ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు
ఢిల్లీ తెలుగు అకాడమీ వార్షిక సాంస్కృతికోత్సవాలు మొదలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షిక సాంస్కృతికోత్సవాలు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణ, అబ్బురపరిచే నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. తొలి రోజున కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. గురు సీతా నాగజ్యోతి శిష్యురాలు ఎం. వైష్ణవి కూచిపూడి నాట్యంలో భాగంగా ప్రదర్శించిన పురంధర దాసుకీర్తన గజవదనాబేడువే , ఆదిశంకరాచార్య విరచితమైన లింగాష్టకం, నారాయణతీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి గోవర్దన గిరిధారి తరంగం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
పళ్లెంలోనే తన శరీరాన్ని వెనక్కి వంచి ఆమె గోవర్దన పర్వతాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గురు జయరామారావు శిష్యురాలు టి. రెడ్డి లక్ష్మి ప్రదర్శించిన జయదుర్గే నృత్యం, కృష్ణ లీలలు, శివతరంగం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇంకా గురు వెంపటి చినసత్యం శిష్యురాలు జయప్రియ విక్రమన్ ప్రదర్శించినశ్రీ కృష్ణపారిజాతం నృత్యరూపకం మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచింది.
చివరగా గురు ఉషారావు శిష్యుబందం అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజకీర్తనపై ప్రదర్శించిన భరతనాట్యం, థిల్లానా అలరించాయి. మాజీ ఎన్నికల కమిషనర్ జీవీఈ కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా గురుజయరామారావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.కాగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇందులోభాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడంతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గురు కె. రామాచారి , లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో సినీ భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది.