జనవరిలో ఫీజు రీయింబర్స్‌మెంట్
* విద్యార్థులను సతాయించొద్దు
* డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
భీమారం: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందలేదని విద్యార్థులను సతాయించొద్దని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండ పరిధిలోని భీమారంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ విద్యపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అందలేదని కొన్ని కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. డబ్బులు చెల్లించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 2014-2015కు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్‌లు త్వరలో అందజేస్తామని చెప్పారు. 2015-16కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జనవరి నెలాఖరు వరకు పూర్తిగా విడుదల చేస్తామన్నారు.
ఇప్పటికే కొన్ని కళాశాలలు అధ్యాపకులకు వేతనాలివ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రభుత్వం పాలసీ మేరకు ప్రైవేట్ కళాశాలలు మూతపడుతాయని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచిం చారు. ఇంటర్‌బోర్డును ఆన్‌లైన్ చేస్తున్నట్లు కడియం ప్రకటించారు. ఇప్పటికే విద్యార్థుల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రైవేట్ కళాశాల అఫ్లియేషన్‌ను ఐదేళ్లకు పెంచే విషయాన్ని చర్చిస్తామని పేర్కొన్నారు.
అవినీతి వాస్తవమే..
ప్రభుత్వశాఖల్లో అవినీతి జరుగుతున్న మాట వాప్తవమేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెం ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరదారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ బోర్డుకు వెళ్తే పైసా లేకుండా పని జరగడం లేదని..అక్కడి అధికారులు యాజమాన్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు.
స్పందిం చిన కడియం శ్రీహరి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వారు ఆత్రుతతో పని కావాలని ఎంతో కొంత ముట్టుజెప్పి పనులు చేయించుకుంటున్నారని.. కళాశాలల యాజమాన్యాలు వారి అవినీతిని ప్రోత్సహించాయని చెప్పారు. టీప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు వి.నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు నర్సింహులులతో పాటు పది జిల్లాల నుంచి సుమారు 150 కళాశాలల ప్రతి నిధులు హాజరయ్యారు.
3నెలల్లో ప్రతి పేదవారి ఇంటికి గ్యాస్ కనెక్షన్
హన్మకొండ: తెలంగాణలో మూడు నెలల్లో ప్రతి పేద ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా హన్మకొండలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, బానోత్ శంకర్‌నాయక్‌తో కలసి కడియం శ్రీహరి దీపం పథకాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ గ్రామాల వారీగా లబ్ధిదారులను గుర్తించి వారికి రాయితీపై గ్యాస్ కనెక్షన్ అందించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. గుడుంబా అమ్మితే ఎమ్మెల్యేలు, పోలీసు, ఎక్సైజ్ అధికారులకు చెప్పాలని గ్రామస్తులను కోరారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్యాస్ కనెక్షన్‌ల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి కనెక్షన్ అవసరముంటుందని భావించామన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈటల చెప్పారు.