decreased price
-
భారీగా తగ్గిన ‘జీడి పప్పు’ ధర.. కారణం ఇదే..
మలికిపురం: జీడి గింజల ధర భారీగా పతనమైంది. జీడి పప్పు ధర కూడా కేజీకి రూ.100 వరకూ పడిపోయింది. దీంతో వ్యాపారులు, రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజోలు, నరసాపురం నియోజకవర్గాల్లోని సముద్ర తీరంలో జీడిమామిడి సాగు జరుగుతోంది. ఇక్కడ గింజల ఉత్పత్తి చాలా తక్కువే. అయినప్పటికీ.. మలికిపురం మండలం మోరి గ్రామంలో తయారయ్యే జీడి పప్పు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి జీడి పప్పు పరిశ్రమకు విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏజెన్సీ, తెలంగాణ నుంచి కూడా జీడి గింజల దిగుమతి అవుతాయి. దిగుబడి పెరగడమే కారణం ఈ ఏడాది జీడి గింజల ఉత్పత్తి అధికంగా ఉండటమే ధర పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. జీడి తోటలు కాపు మీద ఉన్న సమయంలో అదనంగా వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి పూత పూసి, జీడి గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా గత ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కావాల్సిన జీడి గింజల ఉత్పత్తి జూన్‌లో కూడా కొనసాగుతోంది. దీంతో ధర పతనమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతుల వద్ద 80 కేజీల జీడి గింజల బస్తాను వ్యాపారులు రూ.9,500కు కొనుగోలు చేశారు. ఈ ధర మే నాటికి రూ.7,500కు తగ్గింది. పంట చివరి దశ కావడంతో ధర తగ్గడం సాధారణమే అనుకున్నారు. కానీ.. జీడిచెట్లకు మరోసారి పూత రావడంతో మళ్లీ గింజలు ఉత్పత్తి అయ్యాయి. ప్రస్తుతం 80 కేజీల జీడి గింజల బస్తా రూ.5 వేలకే లభిస్తోంది. ఇందులో నాణ్యత తక్కువగా ఉండే చివరి రకం జీడి గింజలు రూ.3,500కు కూడా లభిస్తున్నాయి పేరుకుపోయిన నిల్వలు ఈ కారణంగా జీడి పప్పు ధర కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏప్రిల్, మే నెలల్లో కేజీ జీడి పప్పు ధర రూ.650 ఉండగా.. ప్రస్తుతం రూ.550కి పడిపోయింది. సంప్రదాయ రీతిలో కాల్చి తయారు చేసిన జీడి పప్పు ధర ఇలా ఉండగా.. ఫ్యాక్టరీల్లో తయారవుతున్న బాయిల్డ్ జీడి పప్పు ధర మరింత దారుణంగా ఏకంగా రూ.450కి తగ్గిపోయింది. సీజన్ మొదలైనప్పుడు ఎక్కువ ధరకు గింజలు కొనుగోలు చేసిన వ్యాపారులు.. తక్కువ ధరకు జీడి పప్పు అమ్మాల్సి రావడంతో ఉత్పత్తి నిలిపివేశారు. ధర లేక, కొనుగోలు చేసి గింజల నుంచి పప్పు ఉత్పత్తి నిలిపివేయడంతో వ్యాపారుల వద్ద.. ఉత్పత్తి పెరిగి, అమ్మకాలు తగ్గడంతో రైతుల వద్ద భారీ స్థాయిలో గింజలు పేరుకుపోయాయి. దీనికితోడు ప్రస్తుతం ఆషాఢం, శూన్య మాసాలు కావడంతో శుభకార్యాలు లేక జీడి పప్పు వినియోగం కూడా తగ్గింది. అన్ సీజన్ మరో రెండు నెలలు కొనసాగనుంది. ఉత్పత్తి మానేశాం ధర పడిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. గత ఏప్రిల్‌లో 80 కేజీల జీడి గింజల బస్తా రూ.9,500కు కొన్నాం. అప్పట్లో చాలా సరకు నిల్వ చేశాం. ఇప్పుడు రూ.3,500కు కూడా లభిస్తోంది. దీంతో ఉత్పత్తి మానేశాం. – కొడవటి ప్రసాద్, వ్యాపారి, మోరిపోడు ధర నిలకడ లేదు వర్షాలు అధికంగా కురిసి మరోసారి పూత రావడంతో ఈ ఏడాది గింజల ఉత్పత్తి పెరిగింది. ఫలితంగా ధర పడిపోయింది. ఈ సమయంలో పప్పు ఉత్పత్తి చేసి విక్రయించలేం. పైగా రెండు నెలలు శుభకార్యాలుండవు. దీంతో అమ్మకాలు కూడా ఉండవు. – ముప్పర్తి నాని, జీడి గింజల దిగుమతిదారు, మోరిపోడు -
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
నారికేళం...గం‘ధర’ గోళం
జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొబ్బరి, దాని ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడంతో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో వారు తీవ్రంగా మథనపడుతున్నారు. సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): ఈ ఏడాది వర్షాభావంతో కొబ్బరికాయ పరిమాణం (సైజు) బాగా తగ్గిపోయింది. అదే సమయంలో కొబ్బరి ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా.. కాయలకు డిమాండ్ పడిపోయింది. దీంతో ధర కూడా భారీగా పతన మైంది. ఫలితంగా దింపు కూలీ ఖర్చులూ రావట్లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ధరలు బాగా ఉన్నప్పుడు పంట ఉత్పత్తి తగ్గుతుందని, ఉత్పత్తి ఉన్నప్పుడు ఎగుమతులు ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఇదే దుస్థితి జిల్లాలో 60వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా 3,750 ఎకరాల్లో కొబ్బరి మొక్క తోటలు పెంపకం జరుగుతోంది. ఏటా ఇదే దుస్థితి ఎదురవుతోందని, ఉత్పత్తి బాగున్నప్పుడు ధర ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ధరల పతనమైనప్పుడు రైతులను ఆదుకోవడానికి గతంలో గోదావరి జిల్లాలో నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉద్యాన వనశాఖ కొబ్బరి తోటల్లో అంతర్గత పంటలైన కోకో, అరటి, ఇతర పంటలను ప్రోత్సహించడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. దీనికోసం ఉద్యాన వనశాఖ అధికారులు జిల్లాలోని కొబ్బరి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొబ్బరి ధర పతనానికి కారణాలు ఈ ఏడాది శ్రీరామనవమితో పండుగల సమయం ముగియడంతో వివిధ రాష్ట్రాల్లోని వ్యాపారులు కొబ్బరి కాయల కొనుగోలును తగ్గించారు. ఫలితంగా ఆర్డర్లు పెద్దగా రాకపోవడంతో ఎగుమతులు తగ్గాయి. దీనివల్ల ధర పతనమైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల కొబ్బరి రైతులతోపాటు తామూ ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎగుమతులు ఎక్కడెక్కడికి.. జిల్లాలోని పాలకొల్లు ప్రధాన కేంద్రంగా గతంలో రోజుకి 100 నుంచి 200 లారీల కొబ్బరికాయలు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. 1996లో వచ్చిన తుపాను తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద తీరం దాటడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. అప్పట్లో తుపాను తీవ్రత కారణంగా కొబ్బరి పంటపై ఎర్రనల్లి తెగులు సోకి కొబ్బరికాయ సైజు తగ్గడంతో పాటు నాణ్యత లేదని కొన్ని రాష్ట్రాల్లో వ్యాపారులు ఆంధ్ర కొబ్బరికాయలు కొనుగోలు చేయడం మానేశారు. అప్పటి నుంచీ ధర తగ్గుదల సమస్య వేధిస్తోంది. దీనికితోడు తమిళనాడు, కేరళ కొబ్బరికాయలు నాణ్యంగా ఉండడంతో వ్యా పారులు వాటిని దిగుమతి చేసుకోవడం మన కొబ్బరి ధర పతనానికి కారణమవుతోంది. రోజుకు 50 నుంచి 80 లారీలు ప్రస్తుతం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 50 నుంచి 80లారీలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజ స్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి వచ్చే కొబ్బరికాయలను దిగుమతి చేసుకోవడంతో ఆంధ్రా ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. దింపు ఖర్చులూ రాని పరిస్థితి ప్రస్తుతం ఏడాది పొడవునా కొబ్బరికాయల దింపు తీసి అమ్మకాలు చేసినా.. ఖర్చులు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరితోటల్లో దింపు తీయాలంటే ఒక కాయకి రూపాయి, మోతకూలీ 50పైసలు ఖర్చు అవుతుందని, జామ కాయకంటే కొబ్బరికాయ ధర దారుణంగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. వ్యాపారుల బాధ ఇదీ.. రైతుల వద్ద కొబ్బరికాయలు కొనుగోలు చేసి ఒలుపు కూలీ, లారీ కిరాయి ఒక్కొక్క కొబ్బరికాయకి రూ.2.50 ఖర్చు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఒక కొబ్బరికాయ ధర రూ.10 నుంచి రూ.14వరకు పలికిందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, రూ.5 పలుకుతోందని, ఫలితంగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి గురుపౌర్ణమి, రాఖీ సందర్భంగా ఎగుమతులు జరగడంతో కొంతమేర ధర పెరిగినా నష్టం తప్పడం లేదని పేర్కొం టున్నారు. పెరిగిన ధర ఎంతవరకు నిలబడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దింపు కూలి రావడం లేదు కొబ్బరికాయల ధర చాలా దారుణంగా పడిపోయింది. దింపు, సాగుబడి ఖర్చులు రాక నష్టపోతున్నాం. ఎగుమతులు లేవు. అమ్మితే అడవి, కొంటే కొరివిలా కొబ్బరి రైతుల పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం కొబ్బరికాయ రూ.10 నుంచి రూ. 14వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.కాయ ఒక్కింటికి రూ.5 పలుకుతోంది. ఈ ధర ఎంతకాలం ఉంటుందో తెలియదు. – కర్రా సత్తిబాబు, కొబ్బరి రైతు, రాజోలు ఎగుమతులు లేకపోవడం వల్లే కొబ్బరికాయ ఎగుమతులు సక్రమంగా జరగడం లేదు. దీనివల్ల ధర పడిపోయింది. ఈ ఏడాది వర్షాలూ సక్రమంగా లేకపోవడం వల్ల కాయ సైజు చిన్నదైంది. కొబ్బరి తోటలు పెంచలేని పరిస్థితి ఏర్పడింది. దింపు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఎదురవుతోంది. – ఎర్రగొప్పుల హరేరామ్, కొబ్బరిరైతు, ఆచంట నాణ్యత లేక ఎగుమతులు తగ్గాయి పాలకొల్లు కేంద్రంగా గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. అయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు కొబ్బరికి నాణ్యత ఉండడంతో ఆంధ్రా కొబ్బరిని కొన్ని రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకోవడం లేదు. దీనివలన ఇక్కడ ఎగుమతులు జరగక ధర పతనమైంది. – ఎంవీవీ నరసింహమూర్తి, కొబ్బరి వ్యాపారి, పాలకొల్లు -
ట'మోత' తగ్గింది!
గత నెలలో అందరినీ ఆందోళనకు గురి చేసిన టమాటా ధర అమాంతం పడిపోయింది. గత మూడు రోజులుగా ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ధరలు ఎంతగా పతనమయ్యాయంటే నవంబర్‌లో కిలో రూ.వంద నుంచి రూ. 120 పలికిన టమాటా నేడు 15 రూపాయలకు పడిపోయింది. ఇది కూడా ఉదయం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి ఈ ధర కూడా ఉండడం లేదు. పచ్చి సరుకును నిల్వ చేయలేక.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం చందంగా.. వ్యాపారులు కిలో పది రూపాయలకు అమ్మేస్తున్నారు. వీరఘట్టం: టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం అధిక దిగుబడిగా అంతా భావిస్తున్నారు. టమాటా సాగుకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉంది. వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు టమాటాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవే ధర పతనానికి కారణమయ్యాయి. వ్యాపారులు కూడా రైతుల వద్ద కిలో రూ.7 నుంచి పది రూపాయల్లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎందుకిలా? వాస్తవానికి సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటే గతంలో టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 పలికేది. ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది డిమాండ్‌కు మించి పంట దిగుబడి రావడంతో ధర పతనమైంది. రోజుకు రూ.200 నష్టపోతున్నాం పెట్టుబడులు పోను రోజుకు రూ.300 వరకు లాభం వచ్చేది. ప్రస్తుతం బేరాలు లేక సరుకు పాడవుతోంది.దీంతో రోజుకు రూ.200 వరకు నష్టం వస్తోంది. టమాటా వ్యాపారం చేయాలంటే ఆందోళనగా ఉంది. – దేవుపల్లి గౌరీశ్వరరావు, వ్యాపారస్తుడు, వీరఘట్టం అమాతంగా ధర తగ్గిపోయింది టమాటాను నెల రోజుల క్రితం పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయించేవాళ్లమి ప్రస్తుతం వీరఘట్టంలో విస్తారంగా పంట పండుతుండడంతో మార్కెట్లోకి ఎక్కువగా టమాటా దిగుమతి అవుతోంది. అంతేకాకా ఇతర ప్రాంతాల నుంచి కూడా టమాటా వస్తుండడంతో అమాంతంగా ధర తగ్గిపోయింది. – మీసాల ప్రసాదు, తోపుడు బండి వ్యాపారి -
ధాన్యం..దైన్యం
నెహ్రూనగర్,(మాచర్ల) న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట దిగుబడి తగ్గటంతో వరి రైతులు డీలా పడ్డారు. వరసగా రెండేళ్లు సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది సాగర్ జలాలు విడుదల కావటంతో తమ తలరాత మారుతుందని ఎన్నో ఆశలతో రైతులు సాగు చేపట్టారు. కష్టనష్టాలకోర్చి వరి పండించారు. చివరకు దిగుబడి తగ్గటంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. మాచర్ల ప్రాంతంలో ప్రధానంగా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద వరి పంట సాగు చేస్తుంటారు. వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయి. మాగాణి పొలాల్లో వరి కోతలు కోసి, కుప్పనూర్చి, తూర్పూర పట్టి, వడ్ల గింజలను బస్తాల్లో నింపుతున్న సమయంలో అప్పటి వరకు రైతు ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశించగా, 25 నుంచి 30 బస్తాల దిగుబడి రావడం రైతులను నిరాశపర్చింది. దిగుబడి చూసుకుని, పెట్టుబడులు గుర్తుకు తెచ్చుకొని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ. 25 వేలు దాటిన పెట్టుబడి గతంతో పోల్చితే పంట సాగుకు పెట్టుబడులు పెరిగాయి. రైతులు ఎకరాకు రూ. 25 వేలు పైనే ఖర్చు చేశారు. దుక్కి దున్నటం, నారు పోయటం, కుప్ప నూర్చటం ప్రతి పనికి పెట్టుబడులు పెరిగాయి. ఇంతకు ముందు వరికోత కోసి, కుప్పనూర్చి, ధాన్యాన్ని ఇంటికి చేరిస్తే కూలీగా రెండున్నర బస్తాలు ఉండేది. ఇప్పుడు అది కాస్తా ఐదు బస్తాలకు చేరింది. గతంలో 20-20 యూరియా బస్తా రూ.750 ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి చేరింది. ఇలా పెట్టుబడులు పెరిగాయి. పైగా తెగుళ్ల బెడద దిగుబడులపై ప్రభావం చూపింది. అధిక వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల మంచు కురవటంతో వరికి తెగుళ్లు సోకాయి. మెడవిరుపు, అగ్గి తెగులు ఆశించాయి. దోమ పోటు పంటపై తన ప్రతాపాన్ని చూపింది. నివారణకు మందులు వాడినా రైతుకు పెట్టుబడి పెరిగింది తప్ప ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. తగ్గిన ధాన్యం ధర ధాన్యం బస్తా మొన్నటి వరకు రూ.1200 ఉండగా ఇప్పుడు రూ. వెయ్యికి పడిపోయింది. ఈ ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఒకవేళ వెయ్యి రూపాయలకు విక్రయిస్తే రైతుకు పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. సొంత భూములు సాగుచేసిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరా కౌలు పదిహేను బస్తాలు ఇవ్వడంతో 10 నుంచి 15 బస్తాలే మిగులుతాయి. వీరి నష్టాలు తీరాలంటే ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యం రేట్లు పెంచి కొనుగోలు చేయాలి. అంతేకాక ఈ ఏడాది తీసుకున్న రుణాలను మాఫీ చేస్తే కష్టాల నుంచి కౌలు రైతులు గట్టెక్కే అవకాశం ఉంది.