decresed
-
Telangana: కరోనా.. కౌంట్‘డౌన్’
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో దాదాపు వారం రోజులుగా ఇదే తరహాలో కేసులు నమోదవుతుండటం శుభపరిణామం. ఇక మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు పాతి కేసి లోపే వస్తున్నాయి. ప్రస్తుతం 8 జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుండటాన్ని చూస్తుంటే వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతున్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల జనసంచారం తగ్గడంతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం నిత్యం వందేసి చొప్పున కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా.. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 25.2 శాతం పాజిటివిటీ రేటు నమోదుకాగా ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5–10 శాతం వరకు నమోదైంది. కరీంనగర్ జిల్లాలో మధ్యస్థంగా పాజటివిటీ రేటు 4–5 శాతం నమోదవుతూ క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వచ్చే వారం రోజులు లాక్డౌన్ మరింత పక్కాగా అమలు చేయడం, మరో దఫా ఫీవర్ సర్వేతోపాటు టెస్ట్‌లు భారీగా పెంచి పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా నియంత్రణ చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. తక్కువ కేసులున్న జిల్లాల్లో అన్‌లాక్? రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా వివిధ జిల్లాలవారీగా లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివిటీ శాతం అత్యల్పంగా నమోదయ్యే జిల్లాల్లో ఈ మినహాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో లాక్డౌన్ మినహాయింపు సమయం పెంపు వంటి వెసులుబాట్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మైక్రో కంటైన్మెంట్ జోన్లు 205... రాష్ట్రంలో మైక్రో కంటైన్మెంట్ జోన్లు ప్రస్తుతం 205 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్‌లో 59, నల్లగొండలో 44, సిద్దిపేటలో 11, వరంగల్ రూరల్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 10 ఉన్నాయి. మిగతా 14 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌లోనే మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఉండగా 14 జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్ జోన్లను పూర్తిగా ఎత్తేశారు. లక్ష దాటిన పరీక్షలు... రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఇదివరకు రోజుకు 60 వేల వరకు టెస్టులు నిర్వహించగా... ప్రస్తుతం ఆ సంఖ్య 1.38 లక్షలకు పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత వారం రోజులుగా నిత్యం లక్షకుపైగా పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుతున్న సమయంలో పరీక్షలు ఎక్కువ చేస్తే క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనా వస్తుందని భావించిన యంత్రాంగం... ఈ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటిన్నర శాతం కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులు 2,070... రాష్ట్రంలో తాజాగా 2,070 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1.49 శాతం పాజిటివిటీ నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,89,734 మంది కరోనా బారినపడగా వారిలో 5,57,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 29,208 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రభావంతో తాజాగా 18 మంది మరణించగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 3,364కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 శాతం ఉండగా రికవరీ రేటు 94.47 శాతం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. వారం రోజుల్లో నియంత్రణలోకి.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు వేగంగా తగ్గుతోంది. కేసుల తీవ్రత ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్ర సరిహద్దులతోపాటు కొన్ని జిల్లాల్లో ఈ వారం రోజులపాటు సూక్ష్మస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తాం. వచ్చే వారం రోజుల్లో అన్ని జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. – శ్రీనివాసరావు, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ -
కరోనా దెబ్బ: తిరోగమనమే!
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కకావికలం అయిందని అర్ధ వార్షిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల ఆదాయ వివరాలను పరిశీలిస్తే అప్పులు మినహా అన్నిం టిలో తిరోగమనమే కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అన్ని రకాల ఆదాయాలు తగ్గిపోయాయని కాగ్ లెక్కలు చెబు తున్నాయి. గతేడాదితో పోలిస్తే జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను... ఇలా అన్ని ఆదాయాలు తగ్గాయి. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర సాయం కూడా ఆశించినంత లేకపోవడంతో తొలి ఆరు నెలల ఆదాయం రూ. 63,970 కోట్లకే పరిమితమైంది. కాగ్ తేల్చిన ముఖ్యాంశాలివి.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,76,393 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించగా ఆరు నెలల్లో వచ్చిన మొత్తం ఆదాయం రూ. 63,970 కోట్లు. అంటే బడ్జెట్ అంచనాలో వచ్చింది కేవలం 36 శాతమే. అదే గతేడాది ఆరు నెలల్లో 43 శాతం రాబడులు సమకూరాయి. ఈ ఏడాది మొత్తం రూ. 33,191 కోట్లు అప్పులు సమకూర్చుకోవాల్సి ఉండగా తొలి ఆరు నెలల్లో 78 శాతం అంటే రూ. 25,989 కోట్లు వచ్చేశాయి. అదే గతేడాది ఆరు నెలల్లో 61 శాతమే అప్పులు అవసరమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 32,671 కోట్లు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వస్తుందని అంచనా వేయగా ఆరు నెలల్లో 32 శాతం అంటే రూ. 10,437 కోట్లు వచ్చింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ. 10,000 కోట్లు వస్తాయని వార్షిక బడ్జెట్ అంచనాలో చూపగా ఆరు నెలల్లో వచ్చింది రూ. 1,657 కోట్లే. అమ్మకపు పన్ను కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ. 26,400 కోట్ల రాబడి అంచనా కాగా తొలి సగం ఏడాదిలో రూ. 8,148 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనాలో రాబడి 31 శాతం. అమ్మకపు పన్ను ఆదాయం గతేడాది తొలి అర్ధ వార్షికంలో 42 శాతం సమకూరింది. ఎక్సైజ్ ఆదాయం మాత్రమే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. ఈ సంవత్సరం రూ. 16,000 కోట్ల అంచనాలో రూ. 6,285.85 కోట్లు (39 శాతం) వచ్చింది. గతేడాది వచ్చింది 42 శాతం. కేంద్ర పన్నుల్లో వాటా కూడా ఈ ఏడాది అంతంత మాత్రంగానే వచ్చింది. ఈ వాటా కింద 2020–21 సంవత్సరంలో రూ. 10,906 కోట్లు రావాల్సి ఉండగా ఆరు నెలల్లో రూ. 3,753 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో కూడా గతేడాదితో పోలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ అంచనాకుగాను తొలి ఆరు నెలల్లో 55 శాతం రాగా, ఈసారి వచ్చింది 44 శాతమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 10,525 కోట్ల అంచనాకుగాను రూ. 4,649 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది పన్నేతర ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈసారి రూ. 30,600 కోట్లను పన్నేతర ఆదాయం కింద అంచనా వేయగా అందులో 5 శాతం అంటే కేవలం రూ. 1,542 కోట్లే సగం సంవత్సరం పూర్తయ్యే సరికి వచ్చాయి. పన్ను ఆదాయం విషయానికి వస్తే గతేడాది సెప్టెంబర్‌లో రూ. 8,775 కోట్లను పన్ను ఆదాయం కింద రాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చింది రూ. 6,599 కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాది తొలి అర్ధ వార్షికంలో రెండు నెలలు పన్ను ఆదాయం రూ. 8,500 కోట్లు దాటితే ఈ ఏడాది రూ. 6,500 కోట్లు దాటలేదు. -
సగం కిరోసిన్‌కు ‘పొగ’
– అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కుదింపు -4 లీటర్లకు బదులు 2 లీటర్లే – ఈనెల కోటా నుంచే అమలు కాకినాడ సిటీ : పేదల సంక్షేమమే తమ లక్ష్యమని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వమే ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో భారం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి చౌకధరలలో పంపిణీ చేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన పామాయిల్, గోధుమపిండి, కందిపప్పులకు ఒక్కొక్కటిగా మంగళం పాడింది. తాజాగా ఈనెల కోటా నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించింది. ఇప్పటివరకు నాలుగు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించింది. ‘పొగరహితం’ పేరుతో త్వరలో మొత్తానికి మంగళం! జిల్లా వ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిదిలో 16,08,711 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన, తెలుపు కార్డుదారులున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బన్ ప్రాంతాల్లో 4 లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అన్ని ప్రాంతాల్లో ఒక లీటరు ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో గ్యాస్ లేనివారికి 2 లీటర్లు, గ్యాస్ ఉన్న వారికి ఒక లీటరు పంపిణీ చేస్తారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులు సుమారు 65 వేల మందికి 4 లీటర్లకు బదులు రెండు లీటర్లే అందనుంది. ఇదిలా ఉండగా కిరోసిన్ అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెబుతూ రాష్ట్రాన్ని పొగరహితంగా ప్రకటించే సాకుతో భాగం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా సబ్సిడీపై ఇచ్చే ఒకటి, రెండు లీటర్ల కిరోసిన్‌ను కూడా రానున్న రెండు, మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉందన్న అనుమానం బలపడుతోంది. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు త్వరితంగా మంజూరు చేఏందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశం వెనుక లక్ష్యం అదేనంటున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో వంట గ్యాస్ ఉన్న వారు 13,10,669 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ 2 లీటర్లే జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులకు 4 లీటర్ల కిరోసిన్ పంపిణీ జరిగేది. ఈనెల నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకూ 2 లీటర్లే ఇవ్వనున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. -వి.రవికిరణ్, జిల్లా పౌరసఫరాల అధికారి కిరోసిన్‌లో కోత దారుణం అర్బన్ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించడం దారుణం. వంట గ్యాస్ ఉన్నా కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసిన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేనప్పుడు కిరోసిన్ దీపాలపై ఆధారపడే పేదలు ఉన్నారు. - పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు