న్యూఢిల్లీ: చాలా రోజులుగా తీవ్ర గందరగోళం నెలకొన్న దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీ మేయర్ పీఠాన్ని వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో.. ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ మరోసారి ఢిల్లీ మేయర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. మేయర్‌గా గెలుపొందేందుకు తగినంత బలం లేకపోవడంతో ఓటమిని ముందే ఊహించిన బీజేపీ పోటీ నుంచి వెనక్కి తగ్గడంతో షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా ఇదే జరిగింది. పోటీ నుంచి కాషాయ పార్టీ వైదొలగడంతో ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా కార్యకలాపాలను మే 2కు వాయిదా వేస్తున్నట్లు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు.
చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
ఇదిలా ఉండగా రెండు నెలలుగా వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఆ ఎన్నికలో మేయర్‌గా విజయం సాధించారు కూడా. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. మార్చి 31వ తేదీతో ఎంసీడీ హౌజ్ కాలపరిమితి ముగియడంతో మరోసారి తాజాగా ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆప్ తరపున బరిలోకి దిగిన షెల్లీ ఒబెరాయ్‌నే తక్కువ కాలంలోనే మరోసారి ఢిల్లీ మేయర్ పదవిని దక్కించుకున్నారు.
కాగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ మేయర్ ఒక సంవత్సరం పదవీకాలంలో ఉండనున్నారు. రొటేషన్ ప్రాతిపదికన అయిదు సంవత్సరాల పాటు ఒక్కో ఏడాది ఒక్కొకరు మేయర్‌గా ఉండనున్నారు. తొలి ఏడాది మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.
ఇక గతేడాది డిసెంబర్ 4న జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దీంతో ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 కైవసం చేసుకోగా, బీజేపీకి 104 వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment