Delhi Open ATP Challenger tournament
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాకేత్
న్యూఢిల్లీ: గతవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 158వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ ఎనిమిది స్థానాలు పడిపోయి 107వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతవారమే కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడాభివృద్ధి నిధి నుంచి యూకీకి రూ. 37 లక్షలు... సాకేత్‌కు రూ. 36 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. గతేడాది ఢిల్లీ ఓపెన్ విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ ఈసారి టోర్నీలో ఆడకపోవడంతో 87 స్థానాలు పడిపోయి 279వ ర్యాంక్‌లో నిలిచాడు. ఢిల్లీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన మహేశ్ భూపతి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 61 స్థానాలు పురోగతి సాధించి 225వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహన్ బోపన్న ఎనిమిదో ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 57వ ర్యాంక్‌లో ఉన్నారు. -
రన్నరప్ సాకేత్
న్యూఢిల్లీ: ఫైనల్ చేరే క్రమంలో నిలకడగా రాణిం చిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని కీలకమైన టైటిల్ పోరులో తడబడ్డాడు. ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 3-6, 0-6తో స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. గంటలోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ వరుసగా పది గేమ్‌లు కోల్పోయాడు. తొలి సెట్లో కాస్త పోటీనిచ్చిన అతను రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేశాడు. రన్నరప్‌గా నిలిచిన సాకేత్‌కు 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 91 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో సాకేత్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-150లోకి వచ్చే అవకాశముంది. -
ఫైనల్లో సాకేత్
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్ 6-3, 6-2తో రెండో సీడ్ కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం)పై గెలిచాడు. శక్తివంతమైన సర్వీస్‌లతో అదరగొట్టిన సాకేత్ ఆద్యంతం నిలకడగా ఆడి ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్)తో సాకేత్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో రాబర్ట్ 6-3, 6-2తో ఫ్లావియో సిపొల్లా (ఇటలీ)పై గెలిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6-3, 4-6, 10-5తో సాకేత్-సనమ్ సింగ్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
సాకేత్ జోరు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన సాకేత్... డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 6-3తో టాప్ సీడ్ దివిజ్ శరణ్ (భారత్)-ఫ్లావియో సిపొల్లా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 6-1తో జె లీ (చైనా)ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) జంటతో సాకేత్-సనమ్ తలపడతారు.