ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది.
ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే.
పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే.
భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ.
600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ.
ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు.