పుబట్టారు. తనవైపు జనాలను ఆకర్షించుకునేందుకు ట్రంప్ బఫూన్లా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆలోచన ధోరణి హేతుబద్ధంగా లేదని ఎంపీలు విమర్శించారు.