delhi bjp chief
-
ఆప్ చేతిలో ఓటమి.. ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీ పరాజయంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేశ్ గుప్తా. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది పార్టీ. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తెలిపింది. బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్‌గా 2020 జూన్‌లో నియామకమయ్యారు అదేశ్ గుప్తా. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ ఘన విజయం.. హస్తినలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో ఆగిపోయింది. మెజారిటీ సాధించకపోయినప్పటికీ మేయర్ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను గత శుక్రవారం కొట్టి పారేశారు అదేశ్ గుప్తా. మేయర్ పదవి ఆప్ చేపడుతుందని, బీజేపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్ జెండా -
లిక్కర్ స్కాంలో ‘హైదరాబాద్’ లింకులను కోర్టులో అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో హైదరాబాద్‌కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. గతంలో తాము చేసిన ఆరోప ణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ అక్కడే చెబుతామన్నారు. ఎంపీ సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌గుప్తాలతో కలిసి గురువారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంజిందర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని సుధాంశు త్రివేది, ఆదేశ్గుప్తా ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తా అని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్ సరఫరా చేశారని, బ్లాక్ దందా అంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే సప్లయ్ అయిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని, నిందితుడు అమిత్ అరోరాపై జరిగిన స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆదేశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మనోజ్ తివారీ స్థానంలో ఆదేశ్ గుప్తా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న ఆదేశ్ కుమార్ గుప్తా.. గతంలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా పనిచేశారు. కాగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న మనోజ్ తివారి 2016లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగాలని భావించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా తివారీకి బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు ఇటీవల తివారీ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. హరియాణాలోని ఓ అకాడమీలో క్రికెట్ ఆడటం వివాదానికి దారితీసింది. -
నన్నూ, మోదీని చంపుతామంటున్నారు!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీని, తనను చంపుతామని గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి హిందీలో తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెసేజ్‌ను శనివారం సాయంత్రం చూసినట్టు చెప్పారు. అందులో ‘‘ నేను మిమ్మల్ని, ప్రధానిని చంపాలనుకోవట్లేదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోంది. నన్ను క్షమించండ’’న్న అని పేర్కొని ఉంది. ఈ మెసేజ్ గురించి పోలీసులకు తెలియజేశానని ఆయన ఆదివారం వెల్లడించారు. కాగా, గత నెలలో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణస్వీకారానికి ముందురోజు కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి. మోదీని చంపుతామంటూ జైపూర్‌లోని బీజేపీ ఆఫీసుకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ చిరునామాలోని నలుగురు వ్యక్తులను విచారిస్తే, వారికేం తెలియదని తేలిందని జైపూర్ పోలీసు డిప్యూటీ కమిషనరు యోగేశ్ దధీచ్ తెలిపారు. -
ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు చేదుఅనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ‘అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు’ సామెత గుర్తుందికదా, దాదాపు అలాంటి చేదు అనుభవమే ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీకి ఎదురైంది. చైనా వస్తువుల వ్యతిరేక ర్యాలీకి వెళ్లిన ఆయన.. తన అమెరికా ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఏం జరిగిందంటే.. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మత సంస్థ ఆర్ఎస్ఎస్ వాణిజ్య విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్ సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఒక ర్యాలీని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కూడా పాలుపంచుకున్నారు. సభ ముగిసిన అనంతరం ఆయన తన ఫోన్ పోయినట్లు గుర్తించారు. అది.. అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ తయారి ‘ఐఫోన్ సెవెన్ ప్లస్’, ధర సుమారు రూ.55 వేలు! అనుచరులతో ఎంత వెతికించినా లాభంలేకపోవడంతో చివరికి తివారీ కమలా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. తన ఐఫోన్ తస్కరణకు గురైందని ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఎంపీగారి ఫోన్ జాడను కనిపెట్టేపనిలో పడ్డారు. భోజ్‌పురి నటుడు, సంగీతకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తివారీ.. 2014లో బీజేపీలో చేరి, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్ నుంచి బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
మనోజ్ తివారీ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఇంటిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిమంది కలిసి తివారీ ఇంటిపై దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయాన్ని స్వయంగా తివారీనే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘8-9మంది 159 నార్త్ అవెన్యూ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇది ముమ్మాటికీ దొంగదెబ్బే. ఈ ఘటనలో నా కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కూడా ఎడెనిమిదిమంది తివారీ ఇంటివద్ద అనవసర మాటలు అనుకుంటూ తిట్టుకుంటూ కనిపించారు. ఆ సమయంలో వారిని తివారీ ఇంటివద్ద పనిచేసే వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై దాడికి దిగి ఆయన ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. అయితే, పోలీసులు మాత్రం ఇది రోడ్డుపై జరిగే చిల్లర పంచాయితీలాంటిదని, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. మనోజ్ తివారీ మాత్రం తనపై చేసిన కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. పోలీసుల హస్తం కూడా ఇందులో ఉందంటూ ఆరోపించారు.