సగం కిరోసిన్‌కు ‘పొగ’
సగం కిరోసిన్‌కు ‘పొగ’
Published Tue, Mar 7 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
– అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కుదింపు
-4 లీటర్లకు బదులు 2 లీటర్లే
– ఈనెల కోటా నుంచే అమలు
కాకినాడ సిటీ : పేదల సంక్షేమమే తమ లక్ష్యమని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వమే ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో భారం తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వాలు కార్డుదారులకు బియ్యంతో పాటు కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి చౌకధరలలో పంపిణీ చేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక బియ్యం, పంచదార, కిరోసిన్ మినహా మిగిలిన పామాయిల్, గోధుమపిండి, కందిపప్పులకు ఒక్కొక్కటిగా మంగళం పాడింది. తాజాగా ఈనెల కోటా నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించింది. ఇప్పటివరకు నాలుగు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను 2 లీటర్లకు కుదించింది.
‘పొగరహితం’ పేరుతో త్వరలో మొత్తానికి మంగళం!
జిల్లా వ్యాప్తంగా 2,647 చౌకదుకాణాల పరిదిలో 16,08,711 మంది అన్నపూర్ణ, అంత్యోదయ అన్నయోజన, తెలుపు కార్డుదారులున్నారు. గ్యాస్ లేని కార్డుదారులకు అర్బన్ ప్రాంతాల్లో 4 లీటర్లు, రూరల్ ప్రాంతాల్లో 2 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తుండగా గ్యాస్ ఉన్న కార్డుదారులకు అన్ని ప్రాంతాల్లో ఒక లీటరు ఇస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ప్రతి నెలా జిల్లావ్యాప్తంగా కార్డుదారుల్లో గ్యాస్ లేనివారికి 2 లీటర్లు, గ్యాస్ ఉన్న వారికి ఒక లీటరు పంపిణీ చేస్తారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులు సుమారు 65 వేల మందికి 4 లీటర్లకు బదులు రెండు లీటర్లే అందనుంది. ఇదిలా ఉండగా కిరోసిన్ అనేది ఒక్క వంటకే కాకుండా ప్రధానంగా విద్యుత్ లేని సమయంలో దీపం వెలిగించుకోవడానికి ఉపయోగపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం అందరికీ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెబుతూ రాష్ట్రాన్ని పొగరహితంగా ప్రకటించే సాకుతో భాగం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగా సబ్సిడీపై ఇచ్చే ఒకటి, రెండు లీటర్ల కిరోసిన్‌ను కూడా రానున్న రెండు, మూడు నెలల్లో పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ఉందన్న అనుమానం బలపడుతోంది. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు త్వరితంగా మంజూరు చేఏందుకు చర్యలు తీసుకోవాలన్న ఆదేశం వెనుక లక్ష్యం అదేనంటున్నారు. జిల్లాలో మొత్తం కార్డుదారుల్లో వంట గ్యాస్ ఉన్న వారు 13,10,669 మంది ఉన్నారు.
అర్బన్ ప్రాంతాల్లోనూ 2 లీటర్లే
జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో గ్యాస్ లేని కార్డుదారులకు 4 లీటర్ల కిరోసిన్ పంపిణీ జరిగేది. ఈనెల నుంచి గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలకూ 2 లీటర్లే ఇవ్వనున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం.
-వి.రవికిరణ్, జిల్లా పౌరసఫరాల అధికారి
కిరోసిన్‌లో కోత దారుణం
అర్బన్ ప్రాంతాల్లో కార్డుదారులకు ఇచ్చే కిరోసిన్‌లో కోత విధించడం దారుణం. వంట గ్యాస్ ఉన్నా కార్డుదారులు అనేక సందర్భాల్లో కిరోసిన్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. విద్యుత్ లేనప్పుడు కిరోసిన్ దీపాలపై ఆధారపడే పేదలు ఉన్నారు.
- పలివెల వీరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
Advertisement