ఎంసీడీ భవనం వద్ద భద్రతా బలగాలు (పాత చిత్రం)
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడింది. ఎన్నిక తేదీ ఖరారు అయ్యింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నికకు.. తాజా సుప్రీం కోర్టు తీర్పుతో మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు శనివారం మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎంసీడీ కార్యనిర్వాహక విభాగం.
ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజున మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే శుక్రవారం సుప్రీం కోర్టులో, ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి వ్యవహారంలో ఆప్ భారీ విజయం సొంతం చేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు ఓటేయడానికి వీల్లేదని, వాళ్లకు అర్హత లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్.. అదీ స్పష్టమైన తేదీతో వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎంసీడీ హెడ్. ఫిబ్రవరి 22వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటలకు ఎంసీడీ సదన్‌లో ఈ ఎన్నిక జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. ఆరుగురు సభ్యులుండే స్టాండింగ్ కమిటీని అదేరోజు ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా మేయర్ పదవికి ఎన్నిక జరగకపోవడం గమనార్హం.
ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా.. బీజేపీ ఓటమి పాలైంది. అయితే మేయర్ పదవికి తొలుత పోటీ చేయమని ప్రకటించిన బీజేపీ.. అనూహ్యంగా చివరి నిమిషంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. ఆపై మూడుసార్లు మేయర్ ఎన్నిక కోసం హౌజ్ సమావేశం కాగా.. ఆప్-బీజేపీ సభ్యుల పరస్సర ఆరోపణలు.. అభ్యర్థుల ఆందోళనతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సత్య శర్మను నియమించడం దగ్గరి నుంచి నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం దాకా అంతా బీజేపీ అనుకూలంగా జరుతుతోందని, ఎల్జీ ఇదంతా బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది ఆప్.
Comments
Please login to add a commentAdd a comment