నారాయణగూడ ఐసీఎంలో కుక్కకాటు బాధితులు
సాక్షి హైదరాబాద్/కాచిగూడ: ఇందుగలవందు లేవనే సందేహంబు వలదు.. ఏ సందు వెదికినా అందందే భౌభౌ మనగలదు అన్నట్టుగా ఉంది నగరంలో వీధి కుక్కల పరిస్థితి. రోజూ వందల సంఖ్యలో నారాయణగూడ ఐపీఎంలో బారులు తీరుతున్న బాధితుల సంఖ్య ఓ నిదర్శనం. ఇక ఎండాకాలం వచ్చిందంటే కుక్కకాట్ల సంఖ్య మరింత పెరుగుతోంది. నారాయణగూడ వైఎంసీ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు కొన్ని రోజులుగా కుక్కకాటు బాధితుల రాక పెరిగింది. ‘ప్రతిరోజూ 250 నుంచి 300 వరకూ బాధితులు వస్తారు. ఎండాకాలం ఆ సంఖ్య 400 నుంచి 600 వరకూ పెరుగుతోంది’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు.
వేసవిలో కారణాలివీ..
సైకాలజీ టుడే ప్రకారం వేడి, ఉక్కపోత వాతావరణంలో మనుషుల్లో ఎలాగైతే కోపం, చికాకు పెరుగుతుందో అదే శునకాలకు కూడా వర్తిస్తుంది. ఈ సీజన్‌లో ఆహారం, నీరు అందకపోతే డీహైడ్రేట్ కావడంతో కూడా అవి కరుస్తాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. వేసవిలో ఆరుబయట నీడనిచ్చే చెట్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం సేదతీరాలనుకుంటారు. అందువల్ల కూడా ఈ సీజన్‌లో కుక్క కాట్లు పెరుగుతున్నాయి.
పెట్స్ బైట్స్..
వీధి శునకాలు మాత్రమే కాదు అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ చెప్పిన విషయం ఏమిటంటే ఎండాకాలంలో మొత్తం కుక్క కాట్లలో పెంపుడు శునకాల వాటా 27శాతం ఉంటుందట. శరీరంలో కరిచే ప్రాంతాలపై సంబంధిత నిపుణులు చెబుతున్న ప్రకారం.. కుక్కకాట్లలో 34 శాతం తల, మెడ, చెంపలు, పెదాలపై 21 శాతం, ముక్కు, చెవులపై 8శాతం ఉంటున్నట్టు గుర్తించారు. అదే విధంగా కాలి పిక్కలు, చీల మండలం దగ్గర కరవడం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. కుక్కకాటుతో గాయం సగటు పరిమాణం 7.15 సెంటీమీటర్లు ఉంటుందట.
కోపాన్ని గుర్తించవచ్చు...
పెంపుడుదైనా, వీధి కుక్కయినా కోపంగా/చిరాకుగా ఉందని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశాలున్నాయనే విషయం ముందస్తుగా గుర్తించవచ్చునంటున్నారు నిపుణులు. కోపంగా ఉన్న శునకం.. చెవులు వెనక్కు సాగదీస్తుందట. నోటిని గట్టిగా మూస్తుందని, తన రెండు కాళ్ల మధ్య తోకను ఉంచి గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తుంటుందని వెల్లడిస్తున్నారు. ఇక మొరగడం సరేసరి.
భౌభౌ.. కేర్ ఫుల్...
వీధికుక్కలకు ఈ సీజన్‌లో సరిగా ఆహారం దొరకదు. దానికి తోడు వేడి వాతావరణం కూడా వాటిలో అసహనాన్ని పెంచుతుంది. కాలే కడుపుతో వీధుల్లో ఇవి వీరంగాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఆహారం అందేలా చూడడంతో పాటు ముఖ్యంగా స్కూల్ లేదు కదా అని చిన్నారులను వీధుల్లోకి పంపవద్దు. పార్కులు, ఆటస్థలాల్లో కొంత రెక్కీ చేశాకే అనుమతించాలి. ఇక పెంపుడు కుక్కల్లో కొన్ని ప్రత్యేకమైన బ్రీడ్స్ అతిగా కరిచేవిగా గుర్తించారు. జర్మన్ షెపర్డ్, పిట్ బుల్ టెర్రిర్ వంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కుక్కలు డీహైడ్రేట్ అవకుండా ఎప్పటికప్పుడు వాటికి నీరు అందేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment