ఆన్‌లైన్‌లోనే డీఈఈసెట్!
♦ పాఠశాల విద్యా కమిషనరే కన్వీనర్
♦ నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ జారీకి అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్–2017కు ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 10 జారీ చేశారు.
ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి డీఈఈసెట్‌ను (డైట్‌సెట్) ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యా కమిషనర్‌ను డీఈఈసెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినందున, స్వయంగా కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించేలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఈఈసెట్‌కు కమిషనర్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వం మార్చింది.
కొత్త జిల్లాలు పాత డైట్‌ల పరిధిలోకే..
కొత్తగా ఏర్పడిన జిల్లాలు కూడా గతంలో ఉన్న పాత జిల్లాల్లోని డైట్‌ల పరిధిలోకే వస్తాయి. పాత జిల్లాల్లోని డైట్‌లే హెల్ప్‌లైన్ కేంద్రాలుగా ఉంటాయని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా అందులోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలలో డీఎడ్ కోర్సును నిర్వహిస్తారు. మే 10లోగా డీఎడ్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విద్యా శాఖను ఆదేశించింది. ప్రవేశాలను జూన్‌లోగా పూర్తి చేసి, జులై 1 నుంచి తరగతులను ప్రారంభిస్తారు. విద్యార్హతలు, రిజర్వేషన్లు గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఉంటాయి.
ఇదీ సీట్ల భర్తీ విధానం
హా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను సింగిల్ విండో–1 ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ డైట్‌లలో 100 శాతం సీట్లను, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 80 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.
హా సింగిల్ విండో–2 ద్వారా మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. విద్యా శాఖ నిర్వహించే డీఈఈసెట్‌తో వీటికి సంబంధం ఉండదు. మైనారిటీ విద్యా సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి డీఈఈసెట్–ఏసీ పేరుతో నోటిఫికేషన్ జారీ చేయాలి. కన్వీనర్ కోటాలోని 80 శాతం సీట్లను 100 శాతంగా పరిగణనలోకి తీసుకొని అందులో 70 శాతం సీట్లను మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. మిగితా 30 శాతం సీట్లను డీఈఈసెట్‌లో అర్హత సాధించిన నాన్ మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. సీట్లు మిగిలితే రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలి.