Delhi Mayor
-
Shelly Oberoi: మేయర్ పీఠంపై మాజీ ప్రొఫెసర్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆప్. డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో.. ఆప్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలపై సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో.. మేయర్ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఊరటతో ఆప్ విజయం సునాయసమైంది. ఆ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్.. బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. షెల్లీ ఒబెరాయ్(39).. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో ఉన్నత డిగ్రీ పూర్తి చేశారు. ఐఐఎం కోజికోడ్(కేరళ)లో మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా గతంలో పని చేసిన ఆమె.. మొట్టమొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్(86వ వార్డ్) నుంచి ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. 2013-14 నుంచి ఆప్‌లో కొనసాగుతున్న ఆమె.. 2020లో మహిళా మోర్చా విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రచార సమయంలో షెల్లీ ఒబెరాయ్ జనాల్లోకి వెళ్లిన తీరుపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. షెల్లీ ఒబెరాయ్ తండ్రి సతీష్ కుమార్ వ్యాపారవేత్త. తల్లి సరోజ్ గృహిణి. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. కిందటి నెలలో మేయర్ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పైనే తాజాగా ఆప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ::సాక్షి ప్రత్యేకం -
ఢిల్లీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
-
ఢిల్లీ మేయర్ ఎన్నిక: సస్పెన్స్‌కు తెర.. తేదీ ఖరారు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడింది. ఎన్నిక తేదీ ఖరారు అయ్యింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నికకు.. తాజా సుప్రీం కోర్టు తీర్పుతో మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు శనివారం మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎంసీడీ కార్యనిర్వాహక విభాగం. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజున మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే శుక్రవారం సుప్రీం కోర్టులో, ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి వ్యవహారంలో ఆప్ భారీ విజయం సొంతం చేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు ఓటేయడానికి వీల్లేదని, వాళ్లకు అర్హత లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్.. అదీ స్పష్టమైన తేదీతో వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎంసీడీ హెడ్. ఫిబ్రవరి 22వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటలకు ఎంసీడీ సదన్‌లో ఈ ఎన్నిక జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. ఆరుగురు సభ్యులుండే స్టాండింగ్ కమిటీని అదేరోజు ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా మేయర్ పదవికి ఎన్నిక జరగకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా.. బీజేపీ ఓటమి పాలైంది. అయితే మేయర్ పదవికి తొలుత పోటీ చేయమని ప్రకటించిన బీజేపీ.. అనూహ్యంగా చివరి నిమిషంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. ఆపై మూడుసార్లు మేయర్ ఎన్నిక కోసం హౌజ్ సమావేశం కాగా.. ఆప్-బీజేపీ సభ్యుల పరస్సర ఆరోపణలు.. అభ్యర్థుల ఆందోళనతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సత్య శర్మను నియమించడం దగ్గరి నుంచి నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం దాకా అంతా బీజేపీ అనుకూలంగా జరుతుతోందని, ఎల్జీ ఇదంతా బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది ఆప్. -
‘ఢిల్లీ మేయర్’ నేమ్ ప్లేట్‌తోనే ఉత్తర ఢిల్లీ మేయర్ కారు
న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభజన జరిగి దాదాపు రెండేళ్లవుతున్నా మేయర్ల కార్లపై ఉన్న నంబర్ ప్లేట్లు ఇంకా మారలేదు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యోగేంద్ర చందోలియా ఉపయోగిస్తున్న కారుపై ఇంకా ‘మహాపౌర్ ఢిల్లీ’(ఢిల్లీ మేయర్) ప్లేటు దర్శనమిస్తోంది. అయితే కారు ముందుభాగంలో ఎగురుతున్న జెండా మాత్రం ఉత్తర ఢిల్లీ మేయర్ అని తెలుపుతోంది. వెనుక ఉన్న నేమ్ ప్లేట్ మాత్రం ఇంకా మార్చలేదు. అధికారిక కార్యక్రమాలకు చందోలియా ఇదే కారును ఉపయోగిస్తుండడం, కారుపై ఢిల్లీ మేయర్ అని రాసి ఉండడంపై పలువురు చర్చించుకుంటున్నారు. బుధవారం సివిక్ సెంటర్‌కు చందోలియా ఇదే కారులో వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు నేమ్‌ప్లేట్‌ను ప్రత్యేకంగా ఫోకస్ చేసి చూపడంతో ఈ అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. -
దక్షిణ ఢిల్లీ మేయర్‌పై తాజా ఎఫ్ఐఆర్కు ఆదేశం
గుర్గావ్: బోగస్ ఓట్ల కేసుకు సంబంధించి హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్బీర్ కటారియాతోపాటు దక్షిణ ఢిల్లీ మేయర్ సరితాచౌదరిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మహేందర్‌సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హర్యానా యువజన, క్రీడా శాఖమంత్రి సుఖ్బీర్ కటారియాపై ఇప్పటికే ఆరు ఎఫ్ఐఆర్లు నమోదైన సంగతి విదితమే. తాజాగా ఆయనతోపాటు మరో 55 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1407 నంబరుగల ఇంట్లో నివాసముంటున్నట్టు పేర్కొన్న సరిత... గుర్గావ్ ఓటర్ల జాబితాలో చోటుసంపాదించుకున్నారని ఫిర్యాదుదారుడు, సామాజిక కార్యకర్త ఓంప్రకాశ్ కటారియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే చిరునామాపై మొత్తం 81 ఓట్లు ఉన్నాయని, అయితే ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో అదొక ఖాళీ స్థలమని తేలిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి భారతీయ శిక్షాస్మృతిలోని 420, 467, 468, 471, 120-బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
ఉత్తర ఢిల్లీ మేయర్‌గా చందోలియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నిరసనలు, వాకౌట్ల మధ్య ఉత్తరఢిల్లీ మూడో మేయర్‌గా యోగేందర్ చందోలియా ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ ఆజాద్‌సింగ్ తన వారసుడిగా చందోలియాను ప్రకటించారు. బీజీపే మద్దతుదారుల గుమిగూడడంతో సభ లోపల, బయట కొంత గందరగోళం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాలి కాబట్టి ఎన్డీఎమ్సీని (ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) వదిలి వెళ్లాల్సిందిగా చందోలియా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అయితే సభా కార్యకలాపాలు మొదలు కాగానే... ప్రతిపక్ష నేత ముఖేష్ గోయల్ నేతృత్వంలోని కాంగ్రెస్ కౌన్సిలర్లంతా నిరసనకు దిగారు. చందోలియాను అధికారికంగా మేయర్‌గా ప్రకటించకముందే వాకౌట్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వీళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోయల్ సభలో ఇంతటి గందరగోళం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని విచారం వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అలా సభలోకి చొచ్చుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు అలా వాకౌట్ చేయడంపై మేయర్ చందోలియా విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష సభ్యులకు ధన్యావాదాలు చెబుదామనుకునే సభలోకి వచ్చానని, అయితే కనీసం సభా కార్యకలాపాలు ముగిసేంతవరకు కూడా సభ్యులు సభలో ఉండకపోవడం బాధ కలిగించిందని చందోలియా అన్నారు. రానున్న వానాకాలంలో పరిశుభ్రత, వరదల నియంత్రణ తమ ప్రథమ కర్తవ్యాలుగా ఉంటాయని చందోలియా తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభజనకు ముందు 2010-11, 2011-12లో స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా సేవలందించారు. బీజేపీ కౌన్సిలర్ రవీంద్రగుప్తా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపల్ పదవుల్లో ఇది రెండో అత్యున్నత పదవి. బీజేపీ నుంచి రేఖాగుప్తా, సంజీవ్ నయ్యర్, కాంగ్రెస్ నుంచి పృథ్వీసింగ్ రాథోడ్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.