నిర్మలా ఎంపిక.. అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యూహాత్మకతను పాటిస్తూ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. శాఖల కేటాయింపులో రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకున్నారన్నది స్పష్టమౌతోంది. అన్నింటికి మించి రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు బాధ్యతలు అప్పగించటం మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఆ విషయంలో మోదీ చాలా అద్భుతమైన నిర్ణయం చేపట్టారని అంటున్నారు మాజీ సైన్యాధికారి పీకే సెహగల్.
‘నాకు తెలిసి ఇది చాలా తెలివైన ఎంపిక. కఠోర శ్రమ, పైగా గుర్తింపు ఉన్న నేతగా నిర్మలాకు పేరుంది. రక్షణ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తనను తాను ఆమె నిరూపించుకుంటారన్న నమ్మకం ఉంది’ అని సైన్య నిపుణులైన సెహగల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన పాలనలో అంతా తాత్కాలిక రక్షణ మంత్రులనే నియమించటం చూశాం. సమర్థవంతమైన మంత్రి లేకపోవటంతో కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రపంచ యుద్ధాలను సైతం ఎదుర్కునేలా ఆ శాఖ పటిష్టంగా ఉండాలి. అయితే అధికారులకు, సైన్యానికి మధ్య సమన్వయం లోపిస్తే అది ఏళ్ల తరబడి ప్రభావం చూపే అవకాశం ఉందని సెహగల్ అభిప్రాయపడ్డారు.
కాగా, ఆదివారం నిర్వహించిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ పగ్గాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. కర్ణాటక తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెప్టెంబర్ 6న నిర్మలా సీతారామన్ జైట్లీ నుంచి రక్షణ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.