Deendayal scheme
-
డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్బీఐ శుభవార్త!
మహిళా సంఘాలకు ఆర్బీఐ శుభవార్త అందించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు తనఖా లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫై చేసింది. మహిళల సహాయంతో బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడం, జీవనోపాధిని కల్పించడానికి భారత ప్రభుత్వం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పథకాన్ని తీసుకొచ్చింది. "రూ.10 లక్షల కంటే ఎక్కువ రూ.20 లక్షల వరకు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాల కోసం తనఖా కింద ఎలాంటి ఆస్తులు ఉంచుకోకూడదని, వారి పొదుపు ఖాతాలపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని, రుణాలు మంజూరు చేసే సమయంలో మార్జిన్ కూడా తీసుకోకూడదు" అని తెలిపింది. అదేవిధంగా, ఎస్ హెచ్ జిల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు విరుద్ధంగా ఎలాంటి తాత్కాలిక హక్కును మార్క్ చేయరాదు, రుణాలను మంజూరు చేసేటప్పుడు ఎలాంటి డిపాజిట్లను పట్టుబట్టరాదు అని తెలిపింది. మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎంయు) పథకం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ లో ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన తరువాత ఆర్బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది. -
వాడీవేడిగా ‘దిశ ’
నల్లగొండ :జిల్లా అభివృద్ధి–సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం (డీడీయూజీజైవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం (ఐపీడీఎస్) పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని డ్వామా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి గుత్తా అధ్యక్షత వహించారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న డీడీయూజీజైవై, ఐపీడీఎస్, మిషన్ భగీరథ ఇంట్రా, ఉపాధి హామీ పథకం పనులపై చర్చించారు. విద్యుత్ పథకాల పనులపైన సమీక్షించిన చైర్మన్ ఆ శాఖ అధికారులను నిలదీశారు. పథకాలు మంజూరై మూడేళ్లయినా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ‘మీ శాఖ చేస్తున్న పనేంటి?.. వెరీ బ్యాడ్’ అంటూ అధికారులను మందలించారు. కొత్త సబ్స్టేషన్లు నిర్మించి, 11 కేవీ, 33 కేవీ లైన్లు పూర్తయి, డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేశాక కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నది పథకం ప్రధాన ఉద్దేశం.. కాగా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదని ఎంపీ మండిపడ్డారు. దీన్‌దయాళ్ కింద ఏడు సబ్స్టేషన్లకుగాను రెండు సబ్స్టేషన్లు మాత్రమే పూర్తికాగా 33 కేవీ లైన్లు 31 కి. మీ, 11 కేవీ లైన్లు 11 కి.మీలు, ఎల్టీ లైన్లు 26 కి.మీ, 1240 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఐపీడీఎస్ కింద మిర్యాలగూడకు మంజూరైన సబ్‌స్టేషన్ పనులు పూర్తికాలేదని, దేవరకొండలో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు జరగడం లేదని, నల్లగొండ మండలంలో స్తంభాలు పాతి వదిలేశారని అన్నారు. రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రచారం చేయడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని చైర్మన్ విచారం వ్యక్తం చేశారు. నీళ్లు నమిలిన అధికారులు.. 2014–15లో డీపీఆర్‌లు పంపిస్తే 2015–16లో పనుల ఆమోదం జరిగింది. ఇప్పటికీ మూడేళ్లయినా పనులు ఎందుకు సాగడం లేదని చైర్మన్ నిలదీశారు. దీనిపై స్పందించిన అధికారులు జీఎస్టీ కారణంగా పనులు ఆలస్యమయ్యాయని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని మిర్యాలగూడెం, దేవరకొండ ఎమ్మెల్యేలు ఆరోపించినా అధికారులు నోరుమెదపలేదు. జూన్ నెలాఖరు నాటికి మొత్తం పనులు పూర్తిచేస్తామనే సమధానం తప్ప అధికారుల వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జోక్యం చేసుకుని అధికారుల తరపున వివరణ ఇవాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని రెండు రోజుల్లోగా తన వద్దకు రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తప్పుదోవ పట్టిస్తున్నారు.. మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనుల్లో కలెక్టర్‌ను, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారని చైర్మన్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో 10 శాతం ట్యాంకుల నిర్మాణం కూడా జరగలేదని, కానీ కాగితాల్లో మాత్రం 80 శాతం వృద్ధి సాధించినట్లు చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. దేవరకొండ, మిర్యాలగూడెంలో ట్యాంకుల నిర్మాణం నత్తనకడన సాగుతుంటే ఎజెండాలో మాత్రం వందల సంఖ్యలో ట్యాంకులు కట్టినట్లు చూపెడుతున్నారని, పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని అధికారులను నిలదీశారు. డిండి మండలంలో రూ.10 లక్షలతో పైపులైన్లు వేయడం ఎలా సాధ్యమవుతుందని, రివైజ్డ్ ఎస్టిమేట్లు వేయాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు బాధ్యతరాహిత్యంగా వ్యవహారించడం వల్లే∙పీఏపల్లి మండలం పడమటి తండాలో ట్రాక్టర్ ప్రమాదం జరిగిందని, ఆ సంఘటనకు అధికారులే బాధ్యత వహించాలని చైర్మన్ అన్నారు. పీఏపల్లి మండలం తూర్పుపల్లి గ్రామంలో పీహెచ్సీ భవనం నిర్మాణం జరిగినా వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారిందని, వైద్య సిబ్బందిని త్వరగా నియమించాలని ఆరోగ్యశాఖ అధికారులను చైర్మన్ ఆదేశించారు. సమావేశానికి డీఆర్డీఓ రింగు అంజ య్య, సభ్యులు పాశం రాంరెడ్డి, స్వామి గౌడ్, రజితారెడ్డి, జేడీఏ నర్సింహారావు, డీటీడబ్ల్యూఓ నరోత్తమ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఐసీడీఎస్ పీడీ పుష్పలత, డీఎంహెచ్ఓ భానుప్రకాష్ తదితరులు హాజరయ్యారు. -
వెలుగులు నిండేనా!
జిల్లాలో దీనదయాళ్ పథకం అమలు రూ.125కే కొత్త విద్యుత్ కనెక్షన్ ప్రచార లోపంతో ప్రజల దరి చేరని పథకం రూ.13.3 కోట్లతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూరు శాతం విద్యుత్ ఉండాలి... విద్యుత్ దీపం లేని ఇల్లు అనేది రానున్న రోజుల్లో ఉండకూడదు...ఇదీ దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం లక్ష్యం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వచ్చే రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా పరిస్థితిలో పూర్తి మార్పు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ కనెక్షన్, ఉచితంగా ఎల్ఈడీ బల్బులు అందిస్తోంది. నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఈ పథకం మూడు నెలలుగా అమలులో ఉంది. విసృ్తత ప్రచారం లేకపోవటం వల్ల జిల్లాలో ఎవరికీ తెలియకపోవటం గమనార్హం. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. విజయవాడ: జిల్లాలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం ఉంది. విద్యుత్ కనెక్షన్లు లేని ఇళ్లు సుమారు 50 వేల వరకు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వచ్చే రెండేళ్లలో 50 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు, వివిధ అవసరాలను వివరిస్తూ జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం కింద జిల్లాకు రూ.13.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు పిలచి మొదలుపెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, అవసరమైన చోట మరమ్మతులు నిర్వహించటం వంటి పనులు నిర్వహిస్తున్నారు. వార్షిక సంవత్సరం ముగింపులోగా నిధులు వినియోగం జరగాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. 20 వేల కొత్త కనెక్షన్లు... మరో వైపు ఈ పథకం ద్వారా జిల్లాలో 20 వేల కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లను గుర్తించి వాటికి అందిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డివిజనల్ పరిధిలో డివిజనల్ ఇంజనీర్లు వాటిని గుర్తించి కొత్త కనెక్షన్‌కు దరఖాస్తు మంజూరు చేసి వారం వ్యవధిలో కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 8వేల కనెక్షన్లు మంజూరు చేశారు. మిగిలిన 12 వేల కనెక్షన్లు ఏప్రిల్ నాటికి ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ మీటరు, బోర్డు, కొత్త లైన్‌కు అవసరమయ్యే విద్యుత్ వైర్లు, 9 వాట్ల ఎల్ఈడీ బల్బును పథకం ద్వారా అందజేస్తున్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్‌కుమార్ సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో పథకం అమలతీరును తరచూ సమీక్షిస్తునామని చెప్పారు. ఇప్పటికి కొత్తగా 8వేల కనెక్షన్లు ఇచ్చామని మిగిలిన 12 వేల కనెక్షన్లు రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రూ.13.3 కోట్ల నిధులతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఇప్పటికే పనులు 60 శాతం పూర్తయినట్లు వివరించారు.