సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు సభ్యులు, మాట్లాడుతున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ :జిల్లా అభివృద్ధి–సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం వాడీవేడిగా సాగింది. జిల్లా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం (డీడీయూజీజైవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం (ఐపీడీఎస్) పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని దిశ కమిటీ చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని డ్వామా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి గుత్తా అధ్యక్షత వహించారు. రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్రం అమలు చేస్తున్న డీడీయూజీజైవై, ఐపీడీఎస్, మిషన్ భగీరథ ఇంట్రా, ఉపాధి హామీ పథకం పనులపై చర్చించారు. విద్యుత్ పథకాల పనులపైన సమీక్షించిన చైర్మన్ ఆ శాఖ అధికారులను నిలదీశారు. పథకాలు మంజూరై మూడేళ్లయినా ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ‘మీ శాఖ చేస్తున్న పనేంటి?.. వెరీ బ్యాడ్’ అంటూ అధికారులను మందలించారు.
కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించి, 11 కేవీ, 33 కేవీ లైన్లు పూర్తయి, డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేశాక కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నది పథకం ప్రధాన ఉద్దేశం.. కాగా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదని ఎంపీ మండిపడ్డారు. దీన్‌దయాళ్ కింద ఏడు సబ్‌స్టేషన్‌లకుగాను రెండు సబ్‌స్టేషన్‌లు మాత్రమే పూర్తికాగా 33 కేవీ లైన్లు 31 కి. మీ, 11 కేవీ లైన్లు 11 కి.మీలు, ఎల్‌టీ లైన్‌లు 26 కి.మీ, 1240 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఐపీడీఎస్ కింద మిర్యాలగూడకు మంజూరైన సబ్‌స్టేషన్ పనులు పూర్తికాలేదని, దేవరకొండలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు జరగడం లేదని, నల్లగొండ మండలంలో స్తంభాలు పాతి వదిలేశారని అన్నారు. రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రచారం చేయడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని చైర్మన్ విచారం వ్యక్తం చేశారు.
నీళ్లు నమిలిన అధికారులు..
2014–15లో డీపీఆర్‌లు పంపిస్తే 2015–16లో పనుల ఆమోదం జరిగింది. ఇప్పటికీ మూడేళ్లయినా పనులు ఎందుకు సాగడం లేదని చైర్మన్ నిలదీశారు. దీనిపై స్పందించిన అధికారులు జీఎస్టీ కారణంగా పనులు ఆలస్యమయ్యాయని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని మిర్యాలగూడెం, దేవరకొండ ఎమ్మెల్యేలు ఆరోపించినా అధికారులు నోరుమెదపలేదు. జూన్ నెలాఖరు నాటికి మొత్తం పనులు పూర్తిచేస్తామనే సమధానం తప్ప అధికారుల వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జోక్యం చేసుకుని అధికారుల తరపున వివరణ ఇవాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని రెండు రోజుల్లోగా తన వద్దకు రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తప్పుదోవ పట్టిస్తున్నారు..
మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ పనుల్లో కలెక్టర్‌ను, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారని చైర్మన్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో 10 శాతం ట్యాంకుల నిర్మాణం కూడా జరగలేదని, కానీ కాగితాల్లో మాత్రం 80 శాతం వృద్ధి సాధించినట్లు చూపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. దేవరకొండ, మిర్యాలగూడెంలో ట్యాంకుల నిర్మాణం నత్తనకడన సాగుతుంటే ఎజెండాలో మాత్రం వందల సంఖ్యలో ట్యాంకులు కట్టినట్లు చూపెడుతున్నారని, పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని అధికారులను నిలదీశారు. డిండి మండలంలో రూ.10 లక్షలతో పైపులైన్లు వేయడం ఎలా సాధ్యమవుతుందని, రివైజ్‌డ్ ఎస్టిమేట్లు వేయాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
అధికారులు బాధ్యతరాహిత్యంగా వ్యవహారించడం వల్లే∙పీఏపల్లి మండలం పడమటి తండాలో ట్రాక్టర్ ప్రమాదం జరిగిందని, ఆ సంఘటనకు అధికారులే బాధ్యత వహించాలని చైర్మన్ అన్నారు. పీఏపల్లి మండలం తూర్పుపల్లి గ్రామంలో పీహెచ్‌సీ భవనం నిర్మాణం జరిగినా వైద్యులు, సిబ్బంది లేక నిరుపయోగంగా మారిందని, వైద్య సిబ్బందిని త్వరగా నియమించాలని ఆరోగ్యశాఖ అధికారులను చైర్మన్ ఆదేశించారు. సమావేశానికి డీఆర్‌డీఓ రింగు అంజ య్య, సభ్యులు పాశం రాంరెడ్డి, స్వామి గౌడ్, రజితారెడ్డి, జేడీఏ నర్సింహారావు, డీటీడబ్ల్యూఓ నరోత్తమ్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పాపారావు, ఐసీడీఎస్ పీడీ పుష్పలత, డీఎంహెచ్‌ఓ భానుప్రకాష్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment