జయలలిత మేనకోడలు దీప ఆస్తులివే
చెన్నై: తమిళనాడులో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తనకు మొత్తం 3.05 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్టు ప్రకటించారు. రెండు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు, రూ. 1.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. గురువారం ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన దీప.. అఫిడవిట్లో ఈ వివరాలను తెలియజేశారు. 2016-17 వార్షిక ఏడాదికి గాను తనకు రూ. 5.37 లక్షలు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు.
గతేడాది రూ. 17.50 లక్షలకు 1600 చదరపు అడుగుల స్థిరాస్తిని కొనుగోలు చేశానని, దీని మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని దీప అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకులకు రూ. 6.15 లక్షలు లోన్ చెల్లించాల్సివుందని, మరో ముగ్గురి నుంచి రూ. 70.65 లక్షలు అప్పు తీసుకున్నానని తెలిపారు. 2016లో 50,390 రూపాయలు వెచ్చించి ఓ స్కూటర్ కొన్నానని వెల్లడించింది. తనకు 23.80 లక్షల రూపాయల విలువైన 821 గ్రాముల బంగారం, రూ. 1.72 లక్షల విలువైన వెండి, రూ. 4 లక్షల విలువైన 20 కేరట్ వజ్రాలు ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ. 3.50 లక్షల నగదు ఉందని, బ్యాంకులో రూ. 1.77 లక్షలు సేవింగ్ డిపాజిట్లు ఉన్నట్టు దీప వెల్లడించారు.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత నెలలో ఎంజీఆర్ అమ్మ దీప పెరవయి రాజకీయ వేదికను ప్రారంభించిన ఆమె ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు.