Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు.
4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు.
9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో..
స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు.
‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం
దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు.