న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) మేయర్ క్యాండిడేట్‌ను ప్రకటించింది ఆ పార్టీ. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆప్ మేయర్ అభ్యర్థిగా మహిళ అభ్యర్థి పేరును ప్రతిపాదించింది.
షెల్లీ ఒబెరాయ్(39) పేరును మేయర్ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఆలే మొహమ్మద్ ఇక్బాల్ పేరిటి నామినేషన్ దాఖలు చేసింది. షెల్లీ ఒబెరాయ్.. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి ఆమె నెగ్గారు.
షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.
ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు ఆయన. మేయర్ పోస్ట్ నామినేషన్‌లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది.ఢిల్లీ మేయర్‌ను మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోటీలో మరొ అభ్యర్థి గనుక నిలబడకపోతే.. షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.
పదిహేనేళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొడుతూ.. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. ఆప్ విజయంతో మేయర్ పదవికి పోటీ పడే ఆలోచనలో లేనట్లు బీజేపీ ఇదివరకే ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment