అన్నమో చంద్రబాబూ! | Kurnool Silver Jubilee Degree College Students Protesting Infront Of The Collectorate, More Details Inside | Sakshi
Sakshi News home page

అన్నమో చంద్రబాబూ!

Published Sat, Jul 6 2024 5:56 AM | Last Updated on Sat, Jul 6 2024 12:33 PM

Kurnool Silver Jubilee Degree College students concern

రోడ్డెక్కిన కర్నూలు సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు

కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నా 

పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేకపోతున్నామని ఆవేదన

జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకపోవడం వల్లే సమస్య అంటూ ఆగ్రహం

కర్నూలు(సెంట్రల్‌): ప్రతిష్టాత్మక కర్నూ లు సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యా­ర్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టళ్లలో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చు­కుంటున్నామని కలెక్టరేట్‌ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్‌ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదిలేదని బీష్మించారు. చివరకు డీఆర్వో వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్‌ వద్ద ధర్నాను నిలిపివేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్‌ కార్యా­లయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

తాగేందుకు, స్నానం చేసేందుకు కూడా నీళ్లు లేవన్నారు. మరుగుదొడ్లను శుభ్రంచేసే వారు లేకపోవడంతో తామే ఆ పనిచేయాల్సి వస్తోందన్నారు. కళాశాలలో చదవే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మెస్‌ చార్జీలను క్లస్టర్‌ యూనివర్సిటీ వసూలు చేసుకుని నిర్వహణకు ముందుకురాకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. విద్యార్థులు చెల్లించే మెస్‌ చార్జీల్లో అధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుండటంతో గతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు అవసరమయ్యే బియ్యాన్ని కేజీ రూపాయికే ఇచ్చేలా జీవో ఇచ్చిందని వివరించారు.

అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోను అమలు చేయడంలేదన్నారు. దీంతో ప్రస్తుతం కేజీ బియ్యం కోసం కళాశాల రూ.41 చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలైతే కేజీ బియ్యం రూపాయికే వస్తాయని, మిగిలిన రూ.40లతో వంటకు అవసరైన కూరగాయలు, నూనెలు, ఇతర అన్ని రకాల సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement