DEESet
-
ఆన్లైన్లోనే డీఈఈసెట్!
♦ పాఠశాల విద్యా కమిషనరే కన్వీనర్ ♦ నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ జారీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్–2017కు ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 10 జారీ చేశారు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి డీఈఈసెట్‌ను (డైట్‌సెట్) ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యా కమిషనర్‌ను డీఈఈసెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినందున, స్వయంగా కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించేలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఈఈసెట్‌కు కమిషనర్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వం మార్చింది. కొత్త జిల్లాలు పాత డైట్ల పరిధిలోకే.. కొత్తగా ఏర్పడిన జిల్లాలు కూడా గతంలో ఉన్న పాత జిల్లాల్లోని డైట్ల పరిధిలోకే వస్తాయి. పాత జిల్లాల్లోని డైట్లే హెల్ప్‌లైన్ కేంద్రాలుగా ఉంటాయని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా అందులోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలలో డీఎడ్ కోర్సును నిర్వహిస్తారు. మే 10లోగా డీఎడ్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విద్యా శాఖను ఆదేశించింది. ప్రవేశాలను జూన్‌లోగా పూర్తి చేసి, జులై 1 నుంచి తరగతులను ప్రారంభిస్తారు. విద్యార్హతలు, రిజర్వేషన్లు గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఇదీ సీట్ల భర్తీ విధానం హా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను సింగిల్ విండో–1 ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ డైట్లలో 100 శాతం సీట్లను, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 80 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. హా సింగిల్ విండో–2 ద్వారా మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. విద్యా శాఖ నిర్వహించే డీఈఈసెట్‌తో వీటికి సంబంధం ఉండదు. మైనారిటీ విద్యా సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి డీఈఈసెట్–ఏసీ పేరుతో నోటిఫికేషన్ జారీ చేయాలి. కన్వీనర్ కోటాలోని 80 శాతం సీట్లను 100 శాతంగా పరిగణనలోకి తీసుకొని అందులో 70 శాతం సీట్లను మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. మిగితా 30 శాతం సీట్లను డీఈఈసెట్లో అర్హత సాధించిన నాన్ మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. సీట్లు మిగిలితే రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలి. -
డీఈఈసెట్లో 67.6 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2015 ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలో 67.6 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 268 కాలేజీల్లో (10 ప్రభుత్వ, 216 ప్రైవేటు, 42 మైనారిటీ కాలేజీలు) 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వచ్చే నెల మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. పూర్తి స్థాయి షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా డీఈఈసెట్‌కు 1,11,413 మంది దరఖాస్తు చేసుకోగా 1,05,382 మంది ఈ నెల 9న పరీక్షకు హాజరయ్యారు. 71,317 మంది అర్హత సాధించారు. 10 వేల మంది బాలికలకు హాస్టల్ రాష్ట్రంలోని 100 మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన బాలికల హాస్టళ్లు సెప్టెంబర్ 1 నుంచి ఆచరణలోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఒక్కో హాస్టల్లో 100 మంది బాలికల చొప్పున 10 వేల మంది బాలికలకు వసతితో కూడిన విద్యను అందించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని హాస్టళ్లను గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభించాన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల కేటాయించాలన్న దానిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యా హక్కు చట్టం కింద చేయాల్సిన ఈ ఖర్చును ప్రభుత్వ పాఠశాలల్లోనే వెచ్చించి, వాటిని బలోపేతం చేసేలా యోచిస్తున్నామన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని, దీనిపై ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
డీఈఈసెట్లో మెరిసిన ‘జ్యోతి’
సక్సెస్ స్టోరీ ఆ ఇంట్లో అమ్మానాన్నలకు అక్షర కాంతులు లేవు. అయినా ఆమె ఆ కుటుంబంలో అక్షర ‘జ్యోతు’లు నింపింది. రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్‌కు దాదాపు నాలుగు లక్షలమంది పోటీపడగా మొదటి ర్యాంకు సాధించి విజయ దుందుభి మోగించింది..గంటా జ్యోతి. ఆమె విజయప్రస్థానం తన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం మాది విజయనగరం జిల్లా, గంట్యాడ మండలం, రావివలస. నాన్న ఆదినారాయణ, అమ్మ మంగమ్మ. అమ్మానాన్న ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. చెల్లెలు యమున తొమ్మిదో తరగతి చదువుతోంది. విద్యాభ్యాసం నా విద్యాభ్యాసమంతా మా జిల్లాలోనే జరిగింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు కొఠారుపల్లిలోని ఎస్వీడీ గంగాధర్ విద్యానికేతన్‌లో విద్యనభ్యసించాను. పదో తరగతిలో 8.00 గ్రేడ్ పాయింట్లు సాధించాను. విజయనగరంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ చదివాను. ఇంటర్లో 736 మార్కులు వచ్చాయి. అన్నయ్యల స్ఫూర్తితో మా పెదనాన్న కుమారులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి వారిని చూస్తూనే పెరిగాను. నేను కూడా ఎప్పటికైనా టీచర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ఈ క్రమంలోనే డీఈఈసెట్ రాశాను. మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ 86 (మొత్తం 100) మార్కులతో మొదటి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. వారానికి నాలుగు గ్రాండ్ టెస్టులు డీఈఈసెట్ కోసం విజయనగరంలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. రెండు నెలల శిక్షణలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు ఉండేవి. వారానికి నాలుగుసార్లు గ్రాండ్ టెస్టులు నిర్వహించేవారు. చివరి పది రోజులు ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్టులు రాశాను. వీటి ఆధారంగా బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి సారించాను. గత 20 ఏళ్ల ప్రశ్నపత్రాలను సేకరించి సాధన చేశాను. వీటితోపాటు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను విస్తృతంగా అధ్యయనం చేశాను. నా తల్లిదండ్రులు, అన్నయ్యలు, టీచర్ల ప్రోత్సాహంతో ప్రథమ ర్యాంకు సాధించగలిగాను.