స్వదేశీ న్యూక్లియర్ క్షిపణి పృథ్వి-2 సక్సెస్
బాలాసోర్: దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన.. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్ నుంచి భారత ఆర్మీ విజయవంతంగా ప్రయోగించింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించారు. భారత భూభాగం నుంచి ఇతర భూభాగాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు ఈ క్షిపణి ఉపయోగపడనుందని డిఫెన్స్ అధికారులు తెలిపారు.
పృథ్వి-2ను రెండుసార్లు వెంటవెంటనే పరీక్షించాలని మొదట్లో అనుకున్నా.. మొదటి ట్రయల్‌ను 2016 ఫిబ్రవరి 16న నిర్వహించగా తర్వాత వచ్చిన సాంకేతిక లోపం వల్ల ఆలస్యం అయినట్లు వివరించారు. ఇస్రో సొంతంగా తయారుచేసిన ద్రవ ఇంధనాలతో.. రెండు ఇంజన్లతో నింగిలోకి ఎగిసే పృథ్వి-2 500 కేజీలు, 1000 కేజీల పేలుడు పదార్ధాలను మోసుకుని 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అత్యాధునిక ఇనర్టియల్ గైడెన్స్ సిస్టంను ఉపయోగించుకుని లక్ష్యాన్ని చేరుకోగలదు.
దేశ అత్యున్నత డిఫెన్స్ సంస్థలైన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్ సీ), డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లు పృథ్వి-2ను రూపొందించాయి. బుధవారం ఉదయం 9.40 నిమిషాల ప్రాంతంలో ప్రయోగించిన క్షిపణిని డీఆర్డీవోకు చెందిన రాడార్లు, ఎలక్ట్రో- ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టంలు, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా విజయవంతమైనట్లు గుర్తించామని రక్షణ శాస్త్రజ్ఞులు తెలిపారు. భారతీయ సైన్యంలోకి 2003లో ప్రవేశించిన పృథ్వి శ్రేణి క్షిపణిని తొలిసారి డీఆర్డీవో తయారుచేసిందనీ.. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉన్న ఈ మిస్సైల్ విజయం సాధించిందని డిఫెన్స్ అధికారులు తెలిపారు.