Telangana: కరోనా.. కౌంట్‌‘డౌన్‌’ | Coronavirus Cases Drastically Decreased In Telangana Report Says | Sakshi
Sakshi News home page

Telangana: కరోనా.. కౌంట్‌‘డౌన్‌’

Published Sun, Jun 6 2021 2:22 AM | Last Updated on Sun, Jun 6 2021 2:24 AM

Coronavirus Cases Drastically Decreased In Telangana Report Says - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో దాదాపు వారం రోజులుగా ఇదే తరహాలో కేసులు నమోదవుతుండటం శుభపరిణామం. ఇక మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు పాతి కేసి లోపే వస్తున్నాయి. ప్రస్తుతం 8 జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుండటాన్ని చూస్తుంటే వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గుతున్నట్లు వైద్య శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల జనసంచారం తగ్గడంతో కరోనా వ్యాప్తి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం నిత్యం వందేసి చొప్పున కేసులు నమోదవుతున్నాయి. 

పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా.. 
రాష్ట్రంలో శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 25.2 శాతం పాజిటివిటీ రేటు నమోదుకాగా ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5–10 శాతం వరకు నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో మధ్యస్థంగా పాజటివిటీ రేటు 4–5 శాతం నమోదవుతూ క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌ మరింత పక్కాగా అమలు చేయడం, మరో దఫా ఫీవర్‌ సర్వేతోపాటు టెస్ట్‌లు భారీగా పెంచి పాజిటివిటీ రేటును మరింత తగ్గించేలా నియంత్రణ చర్యలను ప్రభుత్వం చేపట్టనుంది. 

తక్కువ కేసులున్న జిల్లాల్లో అన్‌లాక్‌? 
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే వారం రోజుల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్‌ కేసుల ఆధారంగా వివిధ జిల్లాలవారీగా లాక్‌డౌన్‌ మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాజిటివిటీ శాతం అత్యల్పంగా నమోదయ్యే జిల్లాల్లో ఈ మినహాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయం పెంపు వంటి వెసులుబాట్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. 

మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు 205... 
రాష్ట్రంలో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ప్రస్తుతం 205 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్‌లో 59, నల్లగొండలో 44, సిద్దిపేటలో 11, వరంగల్‌ రూరల్‌లో 12, యాదాద్రి భువనగిరిలో 10 ఉన్నాయి. మిగతా 14 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌లోనే మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా 14 జిల్లాల్లో మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా ఎత్తేశారు. 

లక్ష దాటిన పరీక్షలు... 
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఇదివరకు రోజుకు 60 వేల వరకు టెస్టులు నిర్వహించగా... ప్రస్తుతం ఆ సంఖ్య 1.38 లక్షలకు పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత వారం రోజులుగా నిత్యం లక్షకుపైగా పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా తీవ్రత తగ్గుతున్న సమయంలో పరీక్షలు ఎక్కువ చేస్తే క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనా వస్తుందని భావించిన యంత్రాంగం... ఈ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటిన్నర శాతం కంటే తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 

కొత్త కేసులు 2,070... 
రాష్ట్రంలో తాజాగా 2,070 కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1.49 శాతం పాజిటివిటీ నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,89,734 మంది కరోనా బారినపడగా వారిలో 5,57,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 29,208 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రభావంతో తాజాగా 18 మంది మరణించగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 3,364కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.57 శాతం ఉండగా రికవరీ రేటు 94.47 శాతం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.  

వారం రోజుల్లో నియంత్రణలోకి.. 
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు వేగంగా తగ్గుతోంది. కేసుల తీవ్రత ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్ర సరిహద్దులతోపాటు కొన్ని జిల్లాల్లో ఈ వారం రోజులపాటు సూక్ష్మస్థాయి వ్యూహాన్ని అమలు చేస్తాం. వచ్చే వారం రోజుల్లో అన్ని జిల్లాల్లో పరిస్థితి పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తుంది. – శ్రీనివాసరావు, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement