degree college students
-
అన్నమో చంద్రబాబూ!
కర్నూలు(సెంట్రల్): ప్రతిష్టాత్మక కర్నూ లు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టళ్లలో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చుకుంటున్నామని కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదిలేదని బీష్మించారు. చివరకు డీఆర్వో వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్ వద్ద ధర్నాను నిలిపివేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తాగేందుకు, స్నానం చేసేందుకు కూడా నీళ్లు లేవన్నారు. మరుగుదొడ్లను శుభ్రంచేసే వారు లేకపోవడంతో తామే ఆ పనిచేయాల్సి వస్తోందన్నారు. కళాశాలలో చదవే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మెస్ చార్జీలను క్లస్టర్ యూనివర్సిటీ వసూలు చేసుకుని నిర్వహణకు ముందుకురాకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. విద్యార్థులు చెల్లించే మెస్ చార్జీల్లో అధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుండటంతో గతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో సిల్వర్ జూబ్లీ కళాశాలకు అవసరమయ్యే బియ్యాన్ని కేజీ రూపాయికే ఇచ్చేలా జీవో ఇచ్చిందని వివరించారు.అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోను అమలు చేయడంలేదన్నారు. దీంతో ప్రస్తుతం కేజీ బియ్యం కోసం కళాశాల రూ.41 చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలైతే కేజీ బియ్యం రూపాయికే వస్తాయని, మిగిలిన రూ.40లతో వంటకు అవసరైన కూరగాయలు, నూనెలు, ఇతర అన్ని రకాల సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సిల్వర్ జూబ్లీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ మార్పు
మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్ మార్పు చేసినట్లు కన్వీనర్ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు ఆదివారం తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైనా సర్టిఫికెట్ పొందుపరచడం మరిచిపోతే, ఈ నెల 16 నుంచి 18 వరకు పెండింగ్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్సైట్లో ఉంచాలి. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్సైట్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేలా ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. -
స్కాలర్షిప్ దరఖాస్తులకు బ్రేక్!
శాతవాహనయూనివర్సిటీ: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులు 2018–19 విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కానీ.. దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తే సంబంధిత కళాశాలలు, కోర్సుల వివరాలు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణమేం టని కళాశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తే.. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికా రుల చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 30తో కొత్త దరఖాస్తుల గడువు ముగుస్తుండడంతో విద్యార్థులు కలవరపడుతున్నారు. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలాఖరున ముగియనుంది. కానీ.. నేటికీ కొత్తగా కోర్సుల్లో చేరిన డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ఈ–పాస్‌లో కళాశాలల వివరాలు లేకపోవడంతో సాధ్యపడడం లేదు. ఏటా యూనివర్సి టీ అధికారులు అనుబంధ హోదా పక్రియ ముగి సిన తర్వాత హోదా దక్కిన కళాశాలల వివరాల ను ఈ–పాస్‌కు అనుసంధానం చేయాల్సి ఉం టుంది. అయితే నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తలపట్టుకుంటున్నారు. యూనివర్సిటీ అధికారులు, ఈ–పాస్ అధికారులు ఈ విషయంలో జా ప్యం వీడి వెంటనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోనేలా వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని విద్యార్థులు, వి ద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పక్రియ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకున్న వారు ఉపకారవేతనాల దరఖాస్తుకు సిద్ధమయ్యారు. ఆ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 70 రోజులు గడిచినా ఇంతవరకు దరఖాస్తు చేసుకోనే వీలులేకపోవడంతో ప్రతిరోజూ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ల డం.. నిరాశతో తిరిగి రావడం విద్యార్థుల వంతవుతోంది. కొందరు విద్యార్థులు ఆయా కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తే.. యూనివర్సిటీ, ఈ పాస్ అధికారుల చేతులో ఉంటుందని సర్దిచెబుతూ వస్తున్నారు. కానీ అసలు విషయం మరో లా ఉంది. శాతవాహన యూనివర్సిటీ అధికారులకే ఈపాస్‌కు సంబంధించిన లాగిన్ సమాచారం లేకపోవడంతోనే కళాశాలల వివరాలు అనుసంధానం కాలేదని సమాచారం. కేవలం శాతవాహనకే కాకుండా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం. ఈ పాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు కావాల్సిన లాగిన్ సమాచారమిస్తేనే కళాశాలల వివరాలు ఈ–పాస్‌లో నమోదయ్యే అవకాశముంటుంది. తర్వాత యథావిధిగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అనుసంధానం పూర్తయ్యేదెన్నడో...! ఉపకార వేతనాల దరఖాస్తులు ప్రారంభం రోజులు గడుస్తున్నా నేటికీ అవకాశం లేకపోవడంతో డిగ్రీ మొదటి సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపాస్ అధికారులు యూనివర్సిటీ అధికారులకు అనుసంధానికి కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ జాప్యానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. అనుబంధ హోదా ప్రకటించిన తర్వాత ఆయా కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ అధికారులు అనుసంధానం చేస్తేనే విద్యార్థులకు దరఖాస్తులు చేసుకునే అవకాశముంటుంది. గడువు ఈనెల 30 వరకు ఉందిగానీ శాతవాహన అధికారులకే లాగిన్ సమాచారం లేకపోవడంతో అనుసంధానం ఆలస్యమవడం ఖాయమని తెలుస్తోంది. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ–పాస్ అధికారులు, యూనివర్సిటీలకు లాగిన్ సమాచారమందిస్తాయని, అనంతరం అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, అప్పటి వరకు విద్యార్థులు వేచిచూడక తప్పదని అధికారవర్గాల ద్వారా సమాచారం. ఈ–పాస్ అధికారులు సత్వరమే స్పందించి దరఖాస్తుల ప్రక్రియలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. లాగిన్ సమాచారం రాలేదు... ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నవారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ పాస్ అధికారుల నుంచి శాతవాహనకు లాగిన్ సమాచారం రాలేదు. కళాశాలల సమాచారం అనుసం«ధానం చేయలేదు. శాతవాహనతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉంది. కాకతీయ, శాతవాహన పరిధిలోని పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అయిన తర్వాత లాగిన్ సమాచారం వచ్చి అనుసంధానం చేసే అవకాశాలుంటాయి. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
అశ్రునయనాలతో సంతోషి అంత్యక్రియలు
► కడసారి చూపుకోసం తరలిన విద్యార్థి లోకం ► హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ►విద్యార్థి సంఘాల ఆందోళన సిద్దిపేటఅర్బన్: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంతోషి అంత్యక్రియలు గురువారం సహచర విద్యార్థులు, గ్రామస్తులు, బంధువుల అశ్రునయనాల మధ్య కొండపాక మండలం సిరిసినగండ్లలో జరిగాయి. కడసారి చూపు కోసం విద్యార్థి లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. డిగ్రీ కళాశాల విద్యార్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు సంతోషి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి, పౌరహక్కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందించారు. అదే విధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సంతోషి మృతికి సంతాపంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించి ర్యాలీగా ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం ఏరియా ఆస్పత్రిలో పోలీసుల సమక్షంలో సంతోషి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని విద్యార్థులు కొండపాక మండలం సిరిసినగండ్లకు తరలించారు. తమతోటి విద్యార్థిని మృతిని జీర్ణించుకోలేక విద్యార్థులు పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియలకు వందలాది మంది తరలివచ్చారు. అధికారులకు వినతి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సంతోషిపై జరిగిన అత్యాచారం, హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు భరత్, సాయి, లింగం, లక్ష్మణ్ తదితరులు జిల్లా ఆస్పత్రి వద్ద నిరసన ప్రదర్శన చేశారు. నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐ నందీశ్వర్‌కు, ఆర్డీఓ ముత్యంరెడ్డిలకు వినతిపత్రాన్ని అందించారు. పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు రాగుల భూపతి గురువారం ఏసీపీకి వినతి పత్రం అందించారు. విద్యార్థిని మృతికి కారణమైన గుమ్మన్నగారి రవిశంకరశర్మ, పద్మావతి, వారి కుమారుడు కృష్ణచంద్ర, శరత్చంద్రలను నిందితులుగా చేర్చి అత్యాచారం, హత్య, నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సంరక్షణ పేరుతో విద్యార్థిని పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ పని మనిషిలా ఉపయోగించుకున్న ఆ కుటుంబంపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంతోషిని మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు పోలీసు శాఖను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, బీడీఎస్ఎఫ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రతినిధులు అనిల్‌రెడ్డి, అశోక్, సత్తయ్య, మన్నె కుమార్, శ్రీకాంత్, ఆనంద్ పాల్గొన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష
దిలావర్పూర్: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ నందముత్యం విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సీహెచ్‌వో రాజేశ్వర్పాండే, ప్రధానోపాధ్యాయు డు లక్షీ్మనారాయణగౌడ్, ఆసుపత్రి సూపర్వైజర్లు రత్నకుమారి, వేణురావు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్‌రూరల్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అల్భెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా 300మంది విద్యార్థులకు మాత్రలు అందించామన్నారు. కార్యక్రమంలో నట్టల నివారణ కన్వీనర్ గంగాధర్, అధ్యాపకులు తిరుపతి, రవీందర్, నాగేశ్వర్, సూర్యసాగర్, సత్యపాల్‌రెడ్డి, అనిల్, ప్రకాశ్, ఉమేశ్, నర్సయ్య, జాకీర్ హుస్సేన్, స్వరూపరాణి పాల్గొన్నారు. లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని సహకార జూనియర్ కళాశాలలో ఇన్ చార్జి అధ్యాపకులు ఎం .రాజేశ్వర్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు సురేశ్, రాము, రవి, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్‌రూరల్: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని బంగల్పేట్ పీహెచ్సీ వైద్యాధికారి మాధవి అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాతర్ల గణేశ్, వైద్య సిబ్బంది రాములు, ఆశ కార్యకర్త భూదేవి, ఉపాధ్యాయులు రాంనరేశ్, సుమలత, తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్: పిల్లల్లో ప్రధానంగా నులిపురుగుల సమస్యల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి నుంచి రక్షించడానికి తప్పనిసరిగా నట్టల నివారణ మందులను వేయించాలని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి అవినాష్ పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపరుగుల కారణంగా రక్తహీనత, పోషకాలలోపం, ఆకలి లేకపోవుట, బలహీనంగా మారడం, కడుపునొప్పి, తదితర సమస్యలు ఎదురవుతాయన్నారు. ఎంఈవో మధుసూదన్, జామ్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమాకల్యాణి, హెల్త్ సూపర్వైజర్ క్రిష్ణమోహన్ గౌడ్, ఏఎన్ సునీత, సిబ్బంది, పాల్గొన్నారు. నిర్మల్ టౌన్: నులిపురుగుల నివారణకు చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఎంపీడీవో గజ్జారాం అన్నారు. మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రను ప్రతీ ఆరునెలలకోసారి వేస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భీంరావు, ఈవోఆర్డీ మోహన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.