నాడు తలదించి నడిచిన బడుగు, బలహీన, అణగారిన వర్గాలు నిలువెత్తు ‘స్ఫూర్తి’ ఎదుట తలెత్తి చూసే కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేయబోతున్నారు. బెజవాడ నడిబొడ్డున ఓ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, మరో చేయి చూపుడు వేలితో గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఆకాశమంత ‘ఆదర్శం’ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటోంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికై న బెజవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల భారీ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం కొలువుదీరింది. ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా స్మృతి వనం ముస్తాబవుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నిలవనుంది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.400 కోట్లతో పనులు చేపట్టారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసే విధంగా పనులు నిర్వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షిస్తోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికతతో..
ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియం, మిని థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్‌ను 1500 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలను, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్ ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుపుతూ 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యంగ నిర్మాణ సమయంలోని ఛాయాచిత్రాలు, వస్తువులను ప్రదర్శించేలా మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే స్వయంగా సమాధానం ఇచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం తయారీని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్‌్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బీహర్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు, ఏడాదిన్నరకు పైగా పనిచేశారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మూడు ఫ్లోర్లుగా భవనం..
విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉంటాయి.
► గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక్కో హాలు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది.
► ఫస్ట్ ఫోర్‌లో 2,250చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాలులో అంబేడ్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు.
► సెకండ్ ఫ్లోర్‌లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాళ్లు ఉంటాయి.
ప్రాంగణం చుట్టూ సైక్లింగ్ ట్రాక్..
స్మృతి వనం చుట్టూ రూ.4 కోట్ల వ్యయంతో 2.7 కి.మీ మేర ప్రత్యేకమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. దీని పొడవునా గ్రీనరీ, పాత్‌వేస్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ స్ట్రీట్ వంటివి ఏర్పాటు చేయనున్నామన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో వాకింగ్, జాగింగ్ వంటివి చేసుకునే వెసులుబాటును కల్పించనున్నారు.
ఇది స్మృతి వనం స్వరూపం..
► అంబేడ్కర్ విగ్రహం ఎత్తు: 125 అడుగులు
► కింద బేస్(పెడస్టల్ ఎత్తు): 81 అడుగులు
► పెడస్టల్ పరిమాణం: 3,481 చదరపు అడుగులు
►పెడస్టల్‌తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు: 206 అడుగులు
► నిర్మించే గదులు: జీ ప్లస్ టు
►విగ్రహానికి వాడిన బ్రాంజ్: 112 మెట్రిక్ టన్నులు
► విగ్రహం నిర్మాణం లోపల (అర్మేచర్)కు వాడిన స్టీలు: 352 మెట్రిక్ టన్నులు
► మొదటి దశలో మంజూరైన నిధులు: రూ.268.46 కోట్లు
► రెండో దశలో మంజూరైన నిధులు: రూ.106.64 కోట్లు
► పనులు ప్రారంభం: 2022 మార్చి 21
జగనన్న నిర్ణయం చారిత్రాత్మకం
అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. గత టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని మన సీఎం కేటాయించారు.
– మేరుగ నాగార్జున, సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి
ప్రాంగణమంతా పచ్చందాలు..
స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయింది. మిగిలిన స్మృతి వనం పనులు తుది దశకు చేరాయి. కారిడార్ మొత్తం గ్రానైట్ ఫుట్‌పాత్, ల్యాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో అందమైన మొక్కలతో ప్లాంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకొంటున్నాం.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మున్సిపల్ కమిషనర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment