Dehydration problem
-
భౌభౌ.. బీ కేర్ ఫుల్...ఈ కాలంలోనే వాటి కాట్లు ఎక్కువ
సాక్షి హైదరాబాద్/కాచిగూడ: ఇందుగలవందు లేవనే సందేహంబు వలదు.. ఏ సందు వెదికినా అందందే భౌభౌ మనగలదు అన్నట్టుగా ఉంది నగరంలో వీధి కుక్కల పరిస్థితి. రోజూ వందల సంఖ్యలో నారాయణగూడ ఐపీఎంలో బారులు తీరుతున్న బాధితుల సంఖ్య ఓ నిదర్శనం. ఇక ఎండాకాలం వచ్చిందంటే కుక్కకాట్ల సంఖ్య మరింత పెరుగుతోంది. నారాయణగూడ వైఎంసీ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు కొన్ని రోజులుగా కుక్కకాటు బాధితుల రాక పెరిగింది. ‘ప్రతిరోజూ 250 నుంచి 300 వరకూ బాధితులు వస్తారు. ఎండాకాలం ఆ సంఖ్య 400 నుంచి 600 వరకూ పెరుగుతోంది’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. వేసవిలో కారణాలివీ.. సైకాలజీ టుడే ప్రకారం వేడి, ఉక్కపోత వాతావరణంలో మనుషుల్లో ఎలాగైతే కోపం, చికాకు పెరుగుతుందో అదే శునకాలకు కూడా వర్తిస్తుంది. ఈ సీజన్లో ఆహారం, నీరు అందకపోతే డీహైడ్రేట్ కావడంతో కూడా అవి కరుస్తాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. వేసవిలో ఆరుబయట నీడనిచ్చే చెట్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం సేదతీరాలనుకుంటారు. అందువల్ల కూడా ఈ సీజన్లో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. పెట్స్ బైట్స్.. వీధి శునకాలు మాత్రమే కాదు అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ చెప్పిన విషయం ఏమిటంటే ఎండాకాలంలో మొత్తం కుక్క కాట్లలో పెంపుడు శునకాల వాటా 27శాతం ఉంటుందట. శరీరంలో కరిచే ప్రాంతాలపై సంబంధిత నిపుణులు చెబుతున్న ప్రకారం.. కుక్కకాట్లలో 34 శాతం తల, మెడ, చెంపలు, పెదాలపై 21 శాతం, ముక్కు, చెవులపై 8శాతం ఉంటున్నట్టు గుర్తించారు. అదే విధంగా కాలి పిక్కలు, చీల మండలం దగ్గర కరవడం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. కుక్కకాటుతో గాయం సగటు పరిమాణం 7.15 సెంటీమీటర్లు ఉంటుందట. కోపాన్ని గుర్తించవచ్చు... పెంపుడుదైనా, వీధి కుక్కయినా కోపంగా/చిరాకుగా ఉందని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశాలున్నాయనే విషయం ముందస్తుగా గుర్తించవచ్చునంటున్నారు నిపుణులు. కోపంగా ఉన్న శునకం.. చెవులు వెనక్కు సాగదీస్తుందట. నోటిని గట్టిగా మూస్తుందని, తన రెండు కాళ్ల మధ్య తోకను ఉంచి గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తుంటుందని వెల్లడిస్తున్నారు. ఇక మొరగడం సరేసరి. భౌభౌ.. కేర్ ఫుల్... వీధికుక్కలకు ఈ సీజన్లో సరిగా ఆహారం దొరకదు. దానికి తోడు వేడి వాతావరణం కూడా వాటిలో అసహనాన్ని పెంచుతుంది. కాలే కడుపుతో వీధుల్లో ఇవి వీరంగాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఆహారం అందేలా చూడడంతో పాటు ముఖ్యంగా స్కూల్ లేదు కదా అని చిన్నారులను వీధుల్లోకి పంపవద్దు. పార్కులు, ఆటస్థలాల్లో కొంత రెక్కీ చేశాకే అనుమతించాలి. ఇక పెంపుడు కుక్కల్లో కొన్ని ప్రత్యేకమైన బ్రీడ్స్ అతిగా కరిచేవిగా గుర్తించారు. జర్మన్ షెపర్డ్, పిట్ బుల్ టెర్రిర్ వంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కుక్కలు డీహైడ్రేట్ అవకుండా ఎప్పటికప్పుడు వాటికి నీరు అందేలా చూసుకోవాలి. -
6 గంటల నిద్రతో..అనర్థమే
వాషింగ్టన్: రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నిద్రకు, డీహైడ్రేషన్‌కు ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనానికి చైనా, అమెరికాకు చెందిన యుక్త వయసు వారిని ఎంచుకున్నారు. రాత్రి 6, 8 గంటలు నిద్రపోతున్న వారి మూత్ర నమూనాలను పరీక్షించి పోల్చి చూడగా.. 6 గంటలు నిద్రపోతున్న వారిలో 16 నుంచి 59 శాతం డీహైడ్రేషన్ లక్షణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని వాసొప్రెషన్ హార్మోనే దీనికి కారణమని తేల్చారు. ఈ హార్మోనే పగలు, రాత్రి శరీరంలో హైడ్రేషన్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. నిద్రిస్తున్నప్పుడు ఆరు గంటల వ్యవధి తర్వాత ఈ హార్మోన్ అధిక మొత్తంలో విడుదలవుతుందని, ఒకవేళ 2 గంటలు ముందే నిద్రలేస్తే ఈ హార్మోన్ తగ్గి డీహైడ్రేషన్ బారిన పడుతున్నట్లు పరిశోధకుడు అషెర్ రోసింగర్ తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు వస్తాయని హెచ్చరించారు. అయితే 6 గంటలు నిద్రపోతే దానికి తగ్గట్టు ఎక్కువ నీటిని తాగితే ఏ సమస్యా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ స్లీప్‌లో ప్రచురితమయ్యాయి. -
ఆరోగ్యంగా కరుణ
► రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ ►పరామర్శల వెల్లువ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక, కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పరామర్శలు వెల్లువెత్తుతున్నారుు. సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం. కరుణానిధి గురువారం ఉదయం న్యూట్రీషన్, డీహైడ్రేషన్ సమస్యతో ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు రెండోరోజు శుక్రవారం అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కరుణానిధి వెంట ఆసుపత్రిలో ఆయన కుమారులు స్టాలిన్, అళగిరి, కుమార్తెలు సెల్వి,కనిమొళి ఉన్నారు. వృద్ధులకు చికిత్స అందించే ప్రత్యేక ఐసీయూ యూనిట్ విభాగంలో కరుణానిధి ఉన్నట్టు సమాచారం. ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ, కరుణ గారాల పట్టి కనిమొళితో ఆయన మాట్లాడారు. ఎండీఎంకే నేత వైగో, ఇక, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, సీపీఎం ఎంపీ టీకే రంగరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ఇక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షుడు కేవీ తంగబాలు, అధికార ప్రతినిధి కుష్బు, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, పళని మాణిక్యం ఆసుపత్రి వద్దకు చేరుకుని కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధిని పరామర్శించినానంతరం మీడియాతో డీఎంకే సంయుక్త ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మాట్లాడుతూ, కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, ఆహారం తీసుకుంటున్నారని వివరించారు. వైద్యుల సూచన మేరకే ఆయన డిశ్చార్జ్ అవుతారనీ, ఆయన నిర్ణయం మేరకు డిశ్చార్జ్ ఇక్కడ ఉండదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాస్త సీఎం జయలలిత డిశ్చార్జ్ విషయంగా అపోలో వర్గాల వ్యాఖ్యల్ని ఎద్దేవా చేస్తున్నట్టు ఉండడం గమనార్హం. ఇక, కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధినేతకు ఎలాంటి సమస్య లేదు అని, ఆయనకు సాధారణ చెకప్ మాత్రమేనని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు.