సోమవారం డైట్ సెట్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి కడియం శ్రీహరి తదితరులు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2015 ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్షలో 67.6 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 268 కాలేజీల్లో (10 ప్రభుత్వ, 216 ప్రైవేటు, 42 మైనారిటీ కాలేజీలు) 14,500 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వచ్చే నెల మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
పూర్తి స్థాయి షెడ్యూలును త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా డీఈఈసెట్‌కు 1,11,413 మంది దరఖాస్తు చేసుకోగా 1,05,382 మంది ఈ నెల 9న పరీక్షకు హాజరయ్యారు. 71,317 మంది అర్హత సాధించారు.
10 వేల మంది బాలికలకు హాస్టల్
రాష్ట్రంలోని 100 మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన బాలికల హాస్టళ్లు సెప్టెంబర్ 1 నుంచి ఆచరణలోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ఒక్కో హాస్టల్లో 100 మంది బాలికల చొప్పున 10 వేల మంది బాలికలకు వసతితో కూడిన విద్యను అందించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని హాస్టళ్లను గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభించాన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల కేటాయించాలన్న దానిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. విద్యా హక్కు చట్టం కింద చేయాల్సిన ఈ ఖర్చును ప్రభుత్వ పాఠశాలల్లోనే వెచ్చించి, వాటిని బలోపేతం చేసేలా యోచిస్తున్నామన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించవచ్చని, దీనిపై ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.