రహస్య పత్రాలు వెల్లడి.. ఉద్వేగంతో కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్లను శనివారం బహిర్గతం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన నేతాజీ ఫైళ్లను డిజిటల్ రూపంలో విడుదల చేశారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు. బోస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బోస్ కుటుంబ సభ్యులను ప్రధాని పలకరించారు.
ఢిల్లీలోని నేషనల్ ఆర్కైస్ మ్యూజియంలో జరిగిన ఈ కార్యక్రమానికి నేతాజీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పైళ్లను విడుదల చేసిన అనంతరం కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. అటు పశ్చిమబెంగాల్ లో బీజేపీ సంబరాలు చేసింది. కోలకతాలో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
కాగా రహస్య ఫైళ్ల ను బహిర్గతం చేయడం ద్వారా నేతాజీ మరణానికి సంబంధించిన కొన్ని అంశాలు బయటపడే అవకాశాలున్నాయని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.