Delhi Telugu Academy
-
మ్యూజికాలజిస్ట్ రాజాకు ఉగాది పురస్కారం
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర సంగీతంపై విశ్లేషణలు చేస్తున్న మ్యూజికాలజిస్ట్ రాజాకు ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన రాజా నలభై ఏళ్లుగా సినిమా పాటలపై పరిశోధనలు చేస్తున్నారు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ భాషలకు చెందిన నలభై వేలకు పైగా పాటల సమాచారాన్ని వెలికితీశారు. మహారాష్ట్ర గవర్నర్ సీ.హెచ్. విద్యాసాగరరావు చేతుల మీదుగా ఉగాది పుర స్కారంతో పాటు విశ్వప్రతిభా పురస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ–‘‘ తెలుగు సినిమా పాటలకు సంబం«ధించిన పూర్తి వివరాలు ప్రతి శ్రోతకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన ప్రారంభించానన్నారు. తన పరిశోధనకు సంబంధించిన పాటలను రాజా మ్యూజిక్ బ్యాంక్.కామ్ (rajamusicbank.com) వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తెలుగు సినిమా పాటలపై ప్రభుత్వం ఓ కమిటీ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. తన జీవితం తెలుగు సినిమా పాటకు అంకితమని ఆయన పేర్కొన్నారు. -
ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని శాసించే స్థాయికి తెలుగు భాష ఎదిగిందని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కొనియాడారు.ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు సమూహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడేవారంతా ఒకే సెల్‌ఫోన్ అని, డ్యూయల్ సిమ్ కార్డులు ఏపీ, తెలంగాణ అని పేర్కొన్నారు. తెలుగు భాషకు వెలకట్టలేమన్నారు. భవిష్యత్తులో తెలుగువారు ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలను గవర్నర్ విద్యాసాగర్‌రావు, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్.. వివిధ రంగాలకు ప్రముఖులకు అందజేశారు. -
ముగిసిన డీటీఏ వార్షికోత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: వారాంతాన్ని హస్తినలోని తెలుగువారు ఆహ్లాదంగా గడిపారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏపీభవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో సందడి మొదలైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్, ఉత్తరాఖండ్ గవర్నర్ డా.అజీజ్ ఖురేషి తదితరులు హాజరయ్యారు. సంగీత దర్శకుడు కె. రామాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెనింగ్‌లో ప్రముఖ గాయకురాలు విజయలక్ష్మి తదితరుల గేయాలాపన శ్రవణానందంగా సాగింది. అనంతరం హాస్యనటులు గౌతంరాజు, అశోక్‌కుమార్‌ల హాస్యోక్తులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇరువురి హాస్యవల్లరిలో అంతా హాయిగా నవ్వుకున్నారు. కాగా, కార్యక్రమానికి ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ దర్శకుడు డా. కె విశ్వనాథ్, నటుడు సాయికుమార్, తనికెళ్ల భరణి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్టు నిర్వాహకులు ముందస్తుగా ప్రచారం చేసినప్పటికీ వారెవరూ హాజరు కాలేదు. దీంతో వచ్చిన అతిథులకు ఉసూరుమనిపించింది. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీఏ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు
ఢిల్లీ తెలుగు అకాడమీ వార్షిక సాంస్కృతికోత్సవాలు మొదలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షిక సాంస్కృతికోత్సవాలు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణ, అబ్బురపరిచే నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. తొలి రోజున కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. గురు సీతా నాగజ్యోతి శిష్యురాలు ఎం. వైష్ణవి కూచిపూడి నాట్యంలో భాగంగా ప్రదర్శించిన పురంధర దాసుకీర్తన గజవదనాబేడువే , ఆదిశంకరాచార్య విరచితమైన లింగాష్టకం, నారాయణతీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి గోవర్దన గిరిధారి తరంగం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పళ్లెంలోనే తన శరీరాన్ని వెనక్కి వంచి ఆమె గోవర్దన పర్వతాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గురు జయరామారావు శిష్యురాలు టి. రెడ్డి లక్ష్మి ప్రదర్శించిన జయదుర్గే నృత్యం, కృష్ణ లీలలు, శివతరంగం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇంకా గురు వెంపటి చినసత్యం శిష్యురాలు జయప్రియ విక్రమన్ ప్రదర్శించినశ్రీ కృష్ణపారిజాతం నృత్యరూపకం మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచింది. చివరగా గురు ఉషారావు శిష్యుబందం అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజకీర్తనపై ప్రదర్శించిన భరతనాట్యం, థిల్లానా అలరించాయి. మాజీ ఎన్నికల కమిషనర్ జీవీఈ కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా గురుజయరామారావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.కాగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులోభాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడంతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గురు కె. రామాచారి , లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో సినీ భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. -
విశ్వభాషగా తెలుగు
సాక్షి, సిటీబ్యూరో: ‘హరిత, పారిశ్రామిక విప్లం పూర్తి చేసుకొని సాంకేతిక, సమాచారం విప్లవంలో ఉన్నాం. ప్రస్తుతం అంతర్జాలంలోకి ఎక్కి తెలుగును విశ్వభాషగా రూపొందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది’ అన్నారు రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ‘ఢిల్లీ తెలుగు అకాడమీ, రావడ ఫౌండేషన్ హైదరాబాద్’ సౌజన్యంతో ‘డీటీఏ అండ్ రావడ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు’ ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో జరిగింది. సంగీత సుధానిధి డి.వి.మోహన్‌కృష్ణ, ప్రముఖ సాహితీవేత్త పోతుకూచి సాంబశివరావు, ప్రజా వాగ్గేయకారుడు జయరాజులకు మంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థి ఎన్.శశిధర్ తల్లి సుజాత, ఇంజినీరింగ్ విద్యార్ధి ఎ.సాయిశ్రీనివాస్, ఐదో తరగతి విద్యార్థి సాయికిరణ్‌లకు మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. అదరహో: కార్యక్రమంలో కల్యాణి మ్యూజిక్ అకాడమీ 100 మంది విద్యార్థులతో నిర్వహించిన ‘శతవాద్య సంగీత విభావరి’ కళాభిమానులను పరవశులను చేసింది. రవళి, రవితేజలు 15 నిముషాల్లో నర్తించిన 6 భారతీయ సంప్రదాయ నృత్యాలు అబ్బురపరిచాయి. యూనిక్ వరల్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్ మాట్లాడుతూ... శతవాద్య సంగీత విభావరిని, నృత్యభారతిని ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘనతలను ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా పంపుతామన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు, డాక్టర్ గోపాలకృష్ణ, ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్.నాగరాజు పాల్గొన్నారు.