సిలబస్ రెడీ.. మార్పు అందుకోని డిగ్రీ‘స్టడీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలను ఉన్నత విద్యా మండలి మార్పులు చేసినా, వాటి అమలును యూనివర్సిటీలు పట్టించుకోకపోవడం తో ఈ విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు కొత్త సిలబస్‌కు నోచుకోవడం లేదు. ఆయా వర్సిటీల విభాగాధిపతులు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల నేతృత్వంలోనే కమిటీలు వేసి సిలబస్ ను మార్పు చేసినా తమ పరిధిలోని కళాశాలల్లో కొత్త సిలబస్ ప్రకారం బోధన కొనసాగించడంపై దృష్టి సారించడంలేదు.
వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేకపోవడం, అకడమిక్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయకపోవడం, ఇన్చార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు ఉండటంతో పట్టించుకునే వారు లేకుండాపోయారు. రాష్ట్రం లో 1,200 వరకు డిగ్రీ కాలేజీల్లో ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. కొత్త సిలబస్ అమలుపై ఆ రెండు వర్సిటీలు దృష్టి సారించకపోవడంతో గందరగోళం నెలకొంది.
ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త సిలబస్ అమల్లోకి తెస్తామని ఉన్నత విద్యా మండలి ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. మరో వైపు తెలుగు అకాడమీ పాఠాలు రాయించలేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 300కు పైగా కాలేజీలున్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహా త్మాగాంధీ వర్సిటీలు మాత్రమే కొత్త సిలబస్ అమలుకు తమ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి.
ఇవే ప్రామాణికం: కొత్త రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సిలబన్‌లో ఏపీ అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలతో రూపొందించిచారు. దీని అమలుకు అన్ని వర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేస్తే తెలుగు అకాడమీ పుస్తకాలు రాయించి ము ద్రిస్తుంది. రెండు వర్సిటీలు తీర్మానం చేయకపోవడంతో ముద్రణ ఆగిపోయింది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నా యి. ఈ క్రమంలో వర్సిటీలు సిలబస్ మార్చకపోవడంతో గందరగోళం నెలకొంది.
వచ్చే ఏడాది అమలు: ‘పుస్తకాల రచన వంటి పనులు ఆలస్య కావడం వల్లే ఈసారి కొత్త సిలబస్ అమలు చేయలేక పోయాం. వచ్చే విద్యా సంవత్సరంలో దీన్ని అమలు చేస్తాం’ అని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఎస్.మల్లేశ్ చెప్పారు.