వెలుగులు నిండేనా!
జిల్లాలో దీనదయాళ్ పథకం అమలు
రూ.125కే కొత్త విద్యుత్ కనెక్షన్
ప్రచార లోపంతో ప్రజల దరి చేరని పథకం
రూ.13.3 కోట్లతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు
జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూరు శాతం విద్యుత్ ఉండాలి... విద్యుత్ దీపం లేని ఇల్లు అనేది రానున్న రోజుల్లో ఉండకూడదు...ఇదీ దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం లక్ష్యం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వచ్చే రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా పరిస్థితిలో పూర్తి మార్పు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ కనెక్షన్, ఉచితంగా ఎల్‌ఈడీ బల్బులు అందిస్తోంది. నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఈ పథకం మూడు నెలలుగా అమలులో ఉంది. విసృ్తత ప్రచారం లేకపోవటం వల్ల జిల్లాలో ఎవరికీ తెలియకపోవటం గమనార్హం. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది.
విజయవాడ: జిల్లాలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం ఉంది. విద్యుత్ కనెక్షన్లు లేని ఇళ్లు సుమారు 50 వేల వరకు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వచ్చే రెండేళ్లలో 50 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు, వివిధ అవసరాలను వివరిస్తూ జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం కింద జిల్లాకు రూ.13.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు పిలచి మొదలుపెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, అవసరమైన చోట మరమ్మతులు నిర్వహించటం వంటి పనులు నిర్వహిస్తున్నారు. వార్షిక సంవత్సరం ముగింపులోగా నిధులు వినియోగం జరగాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు.
20 వేల కొత్త కనెక్షన్లు...
మరో వైపు ఈ పథకం ద్వారా జిల్లాలో 20 వేల కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లను గుర్తించి వాటికి అందిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డివిజనల్ పరిధిలో డివిజనల్ ఇంజనీర్లు వాటిని గుర్తించి కొత్త కనెక్షన్‌కు దరఖాస్తు మంజూరు చేసి వారం వ్యవధిలో కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 8వేల కనెక్షన్లు మంజూరు చేశారు. మిగిలిన 12 వేల కనెక్షన్లు ఏప్రిల్ నాటికి ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ మీటరు, బోర్డు, కొత్త లైన్‌కు అవసరమయ్యే విద్యుత్ వైర్లు, 9 వాట్ల ఎల్‌ఈడీ బల్బును పథకం ద్వారా అందజేస్తున్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయ్‌కుమార్ సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో పథకం అమలతీరును తరచూ సమీక్షిస్తునామని చెప్పారు. ఇప్పటికి కొత్తగా 8వేల కనెక్షన్లు ఇచ్చామని మిగిలిన 12 వేల కనెక్షన్లు రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రూ.13.3 కోట్ల నిధులతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఇప్పటికే పనులు 60 శాతం పూర్తయినట్లు వివరించారు.