నెహ్రూనగర్,(మాచర్ల) న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట దిగుబడి తగ్గటంతో వరి రైతులు డీలా పడ్డారు. వరసగా రెండేళ్లు సాగు నీరు లేక పొలాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది సాగర్ జలాలు విడుదల కావటంతో తమ తలరాత మారుతుందని ఎన్నో ఆశలతో రైతులు సాగు చేపట్టారు. కష్టనష్టాలకోర్చి వరి పండించారు. చివరకు దిగుబడి తగ్గటంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. మాచర్ల ప్రాంతంలో ప్రధానంగా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద వరి పంట సాగు చేస్తుంటారు. వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయి.
మాగాణి పొలాల్లో వరి కోతలు కోసి, కుప్పనూర్చి, తూర్పూర పట్టి, వడ్ల గింజలను బస్తాల్లో నింపుతున్న సమయంలో అప్పటి వరకు రైతు ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. ఎకరాకు 40 బస్తాలు వస్తాయని ఆశించగా, 25 నుంచి 30 బస్తాల దిగుబడి రావడం రైతులను నిరాశపర్చింది. దిగుబడి చూసుకుని, పెట్టుబడులు గుర్తుకు తెచ్చుకొని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎకరాకు రూ. 25 వేలు దాటిన పెట్టుబడి
గతంతో పోల్చితే పంట సాగుకు పెట్టుబడులు పెరిగాయి. రైతులు ఎకరాకు రూ. 25 వేలు పైనే ఖర్చు చేశారు. దుక్కి దున్నటం, నారు పోయటం, కుప్ప నూర్చటం ప్రతి పనికి పెట్టుబడులు పెరిగాయి. ఇంతకు ముందు వరికోత కోసి, కుప్పనూర్చి, ధాన్యాన్ని ఇంటికి చేరిస్తే కూలీగా రెండున్నర బస్తాలు ఉండేది. ఇప్పుడు అది కాస్తా ఐదు బస్తాలకు చేరింది. గతంలో 20-20 యూరియా బస్తా రూ.750 ఉండగా ఇప్పుడు రూ.వెయ్యికి చేరింది. ఇలా పెట్టుబడులు పెరిగాయి. పైగా తెగుళ్ల బెడద దిగుబడులపై ప్రభావం చూపింది. అధిక వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల మంచు కురవటంతో వరికి తెగుళ్లు సోకాయి. మెడవిరుపు, అగ్గి తెగులు ఆశించాయి. దోమ పోటు పంటపై తన ప్రతాపాన్ని చూపింది. నివారణకు మందులు వాడినా రైతుకు పెట్టుబడి పెరిగింది తప్ప ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.
తగ్గిన ధాన్యం ధర
ధాన్యం బస్తా మొన్నటి వరకు రూ.1200 ఉండగా ఇప్పుడు రూ. వెయ్యికి పడిపోయింది. ఈ ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఒకవేళ వెయ్యి రూపాయలకు విక్రయిస్తే రైతుకు పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. సొంత భూములు సాగుచేసిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరా కౌలు పదిహేను బస్తాలు ఇవ్వడంతో 10 నుంచి 15 బస్తాలే మిగులుతాయి. వీరి నష్టాలు తీరాలంటే ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యం రేట్లు పెంచి కొనుగోలు చేయాలి. అంతేకాక ఈ ఏడాది తీసుకున్న రుణాలను మాఫీ చేస్తే కష్టాల నుంచి కౌలు రైతులు గట్టెక్కే అవకాశం ఉంది.
ధాన్యం..దైన్యం
Published Sat, Dec 14 2013 5:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement