నారికేళం...గం‘ధర’ గోళం | Palakollu Coconut Prices Are Dropped In West Godavari | Sakshi
Sakshi News home page

నారికేళం...గం‘ధర’ గోళం

Published Wed, Jul 17 2019 8:40 AM | Last Updated on Wed, Jul 17 2019 8:41 AM

Palakollu Coconut Prices Are Dropped In West Godavari - Sakshi

జిల్లాలో కొబ్బరి రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొబ్బరి, దాని ఉత్పత్తుల ధరలు భారీగా పతనం కావడంతో రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి నెలకొనడంతో వారు తీవ్రంగా మథనపడుతున్నారు.  

సాక్షి, పాలకొల్లు(పశ్చిమ గోదావరి): ఈ ఏడాది వర్షాభావంతో కొబ్బరికాయ పరిమాణం (సైజు) బాగా తగ్గిపోయింది. అదే సమయంలో కొబ్బరి ఉత్పత్తి   ఆశాజనకంగా ఉన్నా.. కాయలకు డిమాండ్‌ పడిపోయింది. దీంతో ధర కూడా భారీగా పతన మైంది. ఫలితంగా దింపు కూలీ ఖర్చులూ రావట్లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ధరలు బాగా ఉన్నప్పుడు పంట ఉత్పత్తి తగ్గుతుందని, ఉత్పత్తి ఉన్నప్పుడు ఎగుమతులు ఉండడం లేదని  వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏటా ఇదే దుస్థితి 
జిల్లాలో 60వేల ఎకరాల్లో  కొబ్బరి సాగు జరుగుతుండగా 3,750 ఎకరాల్లో కొబ్బరి మొక్క తోటలు పెంపకం జరుగుతోంది. ఏటా ఇదే దుస్థితి ఎదురవుతోందని, ఉత్పత్తి బాగున్నప్పుడు ధర ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు 
ధరల పతనమైనప్పుడు రైతులను ఆదుకోవడానికి గతంలో గోదావరి జిల్లాలో నాఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఉద్యాన వనశాఖ కొబ్బరి తోటల్లో అంతర్గత పంటలైన కోకో, అరటి, ఇతర పంటలను ప్రోత్సహించడం వలన ఆదాయ మార్గాలు బాగుంటాయి. దీనికోసం ఉద్యాన వనశాఖ అధికారులు జిల్లాలోని కొబ్బరి రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొబ్బరి ధర పతనానికి కారణాలు 
ఈ ఏడాది శ్రీరామనవమితో పండుగల సమయం ముగియడంతో  వివిధ రాష్ట్రాల్లోని వ్యాపారులు కొబ్బరి కాయల కొనుగోలును తగ్గించారు. ఫలితంగా ఆర్డర్లు పెద్దగా రాకపోవడంతో ఎగుమతులు తగ్గాయి. దీనివల్ల ధర పతనమైందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల కొబ్బరి రైతులతోపాటు తామూ ఆర్థిక ఇబ్బందులు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  

ఎగుమతులు ఎక్కడెక్కడికి..
జిల్లాలోని పాలకొల్లు ప్రధాన కేంద్రంగా గతంలో రోజుకి 100 నుంచి 200 లారీల కొబ్బరికాయలు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. 1996లో వచ్చిన తుపాను తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద తీరం దాటడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. అప్పట్లో తుపాను తీవ్రత కారణంగా కొబ్బరి పంటపై ఎర్రనల్లి తెగులు సోకి కొబ్బరికాయ సైజు తగ్గడంతో పాటు నాణ్యత లేదని కొన్ని రాష్ట్రాల్లో వ్యాపారులు ఆంధ్ర కొబ్బరికాయలు కొనుగోలు చేయడం మానేశారు. అప్పటి నుంచీ ధర తగ్గుదల సమస్య వేధిస్తోంది. దీనికితోడు తమిళనాడు, కేరళ కొబ్బరికాయలు నాణ్యంగా ఉండడంతో వ్యా పారులు వాటిని దిగుమతి చేసుకోవడం మన కొబ్బరి ధర పతనానికి కారణమవుతోంది.  

రోజుకు 50 నుంచి 80 లారీలు
ప్రస్తుతం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 50 నుంచి 80లారీలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజ స్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ వ్యాపారులు తమిళనాడు, కేరళ నుంచి వచ్చే కొబ్బరికాయలను దిగుమతి చేసుకోవడంతో ఆంధ్రా ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. 

దింపు ఖర్చులూ రాని పరిస్థితి 
ప్రస్తుతం ఏడాది పొడవునా కొబ్బరికాయల దింపు తీసి అమ్మకాలు చేసినా.. ఖర్చులు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరితోటల్లో దింపు తీయాలంటే ఒక కాయకి రూపాయి, మోతకూలీ 50పైసలు ఖర్చు అవుతుందని, జామ కాయకంటే కొబ్బరికాయ ధర దారుణంగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. 

వ్యాపారుల బాధ ఇదీ.. 
రైతుల వద్ద  కొబ్బరికాయలు కొనుగోలు చేసి ఒలుపు కూలీ, లారీ కిరాయి ఒక్కొక్క కొబ్బరికాయకి రూ.2.50 ఖర్చు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఒక కొబ్బరికాయ ధర రూ.10 నుంచి రూ.14వరకు పలికిందని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, రూ.5 పలుకుతోందని, ఫలితంగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌ రాష్ట్రానికి గురుపౌర్ణమి, రాఖీ సందర్భంగా ఎగుమతులు జరగడంతో కొంతమేర ధర పెరిగినా నష్టం తప్పడం లేదని పేర్కొం టున్నారు. పెరిగిన ధర ఎంతవరకు నిలబడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 

దింపు కూలి రావడం లేదు 
కొబ్బరికాయల ధర చాలా దారుణంగా పడిపోయింది. దింపు, సాగుబడి ఖర్చులు రాక నష్టపోతున్నాం. ఎగుమతులు లేవు. అమ్మితే అడవి, కొంటే కొరివిలా కొబ్బరి రైతుల పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం కొబ్బరికాయ రూ.10 నుంచి రూ. 14వరకు ధర పలికింది. ప్రస్తుతం రూ.కాయ ఒక్కింటికి రూ.5 పలుకుతోంది. ఈ ధర ఎంతకాలం ఉంటుందో తెలియదు. 
– కర్రా సత్తిబాబు, కొబ్బరి రైతు, రాజోలు

ఎగుమతులు లేకపోవడం వల్లే
కొబ్బరికాయ ఎగుమతులు సక్రమంగా జరగడం లేదు. దీనివల్ల ధర పడిపోయింది. ఈ ఏడాది వర్షాలూ సక్రమంగా లేకపోవడం వల్ల కాయ సైజు చిన్నదైంది. కొబ్బరి తోటలు పెంచలేని పరిస్థితి ఏర్పడింది.  దింపు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఎదురవుతోంది. 
– ఎర్రగొప్పుల హరేరామ్, కొబ్బరిరైతు, ఆచంట

నాణ్యత లేక ఎగుమతులు తగ్గాయి
పాలకొల్లు కేంద్రంగా గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా జరిగేవి. అయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు కొబ్బరికి నాణ్యత ఉండడంతో ఆంధ్రా కొబ్బరిని కొన్ని రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకోవడం లేదు. దీనివలన ఇక్కడ ఎగుమతులు జరగక ధర పతనమైంది. 
– ఎంవీవీ నరసింహమూర్తి, కొబ్బరి వ్యాపారి, పాలకొల్లు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement